PhD: పరిశోధక విద్య... నాణ్యత మిథ్య!

Eenadu icon
By Editorial Team Updated : 28 Oct 2025 01:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

నాసిరకమైన అధ్యయన అంశాలు, పరిశోధన సంస్కృతి లోపించడంతో మన విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేకపోతున్నాయి. అసమర్థ పర్యవేక్షణ, అసంపూర్తి శిక్షణా విధానాలు, మానసిక ఒత్తిళ్లు వంటి సమస్యలతో మన విద్యార్థులు ఎక్కువగా డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) వైపు వెళ్లడం లేదు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) అనేక మార్గదర్శకాలు రూపొందించినా పీహెచ్‌డీల్లో నాణ్యత పెరగడం లేదు. వైజ్ఞానిక రంగంలో ఇండియా సూపర్‌ పవర్‌గా ఎదగడానికిది అడ్డంకిగా మారుతోంది.

సంవత్సరానికి 71 వేల డాక్టరేట్ల ప్రదానంలో ప్రపంచంలోనే తొలిస్థానంలో అమెరికా ఉండగా,  56 వేలతో చైనా రెండోస్థానంలో ఉంది. మన దేశం 29 వేల డాక్టరేట్లను మాత్రమే అందిస్తోంది. ఈ క్రమంలో మన దేశంలో డాక్టరేట్‌ల విధానాన్ని పునర్‌ వ్యవస్థీకరించేందుకు యూజీసీ ప్రయత్నిస్తోంది. అత్యుత్తమ నాణ్యతతో కూడిన పీహెచ్‌డీ విద్యను అందించడం ద్వారా విద్యార్థులకు పరిశోధనా నైపుణ్యాలు మప్పాలనే లక్ష్యంతో యూజీసీ 2009లో పలు సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు పీహెచ్‌డీలో చేరిన తరవాత మొదటి సెమిస్టర్‌లో తప్పనిసరిగా కొన్ని కోర్సులు చేయాలని, వర్సిటీలు ఎంపిక చేసిన జర్నళ్లలో పరిశోధన పత్రం ప్రచురించాలని, మౌఖిక పరీక్ష నిర్వహించిన తరవాతే ఆ పత్రానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. పీహెచ్‌డీ విద్యార్థుల్లో తమ పరిశోధన పత్రాలు ఎక్కువ ప్రాచుర్యం పొందాలనే ఆలోచన పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి నిబంధనలు రూపొందించింది. అయితే, ఇలాంటి తప్పనిసరి నిబంధనల వల్ల పీహెచ్‌డీ విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను త్వరగా ప్రచురించాలనే ఉద్దేశంతో దారి తప్పుతున్నారు. సరైన సమీక్షలు లేకుండా, ప్రాసెసింగ్‌ ఫీజుల పేరుతో పెద్దమొత్తంలో డబ్బులకు గాలమేస్తూ లాభాపేక్ష ఎక్కువగా ఉండే తక్కువ స్థాయి జర్నళ్లలో ప్రచురణలకు ప్రయత్నిస్తున్నారు. ఇది అంతిమంగా పీహెచ్‌డీల్లో నాణ్యత లోపానికి దారితీస్తోంది.

నిబంధనలతో గందరగోళం

మరోవైపు, యూజీసీ చదువుల్లో నైపుణ్య సూచీలను ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా సిబ్బందిగా పని చేయాలన్నా, ప్రమోషన్లు రావాలన్నా తప్పనిసరిగా కొన్ని పరిశోధన పత్రాలను సమర్పించి ఉండాలనే నిబంధన విధించింది. దీంతో అనేకమంది బోధన సిబ్బంది తమ పరిశోధన పత్రాలను అత్యంత నాసిరకమైన జర్నళ్లలో ప్రచురించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న జర్నళ్లు దీన్నో వ్యాపారంగా మార్చుకోవడానికి ఇలాంటి నిబంధనలు ఉపకరించాయి. ఫలితంగా, అధ్యాపకులు సమర్పించే రీసెర్చ్‌ పేపర్ల సంఖ్య పెరిగిపోయింది. దేశంలో నాసిరకం నకిలీ పరిశోధక పత్రికలు కోకొల్లలుగా పుట్టుకురావడానికి యూజీసీనే కారణమంటూ ఇండియన్‌ సైన్స్‌ అకాడమీ సైతం విమర్శించింది. దీంతో 2018లో కన్సార్షియం ఫర్‌ అకడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌ ఎథిక్స్‌-కేర్‌ అనే సిస్టంను యూజీసీ ఏర్పాటుచేసింది. యూజీసీ ఎంపిక చేసిన కొన్ని జర్నళ్లలోనే విద్యార్థులు, బోధనా సిబ్బంది పరిశోధన పత్రాలను ప్రచురించాలని నిబంధనలు విధించింది. అయితే, యూజీసీ కొన్ని నాసిరకమైన పరిశోధక పత్రికలనే ఎంపిక చేసిందని, కొన్ని ఉన్నత ప్రమాణాలు కలిగిన పత్రికలను విస్మరించిందని, పత్రికల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. దీంతో 2025 ఫిబ్రవరిలో యూజీసీ-కేర్‌ సిస్టంను రద్దు చేశారు. యూజీసీ తాజాగా రూపొందించిన నిబంధనల ప్రకారం మొత్తం విధానాన్ని వికేంద్రీకరించారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది తమ పత్రాలను ప్రచురించాల్సిన పత్రికల నాణ్యతకు వారినే బాధ్యులుగా చేశారు. ఈ విధానమైనా లక్షిత విద్యా ప్రమాణాలను సాధిస్తుందని ఆశిస్తున్నారు.

అభ్యసనంపై దుష్ప్రభావం

రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులకు దిశానిర్దేశం చేయగల సమర్థులైన బోధన సిబ్బంది కొరత ఉంది. గైడ్ల సామర్థ్యం సరిపోకపోవడం, ఉత్సాహంగా పరిశోధనలు చేసే వాతావరణం లేకపోవడం, కాపీ సంస్కృతి నెలకొనడం వంటివి సైతం మన దేశంలో పీహెచ్‌డీలలో నాణ్యత కొరవడటానికి కారణాలుగా చెప్పవచ్చు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు చాలాకాలంగా చేపట్టడం లేదు. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరింతగా దిగజారింది. నాసిరకం పీహెచ్‌డీలు పొందిన విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో బోధకులుగా చేరితే అభ్యసనంపై దుష్ప్రభావం పడుతుంది. నూతన విద్యా విధానం కూడా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలని, ప్రాంతీయ భాషల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ విజ్ఞానాన్ని ఇనుమడింపజేయాలని సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యూజీసీ, ఉన్నత విద్యాసంస్థలు తమ పీహెచ్‌డీ కార్యక్రమాల్లో ప్రవేశాలను కట్టుదిట్టం చేయాలి. పరిశోధక అంశాల ఎంపిక, పర్యవేక్షణ, నిరంతర శిక్షణ, ప్రచురణ నాణ్యత, పరిశీలన వంటి ప్రతి దశను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 


ఆగని ఆత్మహత్యలు

కుటుంబ కలహాలు, కుంగుబాటు, అనారోగ్యం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, పరీక్షల్లో  ఫెయిలవడం తదితర కారణాలతో ఇండియాలో ఏటా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటోంది. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా బలవన్మరణాలకు ఒడిగడుతున్నారు. పోనుపోను ఆత్మహత్యల సంఖ్య మరింత పెరుగుతుండటం కలవరపరుస్తోంది. గడచిన పదేళ్లలో దేశీయంగా నమోదైన ఆత్మహత్యలు (లక్షల్లో)... 

Tags :
Published : 28 Oct 2025 01:54 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు