ఈ వందేళ్ల టీనేజర్.. ఫ్యాషన్ ఐకాన్!

ముదురు రంగు దుస్తులు, ఓవర్‌సైజ్‌డ్‌ అవుట్‌ఫిట్స్‌, ఇనుప గొలుసుల్లాంటి భారీ నగలు.. ‘ఇదేం వింత కాంబినేషన్‌?’ అనుకుంటున్నారా? కానీ ఇలాంటి అరుదైన కాంబినేషన్‌తో కూడిన దుస్తులు, నగల్ని ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది ఇరిస్‌ ఆప్‌ఫెల్‌. ప్రస్తుతం 101 ఏళ్ల వయసున్న...

Published : 26 Jun 2023 13:14 IST

(Photos: Instagram)

ముదురు రంగు దుస్తులు, ఓవర్‌సైజ్‌డ్‌ అవుట్‌ఫిట్స్‌, ఇనుప గొలుసుల్లాంటి భారీ నగలు.. ‘ఇదేం వింత కాంబినేషన్‌?’ అనుకుంటున్నారా? కానీ ఇలాంటి అరుదైన కాంబినేషన్‌తో కూడిన దుస్తులు, నగల్ని ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది ఇరిస్‌ ఆప్‌ఫెల్‌. ప్రస్తుతం 101 ఏళ్ల వయసున్న ఈ బామ్మ.. ఫ్యాషన్‌ డిజైనర్‌గా, మోడల్‌గా కొనసాగుతోంది. తన విభిన్న ఫ్యాషన్‌ ఎంపికలతో ప్రపంచంలోనే ‘ఓల్డెస్ట్‌ లివింగ్‌ టీనేజర్‌’గా పేరు తెచ్చుకుంది. ‘Eclectic ఫ్యాషన్‌ స్టైల్‌’ను ఫాలో అవడంలో ఆమె దిట్ట. అంటే.. విభిన్న కాలాలకు సంబంధించిన ఫ్యాషన్‌ శైలులను కలిపి ధరించడమన్నమాట! ఇలా రంగురంగుల దుస్తులు, నగలతో కలర్‌ఫుల్‌గా కనిపించే ఆమె ఇన్‌స్టా పేజీకి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లున్నారు. మరి, సెంచరీ దాటినా.. ఈ కాలం ఫ్యాషన్‌ డిజైనర్లతో పోటీపడుతూ.. రాణిస్తోన్న ఈ ఫ్యాషన్‌ గ్రానీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

ఇరిస్‌ ఆప్‌ఫెల్‌ది న్యూయార్క్‌లోని ఆస్టోరియా నగరం. తన తల్లిదండ్రులకు ఆమె ఒక్కర్తే సంతానం. తండ్రి గాజు వ్యాపారి.. కాగా, తల్లి ఫ్యాషన్‌ బొతిక్‌ నడిపేది. ఒక్కగానొక్క కూతురు కావడంతో అల్లారుముద్దుగా పెరిగింది ఇరిస్‌. సరికొత్త ఫ్యాషన్‌ స్టైల్స్‌ ఫాలో అవడం, నగల సేకరణను బాగా ఇష్టపడేదామె.

బహుముఖ ప్రజ్ఞాశాలి..!

చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి వివిధ దేశాల్లో పర్యటించిన ఆమె.. అక్కడి సంప్రదాయ వస్త్ర, నగల అందాలకు ఫిదా అయిపోయేది. అలా ఓసారి గ్రీన్‌విచ్‌ విలేజ్‌కి వెళ్లింది ఇరిస్‌. అక్కడి యాంటిక్ నగల దుకాణాల్లోని ఆభరణాలు ఆమెను మరింతగా ఆకట్టుకున్నాయి. వాటిలో తనకు నచ్చిన నగల్ని కొనుగోలు చేసిన ఆమె.. ఆపై ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల నుంచి నగల్ని సేకరించడం మొదలుపెట్టింది. అలాగని చదువునూ నిర్లక్ష్యం చేయలేదు ఇరిస్‌. నగలపై ఉన్న ఈ మక్కువే ఆమెను.. ఆర్ట్‌ హిస్టరీలో ఉన్నత చదువులు చదివేందుకు ప్రేరేపించింది. ఇక చదువు పూర్తయ్యాక ఓ ఫ్యాషన్‌ జర్నల్‌కు కాపీరైటర్‌గా పనిచేసిన ఇరిస్‌కు.. ఇంటీరియర్‌ డిజైనర్‌గా, ఇలస్ట్రేటర్‌గానూ అదనపు నైపుణ్యాలున్నాయి. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించిన ఈ అమెరికన్‌ ఫ్యాషనర్‌.. తన 40 ఏళ్ల వయసులో కార్ల్‌ ఆప్‌ఫెల్‌ను వివాహమాడింది.

9 మంది అధ్యక్షులకు..!

ఇరిస్‌ మాదిరిగానే కార్ల్‌కూ దుస్తుల డిజైనింగ్‌పై మక్కువ ఎక్కువ. ఇలా ఇద్దరి అభిరుచులు కలవడంతో.. పెళ్లైన రెండేళ్లకే వీరు.. ‘ఓల్డ్‌ వరల్డ్‌ వీవర్స్‌’ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అమెరికాలో దొరకని వింటేజ్‌ స్టైల్స్‌ని రూపొందించడం వీరి ప్రత్యేకత! ఇందుకోసం తరచూ యూరప్‌ వెళ్లి.. అక్కడ్నుంచి 17, 18, 19వ శతాబ్దాలకు చెందిన ప్రాచీన దుస్తుల్ని సేకరించి.. ఆ స్ఫూర్తితో విభిన్న స్టైల్స్‌లో దుస్తులు డిజైన్‌ చేసి ఇక్కడి వారికి అందించే వారు ఇరిస్ దంపతులు. అలా తమదైన ప్రత్యేకతలతో అనతికాలంలోనే పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న వీరు.. వివిధ రకాల ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ప్రాజెక్టుల్లోనూ భాగమయ్యారు. ఈ క్రమంలోనే వైట్‌హౌస్‌లో తొమ్మిది మంది అధ్యక్షులకూ దుస్తుల్ని రూపొందించే బాధ్యతనూ అందుకున్నారీ దంపతులు. వారిలో జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, జిమ్మీ కార్టన్‌, బిల్‌ క్లింటన్‌.. తదితరులున్నారు. తద్వారా ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ఫ్యాబ్రిక్‌’, ‘అవర్‌ లేడీ ఆఫ్‌ ది క్లాత్‌’.. వంటి బిరుదుల్నీ సొంతం చేసుకున్నారు ఇరిస్. ఇక 2011లో ఆస్టిన్‌లోని ‘టెక్సాస్‌ యూనివర్సిటీ’ విద్యార్థులకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై పాఠాలూ చెప్పారీ ఓల్డెస్ట్‌ డిజైనర్.

ఆమె స్టైలే వేరు!

తొమ్మిది మంది అమెరికా అధ్యక్షులకు దుస్తులు రూపొందించిన ఇరిస్‌.. మరోవైపు చవకైన మెటీరియల్‌తో కాస్ట్యూమ్‌ జ్యుయలరీనీ రూపొందించేవారు. అలా ఆమె తయారుచేసిన నగలు ‘Rara Avis: Selections from the Iris Apfel Collection’ పేరుతో ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. దాంతో ఆమె డిజైనింగ్‌ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి చేరువయ్యాయి. ఇలా విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు, నగలు రూపొందించడమే కాదు.. ‘Eclectic ఫ్యాషన్‌ స్టైల్‌’ను ఫాలో అవడంలో తనకు తానే సాటి! అంటే.. విభిన్న కాలాలకు సంబంధించిన ఫ్యాషన్‌ శైలులను కలిపి ధరించడమన్నమాట! ఈ క్రమంలో ముదురు రంగులో, బాగా వదులుగా ఉండే దుస్తుల్ని ఎంచుకునే ఆమె.. పెద్ద పెద్ద బీడ్స్‌/గొలుసుల్లాంటి .. భారీ జ్యుయలరీని తన డ్రస్‌కు మ్యాచ్‌ చేస్తుంటారు. ఇక తాను ఎంచుకునే ఇతర యాక్సెసరీస్‌ కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. ఎవరేమనుకున్నా.. తనకు నచ్చినట్లుగా ఉండడాన్ని ఇష్టపడే ఈ బామ్మ.. తన వింటేజ్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌కి సంబంధించిన ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. తద్వారా లక్షల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్నారు ఇరిస్‌. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా పేజీకి 27 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.


ఎన్నెన్నో ఘనతలు!

తన 42 ఏళ్ల వయసులో ప్రారంభమైన ఫ్యాషన్‌ జర్నీని నేటికీ విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఇరిస్‌. 2015లో తన భర్త మరణానంతరం ఓ టీవీ యాడ్‌లో నటించిన ఆమె.. ఆ మరుసటి ఏడాది ఓ స్మార్ట్‌ జ్యుయలరీ స్టార్టప్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.

2018లో హార్పర్‌ కోలిన్స్‌ సంస్థ ‘Iris Apfel: Accidental Icon’ పేరుతో ఇరిస్‌ జీవితకథను ప్రచురించింది.

2019లో తన 97 ఏళ్ల వయసులో ఓ మోడలింగ్‌ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన ఆమె.. ఓల్డెస్ట్‌ మోడల్‌గానూ సరికొత్త అవతారం ఎత్తారు.

‘ఇరిస్‌’ పేరుతో ఆమెపై రూపొందించిన డాక్యుమెంటరీ 2014 ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శితమైంది.

ఆమె అరుదైన ఫ్యాషన్‌ సెన్స్‌, ఫ్యాషన్‌ నైపుణ్యాలకు గుర్తింపుగా ‘ది గార్డియన్‌’ పత్రిక ‘బెస్ట్‌ డ్రస్‌డ్‌ ఓవర్‌ 50’ జాబితాలో ఆమెకు చోటు కల్పించి గౌరవించింది.

అమెరికాలోని విభిన్న ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్లలో ఆమె ఆభరణాలు ప్రదర్శితమయ్యాయి. అయితే ఫ్లోరిడాకు చెందిన ‘మ్యూజియం ఆఫ్‌ లైఫ్‌స్టైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ హిస్టరీ’ అనే స్వచ్ఛంద సంస్థ.. ఇరిస్‌ రూపొందించిన దుస్తులు, నగల్ని ప్రదర్శించేందుకు వీలుగా ఓ భవనాన్నే నిర్మించి ఆమెకు అంకితమివ్వడం విశేషం.

2018లో అమెరికాకు చెందిన మ్యాటెల్‌ సంస్థ ఇరిస్‌ను పోలిన బార్బీ డాల్‌ను రూపొందించి ఆమెను గౌరవించింది.

తన ఫ్యాషన్‌ సేవలకు గుర్తింపుగా ‘విమెన్స్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డే పయనీర్‌ అవార్డు’తో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలూ అందుకున్న ఇరిస్‌.. గతేడాది ఆగస్టులో 101వ పుట్టినరోజు జరుపుకొంది.

తన విభిన్న ఫ్యాషన్‌ ఎంపికలతో ‘వరల్డ్స్‌ ఓల్డెస్ట్‌ లివింగ్‌ టీనేజర్‌’గా గుర్తింపు పొందిన ఆమె.. తన ఆరోగ్యకరమైన జీవనశైలితో ప్రపంచంలోనే చురుకైన వ్యక్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్