అమ్మే నాన్నైతే...!
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం! పెంచి పెద్ద చేయడం, గౌరవ మర్యాదలు నేర్పించడం, విద్యాబుద్ధులు చెప్పడం, మంచి నడవడిక.. ఇలా అన్ని బాధ్యతల్నీ ఇద్దరూ కలిసి సమంగా పంచుకున్నప్పుడే....
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం! పెంచి పెద్ద చేయడం, గౌరవ మర్యాదలు నేర్పించడం, విద్యాబుద్ధులు చెప్పడం, మంచి నడవడిక.. ఇలా అన్ని బాధ్యతల్నీ ఇద్దరూ కలిసి సమంగా పంచుకున్నప్పుడే పిల్లలకు-తల్లిదండ్రులకు మధ్య అనుబంధం బలపడుతుంది. అయితే వివిధ కారణాల వల్ల ఒంటరిగానే తమ పిల్లల్ని పెంచే తల్లులూ మన చుట్టూ ఎందరో! కేవలం తల్లి పాత్రలోనే కాకుండా.. తండ్రి బాధ్యతల్నీ వారు సమర్థంగా నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో- ఒంటరి తల్లులు, వారి పిల్లలు తమ మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ‘ఫాదర్స్ డే’ మరొక మంచి సందర్భం.
అమ్మలు ఇలా..!
వారి మనసు తెలుసుకోండి..
తల్లి తన పిల్లలకు తండ్రి లేని లోటు ఎంతగా భర్తీ చేసినప్పటికీ ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒక చోట నాన్న లేని లోటు కొంతమంది పిల్లల మదిలో అలాగే ఉండిపోతుంది.. అది వేరే పిల్లల్ని చూసినప్పుడైనా కావచ్చు.. పేరెంట్-టీచర్ మీటింగ్‌లోనైనా కావచ్చు..! నిజానికి చిన్నారుల మదిలో నాటుకుపోయే ఇలాంటి భావాలు.. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకుండా ఉండాలంటే.. సింగిల్ మదర్స్ వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అయితే అందుకు ఫాదర్స్ డేను కూడా వేదికగా చేసుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో అందరు పిల్లల్లాగా మీ చిన్నారుల జీవితంలో తండ్రి ఎందుకు లేడో వారికి వివరించాలి.. పరిస్థితుల్ని వారికి అర్థం చేయించాలి. మీ నుంచి వారు ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి.. అప్పుడే ఇద్దరూ ఎలాంటి లోటూ లేకుండా సంతోషంగా ముందుకెళ్లగలుగుతారు.
మీ వాళ్లతో..!
తమ పిల్లల జీవితంలో తండ్రి పాత్రను పోషిస్తోన్న ఒంటరి తల్లులు.. తమ తండ్రులతో కలిసి కూడా ఫాదర్స్ డే జరుపుకోవచ్చు.. పైగా చిన్నారులకు వాళ్ల బామ్మ/అమ్మమ్మ-తాతయ్యలతో కలిసి సమయం గడపడం అంటే మహా సరదా! కాబట్టి ఈ ఫాదర్స్ డే రోజున మీరు మీ పిల్లల్ని తీసుకొని మీ అమ్మానాన్న దగ్గరికి వెళ్లచ్చు. ఒకవేళ వెళ్లడం వీలు కాకపోయినా వర్చువల్‌గానైనా వారితో వీడియో కాల్స్ మాట్లాడడం, విషెస్ చెప్పడం.. వంటివి చేయచ్చు. ఇలా చిన్నారులు వాళ్ల తాతయ్యతో సరదాగా గడిపే క్రమంలో తండ్రిని మిస్సవుతున్నామన్న ఫీలింగ్నీ మర్చిపోతారని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఇటు మీరూ, అటు మీ పిల్లలూ పితృ దినోత్సవం సందర్భంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకోవచ్చు.
మనసుకు నచ్చిన పని చేస్తూ..
భాగస్వామి నుంచి విడిపోయినా లేదంటే భర్త చనిపోయినా.. ఇలా కారణమేదైనా ఒంటరిగానే తమ పిల్లల బాధ్యతలు చూసుకునే మహిళలకు ఈ సందర్భంగా తమ భర్త గుర్తుకు రావడం పరిపాటే! అయితే ఈ క్రమంలో వారితో ఉన్న గత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ పిల్లలతో సమయం గడపడంతో పాటు మీకంటూ కాస్త టైమ్ కేటాయించుకొని నచ్చిన పనులు చేయచ్చు.. రిలాక్సవ్వచ్చు! తద్వారా పాత జ్ఞాపకాల వల్ల మనసు పాడవకుండా ఉంటుంది.. మీ పిల్లలతో సంతోషంగా గడిపినట్లూ ఉంటుంది.
పిల్లలు ఇలా..!
మదర్స్ డే అయినా, ఫాదర్స్ డే అయినా.. ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మకు, నాన్నకు ప్రత్యేక కానుకలివ్వడం, వారిని సర్‌ప్రైజ్ చేయడం మామూలే! అయితే అమ్మే నాన్నగా మారి అన్ని విషయాల్లోనూ ముందుకు నడిపిస్తోన్న ఆమెపై ప్రేమను చూపించడానికి, తండ్రిగా ఆమె నిర్వర్తిస్తోన్న బాధ్యతల్ని గుర్తు చేసుకోవడానికి ఫాదర్స్ డేని మించిన మంచి సందర్భం మరేముంటుంది చెప్పండి! అందుకే ఆ జ్ఞాపకాలన్నీ ఓసారి నెమరు వేసుకోండి..! వాటన్నింటినీ ఓ లేఖ రూపంలో రాయచ్చు.. లేదా కవితాత్మకంగా వర్ణించచ్చు.. ఇక వాటికి మీరిద్దరూ కలిసి దిగిన అందమైన ఫొటోల్ని కూడా జత చేస్తే.. మీరు రాసిన ప్రేమ లేఖకు తిరుగే ఉండదు. ఇక దీన్ని ఫాదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు అందిస్తే.. ఆనందంతో ఆమె కళ్లు చెమర్చవంటే అతిశయోక్తి కాదు.
అలాగే మీ జీవితంలో తండ్రి పాత్రను పోషిస్తోన్న తల్లులకు నచ్చిన వంటకాలు చేసి స్వయంగా మీరే తినిపించచ్చు.. లేదంటే పిన్నులు, పెద్దమ్మలు, కజిన్స్.. అందరూ కలిసి ఇంట్లోనే ఓ చిన్న పాటి పాట్‌లక్ పార్టీలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా రోజుకంటే భిన్నంగా గడిచిన ఆ రోజు ఇటు మీకు, అటు మీ అమ్మకు ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంచుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.