One state One RRB: విలీనంతో మేలెంత?

దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ‘ఒక రాష్ట్రం-ఒక గ్రామీణ బ్యాంకు’ నినాదంతో వాటి విలీనానికి ఇటీవల అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ విలీన ప్రక్రియను ఎందుకు చేపట్టారు? దానివల్ల గ్రామీణ బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందా? పల్లె భారతానికి బ్యాంకింగ్ దన్ను లభిస్తుందా?
దేశంలో పల్లెవాసుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక బ్యాంకులు అవసరమని 1975లో నరసింహన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. లాభాలతో నిమిత్తం లేకుండా, నిర్దిష్ట ప్రయోజనాలను ఆశించి వాటిని ఏర్పాటు 
చేయాల్సి ఉందని పేర్కొంది. అప్పటికే బంగ్లాదేశ్‌లో ఇలాంటి వ్యవస్థకు మహమ్మద్ యూనస్ బాటలు వేసి, విజయవంతంగా నిర్వహిస్తుండటం స్ఫూర్తినిచ్చింది. అలా కేంద్రం మొదటగా ఉత్తర్ ప్రదేశ్‌లో ‘ప్రథమా గ్రామీణ బ్యాంకు’తో ఆరంభించి దేశవ్యాప్తంగా 190కి పైగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)లను నెలకొల్పింది. వీటిలో కేంద్రం వాటా 50శాతమైతే, స్పాన్సర్ బ్యాంకుది 35శాతం, రాష్ట్ర ప్రభుత్వానిది 15శాతం. చిన్న సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమలు, సాధారణ పౌరుల ఆర్థిక అవసరాలను ఈ బ్యాంకులు తీరుస్తున్నప్పటికీ- సంస్థాగత లోపాల కారణంగా నష్టాల ఊబిలో కూరుకుపోయాయి.
గాడితప్పిన లక్ష్యాలు
గ్రామాలే కేంద్రంగా ఈ బ్యాంకులు శాఖలను తెరుస్తాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, చేతివృత్తుల వారు తదితర లక్షిత వర్గాలకే ప్రధానంగా రుణాలిస్తాయి. తద్వారా వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి, చక్రవడ్డీల ఊబిలోంచి వారికి రక్షణ కల్పిస్తాయి. రుణాలు ఇవ్వడానికి సులభతరమైన నిబంధనలు పాటిస్తాయి కాబట్టి, లబ్ధిదారుల ఖర్చులు చాలావరకు తక్కువగానే ఉంటాయి. మరోవైపు గ్రామీణుల్లో, ముఖ్యంగా మహిళల్లో పొదుపును ప్రోత్సహిస్తూ డిపాజిట్లు స్వీకరిస్తాయి. నిర్దేశిత వర్గాలకు బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. ఇలాంటి లక్ష్యాలతో ఏర్పాటైన గ్రామీణ బ్యాంకులు మొదట్లో ఆశాజనకంగానే పనిచేశాయి. బ్యాంకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరీ విజయాలను సాధించారు. పోనుపోను కొన్ని బలహీనతల కారణంగా ఈ బ్యాంకులు నష్టాలబాట పట్టాయి.
వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే వీటి మూలధనం చాలా తక్కువ. దాంతో పరిమితంగానే రుణాలిస్తున్నాయి. స్పాన్సర్ బ్యాంకు అనవసర జోక్యం, సిబ్బందికి నామమాత్రంగా శిక్షణ ఇవ్వడం వల్ల తగిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ గ్రామీణ బ్యాంకు అధికారులకు లేకుండా పోయింది. రోజువారీ కార్యకలాపాలకు సైతం స్పాన్సర్ బ్యాంకుపై ఆధారపడాల్సిన దుస్థితి! ఇలాంటి పరిస్థితుల్లో రెండు బ్యాంకుల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి రాజకీయ నాయకుల జోక్యం తోడవడంతో గ్రామీణ బ్యాంకుల మూలాలు దెబ్బతిన్నాయి. ఈ దశలోనూ కేంద్ర ప్రభుత్వం చాలాకాలం పాటు ప్రేక్షక పాత్రకే పరిమితమైపోయింది. రిజర్వ్ బ్యాంకు, నాబార్డ్ సైతం అలాగే వ్యవహరించసాగాయి. ఓట్ల కోసం వివిధ రాజకీయ పార్టీలు రుణమాఫీ హామీలను గుప్పించడం పరిపాటిగా మారింది. ఎన్నికల్లో గెలిచిన తరవాత ఆ హామీల అమలుకు బ్యాంకింగ్ వ్యవస్థలను ఆశ్రయిస్తుండటంతో అవి గాడి తప్పుతున్నాయి.
గ్రామీణ బ్యాంకుల నష్టాలను తగ్గించే మార్గాల్ని అనేక కమిటీలు సూచించాయి. ఆ క్రమంలో అవి తమ మూలాలను మర్చిపోయి లాభాల కోసం పట్టణాలకు తరలిపోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పుడు చాలా గ్రామీణ బ్యాంకుల బోర్డు మీదే గ్రామం పేరు కనిపిస్తుంది. అధిక శాతం రుణాలను లక్షిత వర్గాలకు కాకుండా, నాన్-టార్గెట్ గ్రూపులకు అందిస్తున్నారు. ఇలాంటి దశలో బలమైన గ్రామీణ రుణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభించింది. 2013లో 190కి పైగా ఉన్న గ్రామీణ బ్యాంకులను 67కు కుదించింది. ఆ తరవాతా వాటి సంఖ్య మరింత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతమున్న 43 గ్రామీణ బ్యాంకులను విలీన ప్రక్రియ ద్వారా 28కి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే ఒకటి నుంచి ‘ఒకే రాష్ట్రం-ఒకే గ్రామీణ బ్యాంకు’ అమలులోకి వచ్చింది. దాంతో ఎప్పటినుంచో గ్రామీణ బ్యాంకులు ఆశిస్తున్న ‘నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు అటకెక్కినట్లయింది.
మరిన్ని మార్పులు అవసరం
మరి గ్రామీణ బ్యాంకుల కుదింపు ప్రక్రియతో వాటి స్థాపనా లక్ష్యం నెరవేరుతుందా, పల్లెల్లో బలహీన వర్గాలకు తగిన రుణ సదుపాయం అందుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! ఇప్పటికే రైతు సహకార సంఘాలు, సహకార బ్యాంకులు రాజకీయ జోక్యంతో నామమాత్రం అయ్యాయి. వాణిజ్య బ్యాంకులు గ్రామీణుల్లో ఉనికిని కాపాడుకోవడం కోసం తాపత్రయ పడుతున్నాయి. బంగారు ఆభరణాలపై సులభ రుణాలతో వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ రుణమాఫీ పథకాలతో రాని బాకీలను తగ్గించుకోవడానికి అన్ని బ్యాంకులూ ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు వేతనాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. పల్లె బ్యాంకులను గట్టెక్కించాలంటే ‘ఒకే రాష్ట్రం-ఒకే గ్రామీణ బ్యాంకు’ నినాదం ఒక్కటే సరిపోదు. దీంతోపాటు మరిన్ని సంస్థాగత మార్పులను తీసుకురావాల్సి ఉంది. గ్రామీణ బ్యాంకుల లక్ష్యాలను, మూలాలను మరవకూడదు. రైతులు, వ్యాపారులు, కుటీర పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. తమ ప్రయోజనాలను సాధించుకునే స్వతంత్రత, స్వయం ప్రతిపత్తిని గ్రామీణ బ్యాంకులకు కల్పించాలి. రాజకీయ, స్పాన్సర్ బ్యాంకు జోక్యాన్ని పరిమితం చేసి, జాతీయ స్థాయిలో ప్రత్యేక గ్రామీణ బ్యాంకు వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యావశ్యకం. సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పించడమే కాకుండా, ఈ బ్యాంకుల బలోపేతానికి ఉద్యోగ సంఘాలూ కలిసి రావాలి. గ్రామీణ బ్యాంకులను లాభాలతో ముడిపెడితే పల్లె భారతం ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని కేంద్రం, రాష్ట్రాలు గమనంలో ఉంచుకుని వాటిని మరింతగా పరిపుష్టం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 


