శెభాష్ డాక్టర్ తెల్లం వెంకట్రావు.. అత్యవసర పరిస్థితిలో గర్భిణులకు పురుడుపోసిన ఎమ్మెల్యే

స్వప్న శిశువును ఆమె బంధువులకు అప్పగిస్తున్న ఎమ్మెల్యే
భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి రావటంతో.. నేనున్నానంటూ రంగంలోకి దిగి పురుడు పోశారు వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. గోదావరి వరద ఉద్ధృతితో ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం.. నిండు గర్భిణులను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించింది. ఇక్కడ అయిదుగురు సర్జన్లు ఉండాలి. ఇటీవల నలుగురు బదిలీ అయ్యారు. ఉన్న ఒక్క సర్జన్ (ఆసుపత్రి సూపరింటెండెంట్) కోర్టు పనిపై వెళ్లారు. మంగళవారం ఆసుపత్రిలోని గర్భిణుల్లో ఇద్దరికి పురిటి నొప్పులు రాగా.. సిజేరియన్ చేయాల్సి రావడంతో మిగతా వైద్యులు, సిబ్బంది కంగారుపడ్డారు. వేరేచోటుకు తరలించాలన్నా సాధ్యం కాలేదు. దీంతో శస్త్రచికిత్సల నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి వర్గాలు సమాచారాన్ని చేరవేశాయి. వరద సహాయక చర్యల్లో ఉన్న ఆయన.. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని గర్భిణులిద్దరికీ సిజేరియన్ చేశారు. దుమ్ముగూడెం మండలం డబ్ల్యూరేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్న రెండో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. చర్ల మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పిల్లి పుష్పలీల రెండో కాన్పులో ఆడబిడ్డను ప్రసవించింది. ప్రసూతి సేవలందించిన ఎమ్మెల్యేను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఎంఎస్ సర్జన్ అయిన తెల్లం.. గతంలో ఇదే ఆసుపత్రిలో సర్జన్‌గా సేవలందించారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతవాసుల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రసూతి సేవల్లో అనస్తీషియా డాక్టర్ మల్లేశ్, గైనకాలజిస్టు శ్రీనిధి, నర్సింగ్ సిబ్బంది కల్యాణి, విజయలక్ష్మి, మీనా, సీత, భవానీ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








