US-China: సంధి కుదిరింది కానీ... సయోధ్య కాదు!

Eenadu icon
By Editorial Team Published : 03 Nov 2025 02:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల సమావేశం సందర్భంగా వాణిజ్య సుంకాలు, ప్రతి సుంకాలపై వాదప్రతివాదాలు జరుగుతాయని చాలామంది భావించారు. అదేమీ లేకుండానే, ఆ భేటీలో తాత్కాలిక సంధి కుదిరింది. అంతా సద్దుమణిగింది. సుంకాల సమరంలో స్వల్ప విరామం వచ్చినట్లయింది.

చైనా ఎగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. మత్తుపదార్థమైన ఫెంటానిల్‌ తయారీకి ఉపకరించే ముడి పదార్థాల ఎగుమతిపై సుంకాలను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తామన్నారు. దీనికి బదులుగా అమెరికా నుంచి సోయాబీన్, తదితర వ్యవసాయ సరకులను పెద్ద మొత్తాల్లో కొనుగోలు చేస్తామని చైనా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు మరో ఏడాదిపాటు అరుదైన ఖనిజాల ఎగుమతిని నిరాటంకంగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. సెమీకండక్టర్ల తయారీకి, రక్షణ పరిశ్రమలకు, హరిత ఇంధన ఉత్పత్తికీ అరుదైన లోహాలు కీలకం. ప్రపంచంలో 80శాతం అరుదైన ఖనిజాల సరఫరా చైనా చేతుల్లోనే ఉంది. దీంతో డ్రాగన్‌పై ఎత్తిన సుంకాల కత్తిని అగ్రరాజ్యం తాత్కాలికంగా కిందకు దించింది. వాణిజ్య చర్చల్లో ఒక మెట్టు కిందకు దిగింది.

వాణిజ్య యుద్ధంలో తాత్కాలికంగా లభించిన విరామాన్ని చైనా సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోనుంది. తన ఎగుమతుల కోసం అమెరికా మార్కెట్‌పై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించుకునే అవకాశముంది. మరోవైపు ట్రంప్‌నకు చైనా మీద పైచేయి సాధించినట్లు తన ఓటర్లకు చాటుకోవడానికి వీలు చిక్కింది. చైనా నుంచి చవక సరకుల సరఫరా లేక అమెరికాలో ధరలు పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమయంలో తాత్కాలిక సంధితో పరిస్థితి కుదుటపడుతుందని ట్రంప్‌ ఆశిస్తున్నారు.

స్వావలంబన బాటలో చైనా

ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి చైనా మీద ఉరుముతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన 10 శాతం ఫెంటానిల్‌ సుంకం విధించారు. ఫెంటానిల్‌ ముడి సరకుల ఎగుమతిని చైనా నిరోధించలేకపోయిందంటూ నెల రోజుల తరవాత సుంకాన్ని 20శాతం చేశారు. ఇతర సరకుల ఎగుమతులపై కూడా ఎడాపెడా ప్రతీకార టారిఫ్‌లు వేసి, చైనా సరకులపై సుంకాలను ఏకంగా 145శాతానికి చేర్చారు. డ్రాగన్‌ చూస్తూ ఊరుకోలేదు. అమెరికా ఎగుమతులపై సుంకాలను 125 శాతానికి పెంచేసింది. చైనాకు అమెరికా ఎగుమతి చేసే ఇంధనం, వ్యవసాయ సరకులపై తీవ్ర ప్రభావం చూపింది. డ్రాగన్‌ అమెరికా నుంచి సోయాబీన్, కోడి, పంది మాంసం, మొక్కజొన్న, గోధుమలను కొనడం ఆపేసింది. ఇది ట్రంప్‌ గ్రామీణ ఓటర్ల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతేకాదు, అమెరికా వ్యవసాయ కంపెనీల లైసెన్సులను చైనా రద్దుచేసింది. అమెరికాకు గాలియం తదితర అరుదైన ఖనిజాల ఎగుమతిపై కంట్రోళ్లు విధించింది. అమెరికన్‌ కంపెనీలైన మైక్రాన్, బోయింగ్‌లను బ్లాక్‌లిస్టులో చేర్చింది. క్రమంగా ముదిరిన వాణిజ్య యుద్ధం- ఆపిల్, సీమెన్స్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీలను భారత్, వియత్నాం, మెక్సికో దేశాలకు తరలించేలా చేసింది. అయినా, చైనా ఆధిక్యమేమీ దెబ్బతినలేదు. అమెరికాకు 2025 మే నెలలో 2,880 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా ఎగుమతులు సెప్టెంబరుకల్లా 3,430 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. అమెరికా వినియోగదారులకు చవక చైనా వస్తువులు లేనిదే పూట గడవదని తేలిపోయింది. మరోవైపు అమెరికా సుంకాల దెబ్బకు భారత్‌ ఎగుమతులు 37శాతం తగ్గిపోయాయి. ఇండియాకన్నా తక్కువ సుంకాలు చెల్లించే దేశాలు ఆ మార్కెట్‌ను చేజిక్కించుకున్నాయి.

సెమీకండక్టర్లలో అమెరికా, చైనాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కృత్రిమ మేధకు అవసరమైన ఏ100, హెచ్‌100 చిప్‌లను అమెరికా కంపెనీ ఎన్విడియా తయారు చేస్తుంది. వీటిని చైనాకు విక్రయించరాదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌ గతంలో నిషేధించారు. దీంతో చైనా తక్కువ శక్తిమంతమైన హెచ్‌20 చిప్‌లను దిగుమతి చేసుకుని, వాటితో అవసరమైన పనితీరును రాబట్టుకుంది. ట్రంప్‌ హెచ్‌20తో సహా అన్ని రకాల చిప్‌ల ఎగుమతిని బంద్‌ చేశారు. కానీ అప్పటికే హువావై తదితర చైనా కంపెనీలు సొంతంగా ఎన్విడియాకు దీటైన చిప్స్‌ తయారు చేశాయి. చైనాలో ఎవరూ ఎన్విడియా చిప్స్‌ కొనవద్దని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. డ్రాగన్‌ ఎదుగుదలను అడ్డుకోవడానికి ట్రంప్‌ విధించిన ఆంక్షలు చివరికి చైనా స్వావలంబనకు దారితీశాయి. అమెరికన్‌ కంపెనీలకు చైనా అతిపెద్ద మార్కెట్‌. ట్రంప్‌ పుణ్యమా అని అది వాటి చేజారింది.

అన్ని రంగాల్లో ఢీ అంటే ఢీ

చైనా, అమెరికాలు ఒకరిపై ఒకరు ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తున్నాయి. చైనాలో ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పెట్టుబడిదారీ విధానం వేగంగా ఫలితాలనిస్తోంది. చైనా మేధోహక్కుల చౌర్యానికి పాల్పడుతోందనీ, తన దేశంలో పెట్టుబడులు పెట్టి కర్మాగారాలు నడపాలంటే పాశ్చాత్య సాంకేతికతలను తనకు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తోందనీ, ఇది అన్యాయమైన వాణిజ్య విధానమని అమెరికా రుసరుసలాడుతోంది. అమెరికా తన ఎగుమతులపై ఆంక్షలు విధించడం, ఇండో-పసిఫిక్‌లో క్వాడ్‌ పేరిట హడావుడి చేయడం తన ఎదుగుదలను అడ్డుకోవడానికేనని డ్రాగన్‌ ఆగ్రహిస్తోంది. దీంతో ఆర్థిక పోటీ కాస్తా సైనిక వ్యూహాత్మక పోరుగా మారిపోతోంది. నేడు అమెరికా, చైనాల పోటీ వాణిజ్యానికే పరిమితం కాకుండా అంతరిక్ష, డిజిటల్‌ సీమలకూ విస్తరించింది. అన్ని రంగాల్లో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో రెండు దేశాల మధ్య కుదిరిన సంధి తాత్కాలికం మాత్రమే. సుంకాలు తగ్గించడం, వ్యవసాయ సరకుల ఎగుమతులపై ఆంక్షలు సడలించడం పరిస్థితిని కాస్త మెరుగుపరచినా చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానంపై అమెరికా అభ్యంతరం అలాగే ఉంది. ఒకటి మాత్రం నిజం- చైనాను ఏకాకి చేయాలనుకుంటే తానూ ఏకాకినైపోతానని అమెరికాకు తెలిసివచ్చింది. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక రంగాల్లో యుద్ధాలకు ఇప్పుడు కాస్త విరామం వచ్చిందే కానీ పూర్తి సయోధ్య కుదిరే అవకాశం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సుఖీభవ

చదువు