యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఉపయోగాలెన్నో..!
ఇంటిని శుభ్రం చేయడం దగ్గరి నుంచి వంటలకు మంచి రుచి తీసుకురావడం దాకా.. ఎన్నో అవసరాల కోసం యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే దీన్ని మరెన్నో గృహావసరాలను తీర్చేందుకు సైతం....
ఇంటిని శుభ్రం చేయడం దగ్గరి నుంచి వంటలకు మంచి రుచి తీసుకురావడం దాకా.. ఎన్నో అవసరాల కోసం యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే దీన్ని మరెన్నో గృహావసరాలను తీర్చేందుకు సైతం ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందామా..?!
⚛ కొత్తగా కొన్న పాత్రలపై అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను తొలగించడం కాస్త కష్టమే. అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించి వాటిని సులభంగా తొలగించవచ్చు. స్ప్రే బాటిల్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ పోసి దాన్ని స్టిక్కర్లపై స్ప్రే చేయాలి. ఆ తర్వాత చేత్తో రుద్దితే అవి సులువుగా వదిలిపోతాయి.
⚛ పెరటి తోట, కుండీల్లో వచ్చే కలుపును ఈ వెనిగర్ సాయంతో నాశనం చేయచ్చు. దీనికోసం ముప్పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌లో పావు కప్పు నీటిని కలిపి స్ప్రేబాటిల్‌లో పోయాలి. దీన్ని కలుపు మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా వాటిని నాశనం చేయచ్చు.
⚛ చిన్నారుల పాలడబ్బాలు, పాలపీకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. వీటిని వెనిగర్‌తో శుభ్రం చేయడం ద్వారా బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుకోవచ్చు. వేడినీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి ఆ మిశ్రమంతో రోజుకోసారి పాలడబ్బాలు, పాలపీకలను కడగాలి. అనంతరం మరోసారి వేడినీటితో వీటిని కడగాలి. దీనివల్ల డబ్బా వెనిగర్ వాసన రాకుండా ఉంటుంది.
⚛ కొన్ని సందర్భాల్లో కొవ్వొత్తుల కారణంగా ఫ్లోర్, చెక్క వస్తువులపై మరకలు ఏర్పడతాయి. వాటిని యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా సులభంగా పోగొట్టవచ్చు. దీనికోసం సమాన పాళ్లలో యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని తీసుకొని, కలిపి అందులో వస్త్రాన్ని ముంచి మరక ఏర్పడిన చోట రుద్దితే సరి..!
⚛ ఉల్లి, వెల్లుల్లి, చేపలు, మాంసం వాసన చేతుల నుంచి అంత త్వరగా వదిలిపోదు. సబ్బుతో చేతులు కడిగినప్పటికీ ప్రయోజనం ఉండదు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సబ్బుతో చేతులు కడిగిన తర్వాత కొద్దిగా ఈ వెనిగర్‌ను నీటిలో కలిపి దానితో చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చేతుల నుంచి ఎలాంటి వాసన రాదు.
⚛ కళ్లద్దాలపై ఏర్పడిన మరకలను తొలగించాలంటే కష్టమే. ఎందుకంటే గట్టిగా తుడిస్తే.. అద్దంపై గీతలు పడే అవకాశాలున్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కళ్లద్దాలపై యాపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిస్తే మరక వదిలిపోతుంది.
⚛ ఆహారపదార్థాలు మాడిపోయినప్పుడు పాత్రలు నల్లగా తయారవుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఈ మరకలు సులభంగా వదులుతాయి. మాడిపోయిన పాత్రలో కప్పు నీరు, కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ పోసి స్టౌపై ఉంచి బాగా వేడి చేయాలి. స్టౌ కట్టేశాక రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కలిపితే నురగ మాదిరిగా వస్తుంది. అది రావడం ఆగిపోయిన తర్వాత పాత్రలోని మిశ్రమాన్ని ఒంపి నీటితో శుభ్రం చేయాలి. ఆపై పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.