Published : 16/03/2023 12:16 IST

ఆయన వల్ల పిల్లలకు పెళ్లిళ్లు కావట్లేదు!

(Representational Image)

నా భర్త వయసు 56 సంవత్సరాలు. తనకు భక్తి ఎక్కువ. పూజలు చేస్తే చాలు.. ఏ పనైనా పూర్తవుతుందనుకుంటారు. దీనివల్ల తను చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఈ మధ్య ఎవరో సిద్ధాంతి చెప్పారని ఇంట్లో రకరకాల పూజలు చేస్తున్నారు. వాటికి చాలా ఖర్చవుతోంది. అప్పులూ పెరుగుతున్నాయి. ఎంత చెప్పినా ఆయనలో మార్పు రావడం లేదు. మాకు ఇద్దరమ్మాయిలు. వాళ్లకు పాతికేళ్లు దాటిపోతున్నా పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం. ఈ విషయంలో పిల్లలకు, తండ్రికి మధ్య గొడవలవుతున్నాయి. దయచేసి మా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. - ఓ సోదరి

జ. మీ భర్తకు ఉన్న సమస్యను హిస్ట్రియోనిక్‌ బిహేవియర్‌ అంటాం. ఇలాంటి ప్రవర్తన ఉన్న వారు అత్యంత నాటకీయంగా ఆలోచిస్తుంటారు. ఏ కష్టం వచ్చినా దేవుడు చూసుకుంటాడన్న భావనలో ఉంటారు. అయితే ఆధ్యాత్మిక చింతన ఉండడం తప్పు కాదు. అలాగని గాల్లో దీపం పెట్టి దేవుడిపై భారం వేయడమూ సరికాదు. కాబట్టి, మనం చేయాల్సిన పనులు 100 శాతం పూర్తి చేయాలి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను దేవుడికి వదిలేయాలి.

మీరు ఎంత చెప్పినా మీ భర్తలో మార్పు రావట్లేదని అంటున్నారు. అలాగే ఈ విషయంలో మీ అమ్మాయిలకు, మీ భర్తకు మధ్య గొడవలవుతున్నాయని చెబుతున్నారు. దీనిని బట్టి అతని ఆలోచనలు కుటుంబ సభ్యులు చెప్పినా వినని పరిస్థితికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. కాబట్టి, అతనికి తప్పనిసరిగా చికిత్స/కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ భర్తను సైకియాట్రిస్ట్‌ లేదా సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లండి.

ఇలాంటి ప్రవర్తనకు ఎన్నో కారణాలుంటాయి. వారిలో కొన్ని భయాలు ఉండడం, గతంలో తమ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరగడం.. వంటివీ ఇందులో భాగమే. నిపుణుల వద్దకు వెళ్లినప్పుడు వారు అన్ని రకాల వివరాలు అడిగి తగిన సలహా/చికిత్స ఇస్తారు. తద్వారా మీవారు ఇంతకుముందులా సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని