‘రికార్డు’ల నిర్మలమ్మ.. మన సీతమ్మ..!

ఆదాయ, వ్యయాల్ని లెక్కకడుతూ ఇంటికి ఒక ఆర్థిక ప్రణాళికను ఎలా రూపొందించుకుంటామో.. దేశ ఆర్థిక ప్రగతిలో బడ్జెట్‌ పాత్ర అంతే కీలకం! కోట్లాది మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఆరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

Updated : 01 Feb 2024 17:21 IST

(Photos: Instagram)

ఆదాయ, వ్యయాల్ని లెక్కకడుతూ ఇంటికి ఒక ఆర్థిక ప్రణాళికను ఎలా రూపొందించుకుంటామో.. దేశ ఆర్థిక ప్రగతిలో బడ్జెట్‌ పాత్ర అంతే కీలకం! కోట్లాది మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఆరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనతను అందుకున్నారు. ఇదనే కాదు.. గత ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తోన్న నిర్మలమ్మ.. పద్దు విషయంలో పలు కొత్త సంప్రదాయాలకూ తెరతీశారు. మరికొన్ని రికార్డులూ తన పేరిట లిఖించుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తాజాగా నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. ఆమె సాధించిన పలు రికార్డుల్ని నెమరు వేసుకుందాం..!

డిజిటల్‌ బడ్జెట్

బ్రిటిష్‌ కాలం నుంచి ప్రవేశపెడుతూ వస్తోన్న కేంద్ర బడ్జెట్‌ ప్రతుల్ని.. 2018 దాకా లెదర్‌ సూట్‌కేస్‌లోనే పార్లమెంట్‌కు తీసుకొచ్చేవారు. కానీ 2019 నుంచి నిర్మలమ్మ ఈ సంప్రదాయానికి చెక్‌ పెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆ ఏడాది తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. వాటి తాలూకు ప్రతుల్ని ‘బాహీ ఖాతా’గా పిలిచే ఎరుపు రంగు క్లాత్‌ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం కూడా అమర్చారు. తద్వారా భారతీయ సంస్కృతికి తెర తీశారామె. ‘ఇకనైనా బ్రిటిష్‌ సంస్కృతికి చరమగీతం పాడి.. భారతీయ సంప్రదాయానికి తెరతీద్దాం.. పైగా బాహీ ఖాతా ద్వారా బడ్జెట్‌ ప్రతుల్ని మోసుకురావడం కూడా చాలా సులువు..’ అంటూ రెండేళ్ల పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించిన నిర్మలమ్మ.. 2021లో డిజిటల్‌ బడ్జెట్‌ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అటు కరోనాను, ఇటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఈ మార్పు చేశారామె. ఇందులో భాగంగానే ఓ యాప్‌ను కూడా లాంచ్‌ చేశారు. బడ్జెట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ సరళంగా, అందరికీ అర్థమయ్యేలా దీన్ని రూపొందించారు. ఆ ఏడాది నిర్వహించిన ‘హల్వా వేడుక’ (ఏటా బడ్జెట్‌కు ముందు రోజు నిర్వహించే వేడుక ఇది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి చేతుల మీదుగా బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న వారందరికీ హల్వాను పంచిపెడతారు..)లో భాగంగా ఈ యాప్‌ను విడుదల చేశారు. ఇక ఈసారి ‘దహీ-చీనీ (పెరుగు-చక్కెర)’ మిశ్రమంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్మలమ్మ నోరు తీపి చేసి.. శుభాకాంక్షలు తెలిపారు.

అరుదుగా ఆరోసారి!

2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. అయితే ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కానీ పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసి, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఘనత నిర్మలమ్మకే దక్కింది. ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలమ్మ. దీంతో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా అరుదైన కీర్తిని సొంతం చేసుకున్నారామె. గతంలో 1959-64 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డులకెక్కారు నిర్మలమ్మ.

సుదీర్ఘ ప్రసంగం!

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాదు.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ఈ క్రమంలోనే 2020-21 లో 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఇక 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జస్వంత్‌ సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. ఇలా ఎక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేయడమే కాదు.. ఈసారి కనిష్టంగా 57 నిమిషాల్లోనే బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించారు నిర్మలమ్మ. ఈ ఆరేళ్లలో ఆమె చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది. ఇక గతేడాది 86 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేశారామె.

మినీ బడ్జెట్‌ ఘనతా ఆమెదే!

సాధారణంగా బడ్జెట్‌ను ఏడాదికి ఒకసారే ప్రవేశపెడతారు. అయితే కరోనా కారణంగా 2021లో ఒకేసారి పెద్ద బడ్జెట్‌ కాకుండా.. నాలుగైదు చిన్న బడ్జెట్‌లను విడతల వారీగా ప్రవేశపెట్టారు నిర్మలమ్మ. ఆ సమయంలో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక ప్యాకేజీల రూపంలో మినీ బడ్జెట్‌లను రూపొందించారు. ఇలా మినీ బడ్జెట్‌లను తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలమ్మ ఖాతాలోనే చేరడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్