Inspiration story: ఆ ఓపిక మీకుందా!

Eenadu icon
By Editorial Desk Published : 02 Jan 2025 01:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ర్భగుడిలో పూజలందుకుంటున్న విగ్రహాన్ని గుడి మెట్లమీది రాయి అడిగిందట- నువ్వూ నేనూ ఇద్దరమూ రాళ్లమే అయినా నీకు మొక్కుతున్నారెందుకు, నన్ను తొక్కుతున్నారెందుకు.. అని. ‘నాకు ఈ రూపం రావడానికి- అన్నిపక్కల నుంచి లెక్కలేనన్ని ఉలి దెబ్బలు తగిలినా ఓర్చుకుని నిలబడ్డాను కాబట్టి‘ అని బదులిచ్చిందా విగ్రహం. 

చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌ అయిన దొమ్మరాజు గుకేశ్‌ మాటలు విన్నప్పుడు ఈ కథ గుర్తొచ్చింది. సూటూ బూటూ వేసుకుని నవ్వుతూ కన్పించిన ఆ అబ్బాయి ఆ స్థాయికి రావడానికి చేసిన సాధన... ఉలి దెబ్బలు తిని రాయి విగ్రహమవడం లాంటిదే. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోవడం ఒకెత్తయితే, దాన్ని చేరుకోవడానికి తగిన కృషి చేయడం మరొకెత్తు. 2013లో ఆనంద్, కార్లసన్‌ల మధ్య మ్యాచ్‌ చూశాడట చిన్నారి గుకేశ్‌. ఆ అద్దాల గదిలో కూర్చుని ఆడాలనీ, ప్రపంచ ఛాంపియన్‌ అవ్వాలనీ అనుకున్నాడట. అనుకుని ఊరుకోలేదు. పదకొండేళ్ల పాటు కఠోర సాధన చేశాడు. అతడి పట్టుదల చూసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ అండగా నిలిచారు తల్లిదండ్రులు. ఫలితమే... పన్నెండేళ్ల ఏడు నెలల 17 రోజుల పిన్న వయసులోనే గ్రాండ్‌ మాస్టర్‌ అయిన ఆటగాడిగా నిలిచాడు! ఆ ఉత్సాహంతో మరింతగా కష్టపడ్డాడు. చివరికి ప్రపంచ ఛాంపియన్‌గా విజయ పతాకాన్ని ఎగరేసి ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు గుకేశ్‌. ఒక విజయం మరో విజయానికి, కెరీర్లో మరింత పైకి ఎదగడానికి పునాది కావాలి కానీ అదే చివరిది కాకూడదనడానికి మరో ఉదాహరణ సచిన్, కాంబ్లీ. పాఠశాల స్థాయి క్రికెట్‌ పోటీల్లో ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు వారిద్దరూ. అమాంతంగా వచ్చి పడ్డ పేరు ప్రతిష్ఠలలో కాంబ్లీ చెదిరిపోయాడు. సచిన్‌ వాటిని నిలుపుకొని ఇంకా ఇంకా కష్టపడి పైకి వెళ్లాడు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగత బలహీనతలని అధిగమించగలిగితేనే విజయతీరాలకు చేరడం సాధ్యమవుతుంది.

ఏ రంగంలోనైనా లక్ష్యసాధన అనుకున్నంత తేలిక కాదు. ఎన్ని బాధలొచ్చినా పళ్ల బిగువున భరిస్తూ ముందుకు సాగే పట్టుదల అవసరం. ఒకసారి కొంతమందికి అడవిని దాటివెళ్లి ఆవల ఉన్న వస్తువును తెమ్మని- తలా ఒక దుంగను ఇచ్చి పంపారట. ఆ దుంగను మోసుకెళ్లడం ఎందుకని, ఎవరికి వారు ఇష్టం వచ్చినంత తెగ్గోసుకొని వెళ్లారట. తీరా చివరికి వచ్చేసరికి వాళ్లకిచ్చిన దుంగ అంత పొడవైన కాలవని దాటాల్సి వచ్చింది. అందరూ తెల్లమొహం వేశారు. ఏదో కారణం ఉండివుంటుందని ఊహించి దుంగని ఓపిగ్గా మోసుకొచ్చిన ఒక్క వ్యక్తి మాత్రమే కాలవ దాటి విజయం సాధించాడు. సాధించగలనన్న నమ్మకం, శ్రమించగల ఓర్పూ ఉన్నవారిని ఏ అవాంతరాలూ ఏమీ చేయలేవు.

శ్రీహరి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.