Fake Certificate: జాతి భవితతో చెలగాటమిది!

Eenadu icon
By Editorial Team Published : 02 Nov 2025 03:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

న్నేశాడంటే రాత్రికి రాత్రే ఇంటిని గుల్లచేసే గజదొంగ ఉన్నాడనుకోండి.. పోలీసులు ఏం చేయాలి? అతణ్ని అరెస్టు చేసి, పాతనేరాలు నిరూపించి, జైలుకు పంపాలి కదా. అలా కాకుండా ఫలానా దొంగ ఉన్నాడు జాగ్రత్త అని పొడిపొడి అక్షరాలతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో హెచ్చరిక ఒకటి పారేస్తే జనం భద్రంగా ఉంటారా? అలాగే ఆడపిల్లలను వేధించుకుని తినే ప్రబుద్ధులను కటకటాల వెనక్కి నెట్టకుండా.. వాళ్ల జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండండని పోస్టర్లు అంటిస్తే ప్రయోజనం ఏముంటుంది? నకిలీ విశ్వవిద్యాలయాల విషయంలో సర్కారీ యంత్రాంగం తీరు అచ్చంగా ఇలాగే అఘోరిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న దొంగ వర్సిటీలివి అంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఏటా వెబ్‌సైట్‌లో జాబితాలు ప్రకటిస్తోంది. వాటి గురించి రాష్ట్రాల ఉన్నత విద్యాశాఖలకు, ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాస్తున్నామని సెలవిస్తోంది. దాంతో ఒరుగుతున్నదేంటి? ఆ నకిలీలను నిర్వహించే కేటుగాళ్లను కనీసం తమలపాకుతో అయినా అదిలిస్తున్నారా? తనిఖీలు జరిపి మూయిస్తున్నారా? అబ్బెబ్బే.. ఏమాత్రం ఒళ్లలవకుండా ఏసీ రూముల్లో కూర్చుని జనానికి జాగ్రత్తలు చెప్పడమే నిజమైన ప్రజాసేవ అని బలంగా నమ్మే యంత్రాంగం నుంచి ఇలాంటివన్నీ ఆశించడం అత్యాశే! అందుకే ఏటా అవే నకిలీ వర్సిటీలు యూజీసీ లిస్టులో దర్శనమిస్తున్నాయి. ఎందరో విద్యార్థుల జీవితాలతో అవి యమ దర్జాగా చెలగాటం ఆడుతున్నాయి! 

గత నెలాఖరు నాటికి మన దేశంలో 22 నకిలీ వర్సిటీలు ఉన్నాయని యూజీసీ తాజాగా వెల్లడించింది. అందులో పది- దేశ రాజధానిలోనే నిక్షేపంగా వర్ధిల్లుతున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాలుగు, ఏపీ, పశ్చిమ్‌ బెంగాల్, కేరళల్లో రెండు చొప్పున, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి దందా సాగిస్తున్నాయి. దిల్లీలోని ఒకదాని పేరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌! మరొకటేమో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌! ఐఐటీలు, ఐఐఎంలను పోలిన పేర్లతో నిర్భయంగా బోర్డులు తెరిచారంటేనే అర్థమవ్వట్లేదా... అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యం మీద ఆ మోసగాళ్లకు ఎంత గట్టి నమ్మకం ఉందో! యూపీలోని నొయిడాలో మహామాయ టెక్నికల్‌ యూనివర్సిటీ అని మరొక సార్థక నామధేయ నకిలీ వర్సిటీ ఉంది. దాని వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే యూజీసీ, ఏఐసీటీఈ, ఫార్మాకౌన్సిల్, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్, మెడికల్‌ కౌన్సిల్‌.. ఇలా చాంతాడన్ని సంస్థల నుంచి అనుమతులు ఉన్నట్లు చెప్పుకొనే తప్పుడు ప్రకటన కనిపిస్తుంది. దానికి లూధియానాలో కూడా మరో బ్రాంచ్‌ ఉందట! ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్, ఓపెన్‌ యూనివర్సిటీ పేర్లతో పాటు ఆధ్యాత్మిక చదువులంటూ కొన్ని బోగస్‌ వర్సిటీలు వలలు విసురుతున్నాయి. నమ్మి వాటిలో చేరిన విద్యార్థులకు డబ్బూ పోయి విలువైన కాలమూ గంగలో కలిసిపోతోంది. మన విద్యావ్యవస్థను పరిహాసాల పాల్జేస్తున్న ఫేక్‌ వర్సిటీలపై మూడోకన్ను తెరవాల్సింది పోయి.. అరే బాబూ, మా బాధ్యతగా మేం చెప్పాం.. మోసపోతే అది మీ ఖర్మం అన్నట్లు వ్యవహరిస్తున్న వ్యవస్థను ఏమనాలి!?

దొంగ వర్సిటీలకు తోడు బూటకపు కళాశాలలకూ దేశీయంగా కొదవలేదు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఇలాంటివి ఇరవైకి పైగా ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ప్రభుత్వ అనుమతులు రాకున్నా ప్రవేశాలు జరిపి తీరా ఆఖరి పరీక్షల సమయంలో పిల్లల భవిష్యత్తును సాకుగా చూపి గుర్తింపునకు ఒత్తిడి తెచ్చే కాలేజీల తెలివితేటలను చూస్తే శకుని కూడా తెల్లమొహం వేయాల్సి వస్తుంది! ఇవి చాలవన్నట్లు నిర్దేశిత ప్రమాణాలు, తగిన మౌలిక వసతులు, అర్హులైన గురువులు, కనీసం పాఠాల ఊసేలేని కళాశాలలు చెదపురుగుల్లా పోగుపడి విద్యార్థుల ఉజ్జ్వల భవితను చీకట్లోకి నెడుతున్నాయి. మన ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజీల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీల కథ అంతులేని వ్యథ. ఉన్నవారూ సరిగ్గా క్లాసులకు రారు. చాలా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పీహెచ్‌డీలు చేసిన వారికి బదులు బీటెక్‌ ఉత్తీర్ణులే పాఠాలు చెబుతుంటారు. అలాంటి చచ్చుపుచ్చు కాలేజీల్లో చదివినవారు నేటి నైపుణ్య ఆధారిత ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారు? ఏనాడూ తరగతులు నిర్వహించిన పాపాన పోకపోయినా, అన్నీ సక్రమంగా నడిచినట్లు కాగితాలపై చూపించి పిల్లల నుంచి భారీగా డబ్బు గుంజి బీఈడీ పట్టాలు ప్రదానం చేసే కాలేజీలకు లెక్కేలేదు. వాటిని చేతపట్టుకుని ఉద్యోగాల్లోకి వచ్చేవారు భావిపౌరులను మేటిగా ఎలా తయారు చేయగలుగుతారు? ఒక ప్రాంతంలో అనుమతులు పొంది మరోచోట అనధికారికంగా కళాశాలలను నిర్వహిస్తున్న యాజమాన్యాలను అడ్డుకునే నాథులూ లేరు. వాటి మూలంగా అతివిలువైన విద్యాసంవత్సరాన్ని నష్టపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇంకోపక్క ‘న్యాక్‌’ గుర్తింపు కోసం అడ్డదారులు తొక్కుతున్న ఉదంతాలు, నకిలీ పట్టాల బాగోతాలు మన చదువుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఉన్నత చదువులకు పట్టిన ఈ మకిలిని వదిలించడానికి ప్రభుత్వాలేం చేస్తున్నాయి మరి అంటే- ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్లుగా వేడుక చూస్తూ కూర్చుంటున్నాయి! ఇండియా నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ముందు విద్యారంగాన్ని బాగుచేసుకోవాలన్న సోయి సర్కార్లకు వస్తుందంటారా అసలు? 

వేణుబాబు మన్నం


తుపాకుల నీడలో...

యుద్ధాలు, సాయుధ ఘర్షణలు, ఇతర హింసాత్మక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రాణాలు తీస్తున్నాయి. దాంతోపాటు తీవ్ర ఆర్థిక నష్టానికీ కారణమవుతున్నాయి. హింసా పూరిత వాతావరణం వల్ల నిరుడు ఆరు దేశాలు తమ జీడీపీలో 20శాతానికి పైగా నష్టపోయాయి. కొన్నింటిలో ఇది ముప్పై అయిదు శాతానికన్నా ఎక్కువగా ఉంది. 2024లో హింస వల్ల అత్యధికంగా ఆర్థికమూల్యాన్ని చెల్లించుకున్న పది దేశాలు, వాటి జీడీపీలో వాటిల్లిన నష్టం... (శాతాల్లో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు