థైరాయిడ్.. అవగాహనతో ముప్పు తప్పించుకుందాం!

నెలసరి సరిగ్గా రాకపోయినా.. పెళ్త్లె ఏళ్లు గడిచి పిల్లలు పుట్టకపోయినా.. విపరీతంగా బరువు పెరిగిపోతున్నా.. వెంటనే వైద్యులు సూచించే పరీక్షల్లో థైరాయిడ్ ముందుంటుంది. ‘థైరాయిడ్ అవగాహన దినోత్సవం’ సందర్భంగా ఈ సమస్యకు దారితీసే కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం..

Updated : 25 May 2023 18:06 IST

నెలసరి సరిగ్గా రాకపోయినా.. పెళ్త్లె ఏళ్లు గడిచి పిల్లలు పుట్టకపోయినా.. విపరీతంగా బరువు పెరిగిపోతున్నా.. వెంటనే వైద్యులు సూచించే పరీక్షల్లో థైరాయిడ్ ముందుంటుంది. ‘థైరాయిడ్ అవగాహన దినోత్సవం’ సందర్భంగా ఈ సమస్యకు దారితీసే కారణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం..

రెండు రకాలు..

థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఆ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతుల్యం లోపిస్తుందో అప్పుడు సమస్యలు తప్పవు. సాధారణంగా ఇది రెండు రకాలుగా ఇబ్బందికి గురి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని 'హైపర్ థైరాయిడిజం' అంటారు. తక్కువగా పని చేస్తున్నప్పుడు 'హైపో థైరాయిడిజం'గా పరిగణిస్తారు.

హైపర్ అయితే:

థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. గుండెదడ, బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమటలు పట్టడం, పేగుల కదలిక ఎక్కువ జరిగి విరేచనాలు కావడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

హైపో అయితే:

ఈ పరిస్థితిలో థైరాయిడ్ హార్మోను తక్కువగా విడుదలవుతుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. ఈ మార్పుతో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. దీనికి థైరాయిడ్ గ్రంథి ఇన్‌ఫెక్షన్ ఒక కారణం. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. ఎక్కువగా ప్రసవానంతరం కూడా రావచ్చు. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. దాంతో నిస్తేజంగా, నీరసంగా కనిపిస్తాం. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్న వారికి చెమటలు పడుతుంటే, ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్.. పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి. కొందరిలో కనుబొమలు వూడిపోతాయి. గొంతు కూడా బొంగురుపోతుంది. ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. చర్మం పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తోంటే థైరాయిడ్ సమస్య కారణమా అన్నది పరీక్ష చేయించుకోవాలి.

హార్మోన్ల సమతుల్యం అవసరం..

పై లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులు హార్మోన్ పరీక్షను సూచిస్తారు. జీవక్రియల పనితీరు బాగుండాలంటే థైరాయిడ్ పనితీరులో సమతుల్యం ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే నెలసరి మరీ ముందుగా లేదా మరీ ఆలస్యంగా రావచ్చు. ఒక్కోసారి అసలు రాకపోవచ్చు కూడా.

అలాగే అమ్మాయిలు పొడవు పెరగకపోవడం, విపరీతంగా బరువు పెరగడం జరుగుతుంది. నెలసరి అసలు మొదలుకాకపోవడం, పెళ్లయ్యాక గర్భం రాకపోవడం, ఒకవేళ వచ్చినా తరచూ ఏవో సమస్యలు చుట్టుముడుతుంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.

ఏ మాత్రం తేడా ఉన్నా డాక్టర్ సలహాతో మందులు వాడాలి. లేదంటే అది బిడ్డ మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఉమ్మనీరు తగ్గడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు బిడ్డ పుట్టడంతోనే హైపోథైరాయిడిజం సమస్య ఉండొచ్చు. కాబట్టి తల్లిలో ఆ సమస్య ఉందని తేలితే పాపాయికి పుట్టిన వెంటనే పరీక్ష చేయించాలి. అలాగే ప్రసవం తర్వాత కూడా హైపో థైరాయిడిజం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక విపరీతంగా బరువు పెరుగుతున్నట్లు కనిపించినా, నెలసరిలో తేడా వచ్చినా తేలిగ్గా తీసుకోకుండా పరీక్ష చేయించుకోవాలి.


ఆహారం విషయంలో...

ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా తలెత్తవచ్చు. ముఖ్యంగా హైపో థైరాయిడిజం జీవితాంతం కొనసాగవచ్చు. కాబట్టి వైద్యుల సలహాతో మందులు వాడాలి. హైపర్ ఉన్నవాళ్లు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ తగ్గిందని నిర్ధరించుకునేందుకు కచ్చితంగా మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి వాస్తుంది. అది కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. అలాంటి తేడా కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

అయొడిన్ ఉన్న ఉప్పు వాడటం వల్ల ఈ సమస్యను చాలామటుకు రాకుండా చూసుకోవచ్చు. అరటిపండ్లు, క్యారట్లు, పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల అయొడిన్ అందుతుంది.

థైరాయిడ్ హార్మోన్ పనితీరు సక్రమంగా ఉండాలంటే జింక్, రాగి లాంటి ఖనిజాల పాత్ర కూడా కీలకమే. అందుకే జింక్ ఎక్కువగా లభించే ఓట్‌మీల్, చేపలు, నట్స్ లాంటివి ఎంచుకోవాలి.

అలాగే కొన్ని పదార్థాలు థైరాయిడ్ హార్మోన్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే సమస్యను నిర్ధరించాక అలాంటి వాటిని తగ్గించాలి. ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిలగడ దుంపలు, ముల్లంగి, పాలిష్ చేసిన బియ్యం, గోధుమలు, సోయా ఉత్పత్తులు, కాఫీ, కూల్‌డ్రింక్స్‌ని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగవుతుంది. రోజూ కాసేపు నడవడం, డ్యాన్స్ చేయడం, ఏదైనా ఆట ఆడటం, యోగా చేయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఒత్తిడి కూడా థైరాయిడ్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రాణాయామం లాంటివి సాధన చేస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉంటాయి. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్