Cyclone Effects: గ్రామీణ జీవనోపాధులకు శరాఘాతం

Eenadu icon
By Editorial Team Published : 04 Nov 2025 02:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. వరద బీభత్సానికి లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా, పెద్దసంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. పశు సంపదకూ తీరని నష్టం వాటిల్లింది. ఎన్నో జీవాలు వరద ఉద్ధృతిలో గల్లంతయ్యాయి. గడ్డివాములు, పచ్చిక బయళ్లు జలమయం కావడంతో మేత అందక మిగిలిన పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వాలు సత్వరం దృష్టిసారించకపోతే పశుపోషణ మీదే ఆధారపడిన కుటుంబాలు తేరుకోలేవు.

మొంథా తుపాను ప్రభావం పాడి పశువులకు ప్రాణసంకటంగా మారింది. వరద ఉద్ధృతి కారణంగా రోజుల తరబడి చెమ్మ ఉండటంతో గడ్డి దొరకడం లేదు. దీనికి తోడు తవుడు, తెలగపిండి, మొక్కజొన్న వంటి దాణా ముడిసరకులు బూజు పడుతున్నాయి. సమీకృత దాణాలోనూ ఫంగస్‌ ఏర్పడి విషతుల్యమవుతోంది. కలుషిత నీటిని తాగడం వల్ల పశువులు, జీవాల్లో అతిసారం, అంటురోగాలు ప్రబలే పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన రెండు మూడు నెలల్లో పుట్టిన దూడలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుంది. సరైన సంరక్షణ, పోషణ అందకపోవడానికి తోడు బ్యాక్టీరియా, వైరస్‌ల బెడదను తాళలేక అవి మరణించే ప్రమాదముంది. బురద, మురుగుతో కూడిన నేలమీద ఉండే పశువులు, జీవాల కాళ్లగిట్టలు పాచిపట్టి, ఫుట్‌రాట్‌ వంటి సమస్యల వల్ల మృత్యువాత పడే పరిస్థితి తలెత్తవచ్చు. మేత కొరత, వాతావరణ ప్రతికూలతల వల్ల పాల దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి, ఎన్నో కుటుంబాల జీవనోపాధులను దెబ్బతీసే ఈ సమస్యలను అధిగమించడంపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలి.

వ్యాధులను తప్పించుకోవాలంటే...

తుపాను అనంతరం పశువుల్ని ముఖ్యంగా దూడల్ని చలిగాలుల నుంచి కాపాడుకోవడం చాలా అవసరం. ఇందుకోసం వాటికి సరైన రక్షణ కల్పించి, ఎండుగడ్డి లేదా పాత గోతాములతో పక్కను ఏర్పాటు చేయాలి. పాకల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. పశువుల వ్యర్థాలు దూరంగా తరలిపోయేలా తాత్కాలికంగానైనా మురుగు పారుదల ఏర్పాటు అవసరం. పాకలూ చుట్టుపక్కల పరిసరాలతో పాటు పశువుల మీద ఈగలు, దోమలు, గోమార్లు వంటివి చేరకుండా డెల్టామెథ్రిన్, సైపర్‌మెథ్రిన్‌ కార్బొరిల్‌ వంటి కీటక నాశకాలను నిర్ణీత మోతాదు మేరకు శుభ్రమైన నీటితో కలిపి స్ప్రే చేయాలి. తద్వారా పశువులను ప్రాణాంతకమైన కుందేటి వెర్రి, ఎర్రమూత్ర వ్యాధి, థెయిలీరియాసిస్‌ వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

తుపానులు, వరదలు, చలిగాలుల వల్ల పశువులకు కలిగే ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి. వాటికి తోడు రోగకారక క్రిములు సైతం ప్రబలడం వల్ల నిండు చూడి దశలో ఉన్న పశువులు గర్భస్రావాలకు లోనయ్యే ముప్పు ఎక్కువవుతుంది. కాబట్టి, వాటి విషయంలో పశువైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. వరదనీరు, మురుగు కలిసిన కలుషితమైన మేత వల్ల పశువుల్లో అంటురోగాలు విస్తరిస్తాయి. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే వెంటనే పేడ, రక్త నమూనాలను పరీక్షించి చికిత్స అందించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు వ్యాధుల బారిన పడకుండా పశువులకు టీకాలు వేయించడం మేలు.

బీమాతో నష్టనివారణ  

గడ్డివాములు వరదలో కొట్టుకుపోవడం, పశుగ్రాసం నీటమునిగి కుళ్లిపోవడం, దాణాలు బూజుపట్టడం వల్ల మేత కొరత ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాలిపోయిన వరి పైర్లు, అరటి చెట్ల ఆకులను సేకరించి కడిగి ఆరబెట్టుకోవాలి. తరవాత వాటిని ముక్కలుగా తరిగి పశువులకు మేపవచ్చు. ఎన్నో పోషక విలువలు కలిగిన మారేడు, నేరేడు, మామిడి, అవిసె, మునగ ఆకులను కూడా అందించవచ్చు. మొత్తం మేతలో 20శాతానికి మించకుండా వాగులు, చెరువులు, కాల్వలలో లభ్యమయ్యే నీటి కలుపు గుర్రపుడెక్కను కూడా పశువులకు మేపవచ్చు. వాటికి నీరు పెట్టే విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇండుపగింజ(చిల్లగింజ)లు, మునగ గింజలు లేదా పటికతో తేటపరచిన శుభ్రమైన నీటినే పశువులకు పెట్టాలి. బావులు, బోరుబావుల నుంచి తోడిన నీరైనా మంచిదే. కొన్నేళ్లుగా ప్రకృతి విపత్తులు పదేపదే విరుచుకుపడటం చూస్తున్నాం. వీటి మూలంగా వాటిల్లుతున్న నష్టాల నుంచి కొంతవరకైనా బయటపడాలంటే పశువులకు బీమా చేయించుకోవాల్సిందే. ఒకేసారి మూడేళ్లకు బీమా చేయిస్తే, ఖర్చు తగ్గుతుంది. ఇందుకు పాల సేకరణ సంస్థలు, ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకోవచ్చు. బీమా సంస్థలు నమోదుచేసిన గుర్తులు, వివరాలు, చెవులకు బిగించిన పోగు నంబర్ల ద్వారా వరదల్లో కొట్టుకుపోయిన, తప్పిపోయిన, అపహరణకు గురైన పశువులను సులభంగా గుర్తించవచ్చు. పాడి రైతులు ఎప్పటికప్పుడు వాతావరణశాఖ హెచ్చరికలను తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను చాలావరకు తప్పించుకోవచ్చు.


దయనీయ స్థితిలో..

మెరుగైన జీవితాన్ని ఆశించి భారతీయులు పెద్దసంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వలసవెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.  నిర్మాణాలు, చమురు, సహజవాయు సంస్థలు, ఆహార పానీయ పరిశ్రమలు, ఆతిథ్యం, ఆరోగ్య పరిరక్షణ, ఇంజినీరింగ్, ఐటీ తదితర రంగాల్లో పనిచేస్తున్నారు. ఇళ్లలో పనివారిగా, పశువుల కాపరులు, డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పారిశుద్ధ్య కార్మికులుగానూ ఉపాధి పొందుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అనారోగ్యం తదితర కారణాలతో గల్ఫ్‌లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. యజమానుల వేధింపులు, ఏజెంట్ల మోసాలు భరించలేక, ఇతర కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. గతేడాది గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ) దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన మొత్తం భారతీయులు...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు