IndusInd Bank: మోసాల ఖాతాలో మరో బ్యాంకు!

Eenadu icon
By Editorial Desk Updated : 30 May 2025 13:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఇండస్‌ఇండ్‌ బ్యాంకుకు దేశంలో అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా పేరుంది. ఇందులో పలు అకౌంటింగ్‌ మోసాలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఉదంతం బ్యాంకుల కార్యనిర్వహణ లొసుగులను బట్టబయలు చేసింది. దీంతో రిజర్వు బ్యాంకు, సెబీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ పరిస్థితుల్లో మన బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగానే ఉందంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా భరోసా ఇవ్వడం కాస్త ఊరట కలిగించేదే! 

ఇండస్‌ఇండ్‌ బ్యాంకుకు సంబంధించి గత కొంతకాలంగా విదేశీ మారకద్రవ్య డెరివేటివ్స్‌ లావాదేవీలలో జరుగుతున్న అవకతవకలు బయపడటంతో డిపాజిటర్లు, ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. డెరివేటివ్స్‌ లావాదేవీలలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, ఫలితంగా రెండువేల కోట్ల రూపాయలదాకా నష్టం వాటిల్లనుందన్న ఆడిటర్ల నివేదిక బహిర్గతం కావడంతో ఆ బ్యాంకు ఉన్నతాధికారులు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మూడు దశాబ్దాల చరిత్ర గల హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రతిష్ఠ మసకబారింది.

ముమ్మర తనిఖీలు 

తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశీ మారకద్రవ్య డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియోలో నిబంధనలకు విరుద్ధంగా కాకి లెక్కలు కట్టడంతో పాటు సూక్ష్మరుణ విభాగంలో రూ.674 కోట్ల మేర వడ్డీ ఆదాయాన్ని తప్పుగా చూపించారు. వీటితోపాటు మరిన్ని అకౌంటింగ్‌ మోసాలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రముఖ ఆడిట్‌ సంస్థలు (పీడబ్ల్యూసీ, గ్రాంట్‌ ధొరన్‌టన్‌) నిర్వహించిన ఫొరెన్సిక్‌ ఆడిట్‌లో అకౌంటింగ్‌ విధానాల ఉల్లంఘన పెద్దయెత్తున జరిగినట్లు తేలింది. యాజమాన్యం అవలంబించిన తప్పుడు అకౌంటింగ్, ట్రేడింగ్‌ విధానాల వల్ల బ్యాంకుకు రెండు వేల కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లిందని ఆ సంస్థలు నిర్ధారించాయి. దీనిపై ఒకవైపు రిజర్వు బ్యాంకు చర్యలు చేపడుతుండగా, మరోవైపు, బ్యాంకు షేర్ల క్రయవిక్రయాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. దాంతో సెక్యూరిటీ మార్కెట్లలో పాలుపంచుకోకుండా బ్యాంకు మాజీ సీఈవో, మరో నలుగురిపై సెబీ నిషేధం విధించింది. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంకు గతంలో భారీగా ఇచ్చిన సూక్ష్మ రుణాల్లో అధికశాతం పారుబాకీలుగా మారడం వెనక ఉన్న కారణాలను తనిఖీ బృందాలు లోతుగా పరిశీలిస్తున్న నేపథ్యంలో రుణ వితరణలో మరిన్ని లొసుగులు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా పారుబాకీల వర్గీకరణ ఆర్‌బీఐ నిబంధనల మేర జరగలేదని, బ్యాంకు పారుబాకీలను వాస్తవంగా ఉన్న వాటికంటే తక్కువగా చూపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కొనసాగుతున్న పలు అకౌంటింగ్‌ అవకతవకల వెనక బ్యాంకు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని, అవి మోసపూరితంగా జరిగినవేనని ఆడిటర్లే వెల్లడించడంతో మున్ముందు నియంత్రణ సంస్థలు వివిధ కోణాల్లో తనిఖీలు చేపట్టనున్నాయి. మోసపూరిత లెక్కల కారణంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంకు తొలిసారిగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.  

బాధ్యత అందరిదీ...

గతంలోనూ కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించి అకౌంటింగ్‌ విధానాలను ఇష్టానుసారం మార్చి తప్పుడు లెక్కలతో మాయ చేశాయి. కొన్ని బ్యాంకులు విచక్షణారహితంగా రుణ వితరణ, మోసపూరిత లావాదేవీలు, రుణఖాతాల ఎవర్‌ గ్రీనింగ్‌ వంటి తీవ్ర అనైతిక చర్యలకు పాల్పడ్డాయి. 2018లో పీఎన్‌బీలో దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా నకిలీ లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌(ఎల్‌ఓయూ)ల కుంభకోణం బయటపడింది. 2020లో యెస్‌ బ్యాంకులో జరిగిన మోసపూరిత కార్యకలాపాలు ఆ బ్యాంకు ప్రతిష్ఠను దిగజార్చి ప్రైవేటు బ్యాంకులపై ప్రజల నమ్మకాన్నే ప్రశ్నార్థకంగా మార్చాయి. తాజాగా ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఉదంతం ప్రైవేటు బ్యాంకుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. బ్యాంకుల్లో మోసాలు, అవకతవకలు జరిగిన ప్రతిసారీ అందుకు బాధ్యులు ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. అక్రమాలకు, మోసాలకు ఆయా బ్యాంకు యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలి. మోసపూరిత లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా బ్యాంకుల్లో నిఘా, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి బ్యాంకులోనూ వాటి పద్దులపై నిఘా ఉంచి, సకాలంలో లోటుపాట్లను గుర్తించేందుకు పలు అంచెల ఆడిట్‌ వ్యవస్థ ఉంది. ప్రతి బ్యాంకులోనూ రోజువారీ లావాదేవీలను ఏకకాలంలో తనిఖీ చేసే ప్రక్రియ, అంతర్గత ఆడిట్, ఇన్‌స్పెక్షన్‌ ఆడిట్, స్టాట్యూటరీ ఆడిట్‌లు జరుగుతుంటాయి. ఏటా రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకుల పద్దులను తనిఖీ చేస్తుంది. అయినా మోసపూరిత లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా బ్యాంకుల బ్యాలన్స్‌ షీట్లు వాటి వాస్తవ ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టేలా చూడాల్సిన బాధ్యత ఆడిటర్లదే. బ్యాంకులు నిబంధనలకు అనుగుణంగా పనిచేసేలా నియంత్రించే బాధ్యత రిజర్వు బ్యాంకుపై ఉంది. బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు, నిబంధనల ఉల్లంఘనలకు యాజమాన్యాలు, ఆడిటర్లు, రిజర్వు బ్యాంకుల వరకు అందరూ బాధ్యత వహించాల్సిందే.

పెరగాల్సిన నిఘా

భవిష్యత్తులో బ్యాంకుల్లో మోసపూరిత లావాదేవీలకు అడ్డుకట్ట పడాలంటే బ్యాంకు యాజమాన్యాలు, ఆడిటర్లు, రిజర్వు బ్యాంకులు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాంకు బోర్డుల్లో నిష్ణాతులకు చోటు కల్పించాలి. బోర్డు సమావేశాలు అర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఉత్తమ ‘కార్పొరేట్‌ గవర్నెన్స్‌’ విధానాలకు పెద్దపీట వేసి బ్యాంకు ప్రయోజనాలను కాపాడేందుకు బోర్డులు కృషి చేయాలి. మోసాలకు, అక్రమాలకు, అవినీతికి తావీయకుండా ఉన్నత ప్రమాణాలతో పనిచేయాలి. మోసాలను, అక్రమాలను సకాలంలో పసిగట్టి, యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లడంలో ఆడిటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బ్యాంకుల్లో మోసాలను, నిబంధనల ఉల్లంఘనలను ముందుగానే గుర్తించి, సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇందుకుగానూ రిజర్వు బ్యాంకు తన పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

Tags :
Published : 30 May 2025 02:39 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు