తెలుగు సంస్కృతికి నిలువుటద్దం

గాంధీ మహాత్ముడు ప్రవచించిన సిద్ధాంతాలకు, పాటించిన విలువలకు, స్థాపించిన ప్రమాణాలకు త్రికరణశుద్ధిగా కట్టుబడి నిరాడంబరంగా జీవించేవారు అసలైన గాంధేయవాదులు- ఓ గుల్జారీలాల్ నందాలా... ఓ వావిలాల గోపాల కృష్ణయ్యలా! వారికి గాంధేయవాదమంటే నినాదం కాదు- జీవన విధానం. ఆ కోవలోనివారు మండలి వేంకట కృష్ణారావు. నేటి నుంచి ఆయన శతజయంతి సంవత్సర వేడుకలు ప్రారంభమవుతున్నాయి.
పూలదండకు తలను వంచని బుద్ధిమంతులు ఉండరన్నారు సినారె. కానీ, అలాంటివారు ఉన్నారు. మండలి ఎన్నడూ పూలదండలను అనుమతించలేదు. తలను వంచలేదు. అన్నేళ్లు అధికారంలో ఉన్నా- ఆయనకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదు. ఇంటిస్థలం లేదు. ఆఖరికి కారు కూడా లేదు. శాసనసభ్యుడి కోటాలో హౌసింగ్ బోర్డు ఇంటిని కేటాయిస్తే- ప్రభుత్వం క్వార్టర్స్‌ను ఇచ్చింది చాలన్నారాయన. ఆపద్ధర్మ ప్రధానిగా అనేకమార్లు వ్యవహరించిన నందా శేషజీవితాన్ని దిల్లీలోని కూతురింట్లో గడిపారు. ఆయనకు సొంతిల్లు లేదు. వావిలాల గోపాలకృష్ణయ్య జీవితమంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. హైదరాబాద్-అవనిగడ్డల మధ్య మండలి సామాన్య ప్రయాణికుడిలా బస్సుల్లో తిరిగేవారు. గాంధేయవాదమంటే ప్రదర్శన కాదు- ప్రవర్తన! స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో లభించిన అయిదెకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చారు మండలి. చిన్నతనంనుంచే ఖద్దరు ధరించడం తండ్రి వెంకట్రామయ్య నుంచి సంక్రమించిన సంస్కార విశేషం. మండలి విషయంలో ఖద్దరు వస్త్రధారణమనేది గాంధీయిజానికి సంపూర్ణ శరణాగతిగా గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే ఆయన గాంధీజీని అనుకరించలేదు- అనుసరించారు. గాంధీజీ శతజయంతిని పురస్కరించుకొని 1969లో అవనిగడ్డలో ‘గాంధీక్షేత్రం’ ఏర్పాటుచేశారు మండలి. అది అక్షరాలా గాంధీజీ ఆశయాల సాధనకు ఆవిర్భవించిన కార్యక్షేత్రం. గ్రంథాలయాలు, మహిళా మండళ్లు, కార్యకర్తల శిబిరాల్లో చరఖా శిక్షణల వంటివి గాంధీక్షేత్రానికి అనుబంధ సుగంధాలు. ‘ఆనందమనేది ఎన్నింటిని పొందామనేదానికన్నా- ఎన్నింటిని ఒదులుకొన్నామన్నదానిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది’ అన్నారు గాంధీజీ. కృష్ణారావు జీవితంలో ఆ తరహా చిత్తశుద్ధిని గుర్తించారు కాబట్టే- కృష్ణాపత్రిక సంపాదకీయంలో మండలిని ‘అవనిగడ్డ గాంధీ’గా అభివర్ణించారు పిరాట్ల వేంకటేశ్వర్లు.
ప్రజలకు తోడూనీడై...
సిరిసంపదలు వెనకేసుకోవడం కాదు, అవసరమైతే తమ పెద్దలు వెనకేసిన దాన్ని సైతం ప్రజల కోసం వెచ్చించేందుకు వెనకాడకపోవడం రాజకీయ నేతలకు ఆదర్శం- ఓ లాల్‌బహాదుర్ శాస్త్రిలా... ఓ టంగుటూరి ప్రకాశంలా! మండలి ఆ జాబితాలో చేరిన నాయకుడు. 1977 దివిసీమ ఉప్పెన ఆ ప్రాంత వృద్ధులకు ఇప్పటికీ ఓ భయంకరమైన పీడకల. దశాబ్దాల అభివృద్ధిని ఓ కాళరాత్రి తుడిచి పారేసింది. ప్రజల బతుకుల్లో చీకటిని చిమ్మింది. చలించిపోయారు మండలి. ఉన్మత్త చిత్తులైపోయారు- దుఃఖంతో. పంచె పైకి ఎగగట్టి బురదలోకి దిగారు- కసిగా..! శ్రమించింది- ఒకటి రెండు రోజులుకాదు- నెలరోజులుపైగా! 1972లో తనను శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తన ప్రజలకు తానెంతవరకు చేయగలరో- అంతకుమించి చేశారు. చేయించారు. తిండితిప్పలకు లోటులేకుండా చూశారు. బాధితులు మానసికంగానూ తేటపడేందుకు హైదరాబాద్ నుంచి ఎందరో కళాకారులను రప్పించి బుర్రకథలను, నాటకాలను నడిపించారు. జనం త్వరగా తేరుకొనేలా చేశారు. ఓదార్పు అనే మాటకు అర్థం- మళ్లీ మనిషిని చేయడమేనని నిరూపించారు. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ఆ శాఖ మంత్రిగా కలత చెందిన లాల్‌బహాదుర్ శాస్త్రి మంత్రిపదవికి రాజీనామా ఎందుకు చేశారంటే- అదంతే! బారిస్టర్‌గా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రకాశం ప్రజలకోసం వృత్తిని వదిలేసి, చిరిగిన చొక్కాను తానే స్వయంగా కుట్టుకుని ధరించేంత పేదరికాన్ని ఎందుకు వరించారంటే- అదంతే! ఇప్పటి నాయకులకు అర్థమయ్యే విషయం కాదది. గాంధీయిజం పరువొక్కటేకాదు- చాలా బరువు కూడా! మండలి కృష్ణారావు వంటి ఆ తరం నేతలకే తెలుస్తుందది. కాకలు తీరిన నాయకుడు బెజవాడ గోపాలరెడ్డి- ‘నా అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మంత్రికైనా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానంటే- ఒక్క మండలి కృష్ణారావుకే’ అని విజయవాడ సభలో బాహాటంగా ప్రకటించారు. అది మండలి సేవాతత్పరతకు విలువైన యోగ్యతాపత్రం!
‘విద్యాగంధం లేని విద్యామంత్రి’ అన్నారు మండలినొక ప్రతిపక్షనాయకుడు. అదే మండలికి ఉపాధ్యాయ ‘దినం’ పదంలోని అపశ్రుతి చెవికి సోకి సెప్టెంబరు 5వ తేదీని ‘గురుపూజోత్సవం’గా మార్చాలన్న ఊహ తోచింది. శబ్దశక్తి తెలియడమంటే- అది! చదువుతో రాదది- సంస్కారంతో వస్తుంది. ఆ భాషా సంస్కారం- తెలుగు తియ్యదనాన్ని పౌరుషాన్ని శరీరంలోని అణువణువునా జీర్ణించుకున్న నందమూరి తారక రామారావులో చూస్తాం. తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పాలన్న తపన- బెజవాడ గోపాలరెడ్డికీ ఉండేది. ఆ ఇద్దరి సరసన చేరగల వీర భాషాభిమాని- మండలి.
అమ్మభాషకు అక్షరాభిషేకం
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక తెలుగుభాషకు తొలిసారిగా జరిగిన వైభవోపేతమైన సీమంతపు వేడుకలే- ప్రపంచ తెలుగు మహాసభలు! 1975 ఏప్రిల్ 12 ఉగాదినాడు మొదలై వారంపాటు అమ్మభాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకం- నభూతో..! దాని పురోహితులు- మండలి కృష్ణారావు! రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన మహామహుల ప్రతిభావిన్యాసాలతో, ఆత్మీయమైన ఆతిథ్యమర్యాదలతో, ‘చేయెత్తి జైకొట్టిన తెలుగోడి’ హర్షధ్వానాలతో సభాప్రాంగణం దద్దరిల్లిపోయింది. తెలుగు భాషా సాంస్కృతిక వారసత్వం సహస్రాక్షత్ సహస్రపాత్... అన్నట్లుగా వేయి ముఖాలతో నర్తించింది. ఆ విశ్వరూపాన్ని ఆస్వాదించి ఆసాంతం ఆలకించి తిలకించి పులకించినవారికి ఆ ఘట్టం గుర్తొస్తే ఇప్పటికీ శరీరం రోమాంచితమవుతుంది. నాటి తీర్మానాల్లోంచి చిగురు తొడిగిందే- ‘అంతర్జాతీయ తెలుగు సంస్థ!’ మంత్రి పదవిని తీసుకోమని ముఖ్యమంత్రి అంజయ్య కోరితే- వద్దు, ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఉంటానన్నారు మండలి. ఆ భాషా ప్రియత్వానికి, ఆయన దక్షతకు మూలకారణం- ‘ఆయన ప్రకృతియు నా యది మాయురే! ఒక జాతి ద్రవ్యమా అనిపించున్’ అన్న విశ్వనాథ ప్రశంసలో దొరుకుతుంది. ఒక మహా కవిసమ్రాట్‌దీ, మండలి వేంకట కృష్ణారావుదీ- ఒకే జీవ ప్రకృతి అట! అది ఈ జాతి ద్రవ్యమట! ఇంతకన్నా ఏం కావాలి మండలి వారికి!
ఎర్రాప్రగడ రామకృష్ణ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








