ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్.. ఇలా దూరం!

గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు....

Published : 06 Aug 2023 15:36 IST

గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటిలో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చల్లాగా వచ్చే ఈ సమస్య వల్ల ముఖం నిర్జీవమైపోయినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయో అన్న భయం కాబోయే తల్లుల్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని డాక్టర్ సలహా మేరకు వాటిని వాడితే ఈ సమస్య నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది.

ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజులకు సమస్య తగ్గిపోతుంది.

టొమాటో రసం, కీరా రసం సమపాళ్లలో తీసుకొని దానికి కొద్దిగా పాలు కలిపి ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది అన్ని చర్మతత్వాల వారికి సరిపోతుంది.

ఎలాంటి చర్మ సమస్యనైనా తగ్గించే శక్తి కలబందకు ఉందనడంలో సందేహం లేదు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే పిగ్మెంటేషన్‌ను కూడా సమూలంగా తొలగిస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల వారం రోజుల్లోనే మీ ముఖంలో తేడా మీరు గమనించచ్చు.

పిగ్మెంటేషన్‌తో నిర్జీవమైపోయిన చర్మాన్ని విటమిన్-ఇ నూనెతో కూడా మెరిపించవచ్చు. సమస్య ఉన్న చోట ఈ నూనెను అప్త్లె చేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొన్ని రోజులకు పిగ్మెంటేషన్ కనుమరుగవుతుంది.

రెండు బాదంపప్పులు, టీస్పూన్ తేనె.. ఈ రెండూ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గడమే కాదు.. దాని వల్ల అక్కడ నిర్జీవమైన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

గంధం, పసుపు సమపాళ్లలో తీసుకొని దానికి పాలను కలుపుతూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌తో నిర్జీవమైన చర్మంపై రాసి అరగంట పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోవాలి. తద్వారా చక్కటి ఫలితం కనబడుతుంది.

సన్నగా తురిమిన బంగాళాదుంప గుజ్జుకు కాస్తంత నిమ్మరసం కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను రోజూ సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే క్రమంగా సమస్య తగ్గుముఖం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్