ప్రేమ విఫలమైందా..? అక్కడే ఆగిపోవద్దు..!

ప్రేమ.. ఇది ఎంతటి మధురానుభూతుల్ని పంచుతుందో.. విఫలమైతే అంతకంటే ఎక్కువగా బాధపెడుతుంది. అమ్మాయిలైతే ఈ విషయాన్ని మనసు మీదకు తీసుకొని మరింతగా కుంగిపోతుంటారు. ఇదిగో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఆచితూచి అడుగేయాలంటున్నారు....

Published : 10 Feb 2023 13:10 IST

ప్రేమ.. ఇది ఎంతటి మధురానుభూతుల్ని పంచుతుందో.. విఫలమైతే అంతకంటే ఎక్కువగా బాధపెడుతుంది. అమ్మాయిలైతే ఈ విషయాన్ని మనసు మీదకు తీసుకొని మరింతగా కుంగిపోతుంటారు. ఇదిగో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఆచితూచి అడుగేయాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అప్పుడే ప్రేమలో విఫలమైనా అక్కడే ఆగిపోకుండా.. జీవితంలో ముందుకెళ్లచ్చంటున్నారు. అలాకాకుండా ఏమాత్రం క్షణికావేశానికి లోనైనా జీవితమే ప్రశ్నార్థకమవుతుందంటున్నారు. మరి, విఫలమైన ప్రేమ నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

అది మీ తప్పు కాదు!

ప్రేమలో విఫలమైన అమ్మాయిల్లో చాలామంది తమలో లోపాలు వెతుక్కుంటారంటున్నారు నిపుణులు. అంటే.. ఎదుటివాళ్లు అనుకున్నంత అందంగా తాను లేనేమోనని, ఈ మధ్య లావవడం వల్లే తను నన్ను వదిలేశాడేమోనని.. ఇలా తమను తాము నిందించుకోవడం మొదలుపెడతారట! నిజానికి ఇలాంటి ప్రతికూల ఆలోచనలు వారిని మరింతగా కుంగదీసి క్షణికావేశానికి లోనయ్యేలా చేస్తాయి. వారిని మరింత డిప్రెషన్‌లోకి నెట్టేస్తాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకోవడానికైనా మనసును ఉసికొల్పుతాయి. దీనివల్ల తప్పు మీదైనా, కాకపోయినా నష్టపోయేది మీరే!

కాబట్టి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల ఆలోచనలు చేయాలంటున్నారు నిపుణులు. నిజానికి మీలోని శారీరక లోపాలే బ్రేకప్‌కి కారణమైతే.. అది మీ తప్పు కాదని, అందుకు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదంటున్నారు. ఎవరూ ఏ విషయంలోనూ సంపూర్ణం కాదని.. మిమ్మల్ని మీరుగా ప్రేమించే వ్యక్తి భవిష్యత్తులో తప్పకుండా తారపడతారన్న సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమ అలవర్చుకోమంటున్నారు. అంతేకాదు.. ‘నన్ను ఇష్టపడని వాడి గురించి నేనెందుకు ఇంతలా ఆలోచించాలి!’ అంటూ మనసును తేలికపరచుకోవడం మంచిదంటున్నారు. కాస్త కష్టమే అయినా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి.. మనసు కాస్తైనా కుదుటపడుతుందేమో!

క్షమిస్తే పోయేదేముంది?!

‘నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు.. నీతో ఇక కొనసాగలేను’ అని ప్రేమించినవాడు మొహమ్మీదే చెప్తే మనసు ఎంత బాధపడుతుంది.. అంతకంటే ఎక్కువగా కోపం కూడా వస్తుంది.. నిజంగా ప్రతి క్షణం వాళ్లపై ఇలా చిర్రబుర్రులాడుతుంటే ఎప్పుడూ మన మనసులో వాళ్లే ఉంటారు. మనల్ని వద్దని వదిలేసి వెళ్లిపోయిన వాళ్ల గురించి కోపంతోనైనా ఇంతలా ఆలోచించడం అవసరమా? అంటున్నారు నిపుణులు.

అదే ‘జరిగిందేదో జరిగిపోయింది.. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేసి.. జరగబోయే సంగతి చూద్దాం..!’ అంటూ వాళ్లను క్షమించేశారనుకోండి.. వాళ్ల ఆలోచనలు క్రమంగా మనసు నుంచి దూరమవుతాయి. అయితే ఇది చెప్పినంత సులభం కాదు.. ప్రయత్నిస్తే సాధ్యం కాకపోయేంత కష్టమూ కాదు! కాబట్టి ఇలాంటి సానుకూల దృక్పథం వల్ల కొన్నాళ్లకు మీరు మీకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టగలుగుతారు. భవిష్యత్తులో ముందుకెళ్లడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి?!

మనసు మాట వినండి!

బ్రేకప్‌ తర్వాత ఇద్దరూ కలిసి వెళ్లిన చోటికే పదే పదే వెళ్లి గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం చాలామందికి అలవాటు! దీనివల్ల వీగిపోయిన బంధం తిరిగి కలుస్తుందా? అంటే.. నూటికి 99 శాతం కాదనే సమాధానం వస్తుంది.. పైగా ఇలాంటి సమయంలో ‘కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్తే బాగుండనిపిస్తోంది’ అంటూ మనసు కోరుకోవడం సహజం! నిజానికి ఈ ఆలోచన మంచిదేనంటున్నారు నిపుణులు. నచ్చిన చోటికి వెళ్తే ఆ రిలీఫే వేరు.. అలాగే ప్రాణ స్నేహితులు, నచ్చిన కుటుంబ సభ్యులతో గడిపితే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంటుంది. వీలుంటే ఇలా గతంలో ఉన్న చోటు నుంచి కొత్త చోటికి మకాం మార్చడం, నచ్చకపోతే ఉద్యోగం మారడం.. వంటివి చేయచ్చంటున్నారు నిపుణులు. తద్వారా గత జ్ఞాపకాలు వేధించకుండా కొత్త జీవితం ప్రారంభించచ్చంటున్నారు.

దినచర్యే.. గొప్ప రిలీఫ్!

మనసు బాగోలేనప్పుడు ఏ పని పైనా దృష్టి పెట్టలేం. అలాగని రోజూ గత జ్ఞాపకాల్ని తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం. కాబట్టి ఇలాంటి ప్రతికూలతల నుంచి బయటపడాలంటే చక్కటి దినచర్యను అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా మీ పనుల్ని ప్రాధాన్యతల ప్రకారం చేసేలా ప్రణాళిక వేసుకోండి. మధ్యమధ్యలో మీకిష్టమైన వ్యాపకాలపై దృష్టి పెట్టండి. వారాంతాల్లో స్నేహితులతో గడిపేలా ప్లాన్‌ చేసుకోండి.. ఎందుకంటే ఎలాంటి ఒత్తిళ్లనైనా దూరం చేసే శక్తి స్నేహితులకు ఉంటుందని ఇటీవలే ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది. అందుకే వాళ్లతో మీ మనసులోని బాధను పంచుకొని.. ఓ చక్కటి సలహా తీసుకోవచ్చు. ఇక మనసును ప్రశాంతపరిచే యోగా, ధ్యానం.. వంటి అలవాట్లకు మీ జీవనశైలిలో చోటు కల్పించండి.. కాస్త కష్టమైనా ఇలా ఓ రెండు వారాలు లేదంటే ఓ నెల రోజుల పాటు కచ్చితంగా రొటీన్‌ ప్రకారం ఫాలో అయ్యారంటే ఎలాంటి చెడు ఆలోచనలు మీ మనసులోకి రావు.. పైగా మీరు చేసే పనులపై ఏకాగ్రత పెట్టగలుగుతారు.

అదే మీ నిర్ణయమా?!

ఓసారి ప్రేమలో విఫలమయ్యాక.. ఆ బంధమంటేనే విసుగెత్తిపోతారు చాలామంది అమ్మాయిలు. మరో వ్యక్తి తారసపడినా.. ‘ఇది కూడా బ్రేకప్‌ అయితే భరించడం మా వల్ల కాదంటూ’ మనస్ఫూర్తిగా ప్రేమించిన వారిని కూడా దూరం చేసుకుంటుంటారు. అయితే ఇది సరికాదని చెబుతున్నారు నిపుణులు. అవతలి వ్యక్తితో విడిపోయినంత మాత్రాన పూర్తిగా ప్రేమనే దూరం పెట్టడం సరికాదంటున్నారు. ఈ క్రమంలో ప్రేమతో దగ్గరైన వ్యక్తిని సునిశితంగా పరిశీలించి, మీ గతాన్ని పూర్తిగా వారితో చెప్పి, మీ వ్యక్తిగత విషయాలకు అడ్డు రాకుండా.. మీ భవిష్యత్‌ లక్ష్యాలను ప్రోత్సహించే వారైతే అలాంటి వారిని వదులుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు.

అయితే ఒకరకంగా ఇవన్నీ పాటించడం కష్టమే.. కానీ ప్రయత్నిస్తే పోయేదేముంది.. సక్సెస్‌ అయితే అవ్వచ్చు.. లేదంటే మాత్రం ఓసారి మానసిక నిపుణులను సంప్రదించి మీ మనసులోని బాధను వారికి వివరించండి.. తద్వారా వాళ్లు మీకు చక్కటి పరిష్కారం సూచిస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇలా మొదట్లోనే మీరు మానసిక ఆరోగ్యం పట్ల దృష్టి సారిస్తే డిప్రెషన్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు.. ప్రతికూల ఆలోచనల నుంచి త్వరగా బయటపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్