డేటింగ్ వెబ్‌సైట్లు చూస్తూ.. దగ్గరకు రావడం లేదు..!
నా వయసు 39 సంవత్సరాలు. మా పెళ్లై 12 ఏళ్లవుతోంది. మాకు స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజుల వరకు మా దాంపత్యం సాఫీగానే సాగింది. కానీ, ఈ మధ్య కాలంలో నా భర్త ఆలోచనల్లో చాలా మార్పు....
నా వయసు 39 సంవత్సరాలు. మా పెళ్లై 12 ఏళ్లవుతోంది. మాకు స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజుల వరకు మా దాంపత్యం సాఫీగానే సాగింది. కానీ, ఈ మధ్య కాలంలో నా భర్త ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే నా మీద చిరాకు పడుతున్నాడు. పిల్లలపై కూడా తరచూ అరుస్తున్నాడు. అంతేకాదు.. అడిగితే కానీ శృంగారానికి కూడా ఆసక్తి చూపడం లేదు. దీని గురించి అడిగితే పనితో అలసిపోయానని అంటున్నాడు. ఆయన నాకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేయడు. ఈ మధ్య నా భర్త ఆన్‌లైన్ డేటింగ్ సైట్లు చూడడం గమనించాను. కొంతమంది పరిచయం లేని అమ్మాయిలతో చాటింగ్ కూడా చేశాడు. దీనివల్లే అతని ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని అనిపిస్తోంది. ఈ విషయం గురించి నిలదీస్తే నా మీద కోపంతో ఊగిపోయాడు. అంతేకాదు.. అతని వ్యక్తిగత సమయాన్ని నేను హరిస్తున్నానంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతకుముందు తనని ఎప్పుడూ ఇలా చూడలేదు. కానీ, ఇప్పుడు మా మధ్య దూరం పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. దీర్ఘకాలిక అనుబంధంలో దంపతులిద్దరికీ స్పష్టమైన బాధ్యతలు ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. కానీ, కరోనా సమయంలో లాక్‌డౌన్ వల్ల చాలామంది పనితీరు మారిపోయింది. ఎక్కువభాగం ఇంటి వద్దే పనిచేయడం వల్ల కొంతమంది ఆలోచనల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. కొంతమందిలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొంతమంది వాటిని కుటుంబ సభ్యులపై కూడా చూపిస్తున్నారు. ఈ క్రమంలో- మీ భర్తలో ఇలాంటి లక్షణాలు ఇంతకు ముందెన్నడూ చూడలేదని అంటున్నారు. అలాగే మీది 12 ఏళ్ల దాంపత్య బంధం అని చెబుతున్నారు. కాబట్టి, మీరు ఒకసారి సానుకూల వాతావరణంలో అతనితోనే నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు, పిల్లలు పడుతోన్న ఇబ్బందులను అతనికి వివరించే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మీరిద్దరూ వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలను గుర్తు చేయండి. దీనివల్ల అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే అతను ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్లు చూస్తున్నాడని, అపరిచిత యువతులతో మాట్లాడుతున్నాడని అంటున్నారు. దానివల్లే అతని ఆలోచనల్లో మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అతనితోనే నేరుగా చర్చించండి. ఈ క్రమంలో మీనుంచి తను ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లల బాధ్యతలు కూడా అతనికి గుర్తు చేయండి. అప్పటికీ అతని ఆలోచనల్లో మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు అన్ని విషయాలు అడిగి మీ భర్త ఆలోచనల్లో మార్పు రావడానికి, మీ పై ఆసక్తి తగ్గడానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అతని ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, నిరాశపడకండి. మీ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.