మా బాస్ తనతో సంబంధం పెట్టుకోమంటున్నాడు..!
నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా బాస్ నాతో ప్రవర్తించే విధానం ఇబ్బందిగా ఉంటోంది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం నేను చేస్తోన్న ఉద్యోగం నాకు ఎంతో ముఖ్యం. దాంతో అతన్ని పూర్తిగా దూరం....
నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా బాస్ నాతో ప్రవర్తించే విధానం ఇబ్బందిగా ఉంటోంది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం నేను చేస్తోన్న ఉద్యోగం నాకు ఎంతో ముఖ్యం. దాంతో అతన్ని పూర్తిగా దూరం పెట్టలేకపోతున్నా. కానీ, నాకు భయంగా ఉంది. అతనికి పెళ్లైంది. అతనికి పెద్దవాళ్లతో పరిచయం కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. పని ప్రదేశంలో వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఎదురవుతుంటారు. అలాగే వివిధ రకాల సమస్యలు, సవాళ్లు కూడా ఉంటాయి. మహిళలుగా వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- మీ బాస్ తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడని అంటున్నారు. అతను మీ బాస్ కాబట్టి, ఉద్యోగ రీత్యా మీపై అతనికి కొన్ని రకాల అధికారాలు ఉంటాయి. కాబట్టి, అతన్నుంచి జాగ్రత్తగా బయటపడడానికి ప్రయత్నించండి. ఏదిఏమైనా ఉద్యోగం అనేది మీరు చేసే పని పైన, మీ ప్రతిభా సామర్ధ్యాల పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, భయపడకుండా మీ పని పైనే ఎక్కువ ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించండి.
సాధారణంగా వివిధ సంస్థల నిబంధనలు.. పని ప్రదేశంలో సహోద్యోగులతో ఎలాంటి అనుచిత సంబంధాలు కలిగి ఉండడానికి అంగీకరించవు. ఇలాంటి సంబంధాలు పని వాతావరణంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అందులోనూ అతనికి పెళ్లైందని అంటున్నారు. కాబట్టి, పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇలాంటి సంబంధాలు ఎవరికీ మంచివి కావు. కాబట్టి, దానికి వ్యతిరేకంగా పరిష్కారాన్ని అన్వేషించే ప్రయత్నం చేయండి.
మీ సమస్యంతా మీ బాస్‌తోటే కాబట్టి నేరుగా అతనితోనే చర్చించే ప్రయత్నం చేయండి. అతనితో వృత్తిగత సంబంధానికి మించి ఇతర సంబంధాలు పెట్టుకోవడానికి సుముఖంగా లేరన్న విషయాన్ని స్పష్టం చేయండి. ఒకవేళ అందుకు తను ఒప్పుకోకపోతే పని ప్రదేశంలో వివక్ష, లైంగిక వేధింపులకు సంబంధించిన నిబంధనలు/చట్టాల గురించి గుర్తు చేయండి. ఒకవేళ అప్పటికీ అతను అదే పద్ధతిని కొనసాగిస్తుంటే మాత్రం మానవ వనరుల విభాగం వారికి ఫిర్యాదు చేయండి. ఈ క్రమంలో- అతని మాటలు, నడవడికకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని కూడా అందించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది. ఈ క్రమంలో అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
అలాగే ఈ ఆలోచనల నుంచి ఇంకా బయటకు రాలేకుండా ఆందోళనకు గురవుతుంటే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు తగిన సలహా సూచిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.