వెండి వస్తువులను ఇలా శుభ్రం చేసేయండి!

వర్షాకాలంలో వెండి వస్తువులు నల్లగా మారే అవకాశం ఎక్కువ. దీనికి ముఖ్య కారణం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. గాల్లోని తేమతో జరిగే రసాయనిక చర్య వల్ల వెండి నల్లగా మారిపోతుంది. ఫలితంగా అది మెరుపుని కోల్పోతుంది. అందుకే వెండి వస్తువులను వీలైనంత వరకూ గాలి, తేమ తగలని ప్రదేశంలో....

Published : 26 Jun 2023 20:29 IST

వర్షాకాలంలో వెండి వస్తువులు నల్లగా మారే అవకాశం ఎక్కువ. దీనికి ముఖ్య కారణం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. గాల్లోని తేమతో జరిగే రసాయనిక చర్య వల్ల వెండి నల్లగా మారిపోతుంది. ఫలితంగా అది మెరుపుని కోల్పోతుంది. అందుకే వెండి వస్తువులను వీలైనంత వరకూ గాలి, తేమ తగలని ప్రదేశంలో దాచి ఉంచాలి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇవి ఏదో ఒక కారణం చేత నల్లగా మారిపోతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తూ మధ్యమధ్యలో వాటిని శుభ్రం చేస్తుండాలి.

వేడి నీళ్లతో...
వెండి నగలు, వస్తువులపై బాగా మురికి పేరుకుపోయినప్పుడు వేడి నీళ్ల సాయంతో దాన్ని సులభంగా తొలగించుకోవచ్చు. రెండు కప్పుల వేడి నీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీనిలో కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ని కలపాలి. ఆ తర్వాత శుభ్రం చేయాలనుకుంటున్న వెండి వస్తువును అందులో కాసేపు ఉంచాలి. అనంతరం బయటకు తీసి, మెత్తని బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న మెత్తని వస్త్రంతో తుడిచేయాలి.

ఉప్పు నీళ్లతో...
వెండి వస్తువులు మరీ నల్లగా లేనట్లయితే ఉప్పు నీళ్లతో వాటిని తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కలపాలి. దానిలో నల్లగా మారిన వెండి వస్తువును కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్దితే నలుపు పూర్తిగా వదిలిపోయి పూర్వపు మెరుపును సంతరించుకుంటుంది.

టూత్‌పేస్ట్‌తో...
టూత్‌పేస్ట్‌లో ఉండే క్యాల్షియం వెండి వస్తువులను ధగధగలాడేలా చేస్తుంది. చాలా తక్కువ మొత్తంలో పేస్ట్‌ని తీసుకుని దాన్ని వెండి వస్తువుకు పల్చని పొరలా పూయాలి. టూత్‌పేస్ట్‌ పూర్తిగా ఆరిపోయే దాకా ఆగాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్‌తో తుడిచి నీటితో శుభ్రం చేసేయాలి. ఇలా చేస్తే అవి తిరిగి తెల్లగా తయారవుతాయి. ఇంకా వెండి వస్తువుల నలుపు పూర్తిగా వదలకపోతే ఇదే పద్ధతిని మరోసారి ఫాలో అయిపోతే సరిపోతుంది.

బేకింగ్‌ సోడాతో..
బేకింగ్‌ సోడా కూడా వెండి వస్తువులను తెల్లగా మెరిసేలా చేస్తుంది. దీనికోసం బేకింగ్‌ సోడాని తీసుకొని దాన్ని నీటిలో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మెత్తని బ్రష్‌ని ముంచి, వెండి వస్తువులను మృదువుగా రుద్దుకోవాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే వెండి వస్తువులు కొత్త వాటిలా మెరిసిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్