Bank Charges: రుసుముల భారం... సామాన్యులకు దూరం!

Eenadu icon
By Editorial Desk Updated : 05 Jul 2025 06:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

బ్యాంకులు విధిస్తున్న అపరాధ రుసుములు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దాంతో అవి ఖాతాదారుల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ సామాన్య ప్రజలపై భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మన దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, వాటివల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లోని ఓ భారతీయ స్టేట్‌ బ్యాంకు శాఖ నుంచి ఒక ప్రైవేట్‌ కంపెనీ తమ ఆస్తులను తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. కాలపరిమితిలోపే మొత్తం రుణాన్ని వడ్డీతోపాటు తీర్చివేసింది. గడువుకన్నా ముందే అప్పు తీర్చడం నిబంధనలకు విరుద్ధమంటూ బ్యాంకు కోటి పదహారు లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేసింది. దీనిపై కంపెనీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

అదనపు బాదుళ్లెన్నో...

మధ్యతరగతి ప్రజలు తమ సేవింగ్స్‌ ఖాతాలో జమ చేసుకున్న డబ్బుల నుంచి అవసరాల కోసం ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి చాలా బ్యాంకులు నెలవ్యవధిలో పరిమిత సంఖ్యలోనే ఉచిత అవకాశం కల్పిస్తున్నాయి. ఆ తరవాత చేసే ఉపసంహరణలపై అపరాధ రుసుము విధిస్తున్నారు. ఖాతాలోని పొదుపు డబ్బులను వెనక్కి తీసుకునే స్వేచ్ఛ కూడా ఖాతాదారులకు ఉండదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు సేవింగ్స్‌ ఖాతాకు ఇచ్చే వడ్డీరేట్లు అత్యంత స్వల్పంగా ఉంటుండగా- నగదు బదిలీ, ఉపసంహరణ, మినిమం బ్యాలెన్స్‌ వంటి వాటికి మాత్రం రుసుములు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. కాలపరిమితి డిపాజిట్లను ముందుగానే ముగించినా వడ్డీలో ఎంతోకొంత కోత పడుతోంది. నగదు బదిలీ, చెక్కుల ద్వారా చెల్లింపులు, జమలు, జారీ చేసిన చెక్కు ఏ కారణంగా తిరస్కరణకు గురైనా అపరాధ సుంకం విధిస్తున్నారు. ఇళ్లు, వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి రుణాలైనా రిజర్వు బ్యాంకు రుణ విధానాన్ని అనుసరించే వడ్డీరేట్లు ఉంటాయి. వడ్డీ లేదా వాయిదా కట్టలేకపోయిన సందర్భాల్లో చక్రవడ్డీ వసూలు చేయడం కూడా బ్యాంకుల వ్యాపార విధానమే. రుణం తీసుకునేందుకు వసూలు చేసే ప్రాసెసింగ్‌ రుసుము, తాకట్టు పెట్టే ఆస్తుల తనిఖీ నిమిత్తం తీసుకునే రుసుము, న్యాయ సలహా కోసం బ్యాంకు న్యాయవాది ఫీజు తదితరాలన్నీ అదనపు భారాలే. అప్పు ముందుగానే పూర్తిగా చెల్లించేందుకు అపరాధ రుసుములు విధించడాన్ని చూస్తే, రుణవిముక్తిని సైతం అపరాధంగా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. 

దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ అభివృద్ధికి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ నరసింహన్‌ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్‌ రంగం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఎన్నో సంస్కరణలను సూచించినా, అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధనంలో సర్కారు వాటా కనీసం 51శాతం ఉంటుంది. అవి ప్రభుత్వ యాజమాన్యంలోనే పని చేస్తాయి. ప్రైవేటు తదితర బ్యాంకులు లాభాలపై ఆశతో తమ ఖాతాదారుల నుంచి అధిక రుసుములు వసూలు చేసినా, ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులైనా సామాన్య, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం జరిమానాలు విధించడం, అపరాధ రుసుములు వసూళ్లకు పోటీ పడుతుండటం దురదృష్టకరం.

ప్రజలకు చేరువైతేనే...

బ్యాంకులు సులభతరమైన రుణ సౌకర్యాలు కల్పిస్తూ, నిర్వహణ వ్యయం, ఆర్థిక పరిపుష్టి కోసం తగినన్ని లాభాలను ఆర్జించాలనుకోవడం ఆమోదయోగ్యమే. అయితే, అపరాధ రుసుములు, అనవసరమైన జరిమానాలు, సామాన్యులను భయపెట్టే నిబంధనలు, తీవ్ర జాప్యానికి దారితీసే నియమాలు వంటి అంశాలన్నీ మధ్యతరగతి ఖాతాదారులను బ్యాంకింగ్‌ వ్యవస్థకు మరింత దూరం చేస్తాయి. ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు ఆర్థిక సంస్థలు సామాన్యుల్ని మభ్యపెట్టి, ఆకర్షించి ఆర్థికంగా దండుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు ఆరోగ్యకరమైన విధానాలను అమలు చేయడం మేలు. సామాన్య ప్రజలకు పొదుపు పథకాలపై అవగాహన కలిగించడం, సరైన వడ్డీరేట్లు నిర్ణయించడం ద్వారా మరిన్ని డిపాజిట్లు సేకరించవచ్చు. బ్యాంకు ప్రాంగణంలో ఆహ్లాదకరమైన, సానుకూల వాతావరణాన్ని కల్పించాలి. ఖాతాదారులతో సమావేశాలు, ఫిర్యాదులపై తక్షణ చర్యలు, సులభతరమైన నిబంధనలు, అనవసర రుసుముల రద్దు, మెరుగైన సేవలు అందించడం వంటి వాటి ద్వారా బ్యాంకులు ప్రజలకు మరింతగా చేరువవ్వాలి. తద్వారా బ్యాకింగ్‌ వ్యవస్థ ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే వికసిత్‌ భారత్‌ సుసాధ్యమవుతుంది.


చవకైన మార్గం

తక్కువ ఖర్చుతోనే భారీ మొత్తంలో సరకులను తరలించడానికి, ప్రజారవాణాకు జలమార్గాలు బాగా ఉపయోగపడతాయి. దేశీయంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో నదులు, కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనన్ని చోట్ల జాతీయ జలమార్గాలను(ఎన్‌డబ్ల్యూ) కేంద్రం అభివృద్ధి చేస్తోంది. 2014-15లో దేశవ్యాప్తంగా అలాంటి మార్గాలు మొత్తం కలిపి 2,716 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉండేవి, 2023-24 నాటికి వాటి పొడవు 4,894 కిలోమీటర్లకు చేరింది. దేశీయంగా 2023-24లో వినియోగంలో ఉన్న ఆయా ఎన్‌డబ్ల్యూల పొడవు... (కిలోమీటర్లలో)

Tags :
Published : 05 Jul 2025 04:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు