US- China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?

US- China: అమెరికా, చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ యూఎస్‌కు చెందిన ఓ సీనియర్‌ మిలిటరీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య 2025లో యుద్ధం రావొచ్చని అంచనా వేశారు.

Updated : 29 Jan 2023 16:41 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా (America).. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China) మధ్య గతకొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య యుద్ధం రూపంలో అవి మరింత ముదిరాయి. ఇండో- పసిఫిక్‌లో చైనా (China) దుశ్చర్యలతో పాటు తైవాన్‌పై ఆ దేశ వైఖరి అమెరికా (America)కు మరింత చికాకు కలిగిస్తోంది. ఈ తరుణంలో అగ్రరాజ్యానికి చెందిన ఓ సీనియర్‌ సైనికాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. 

2025లో ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందని యూఎస్‌ (America) ‘ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ (AMC)’ హెడ్‌ జనరల్‌ మైక్‌ మినిహన్‌ అంచనా వేశారు. అయితే, తన అంచనాలు తప్పయ్యే అవకాశాలూ ఉన్నాయని తెలిపారు. ఏఎంసీలో 50,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 500 విమానాలు ఉన్నాయి. సైనిక దళాలకు సంబంధించిన రవాణా, ఇంధన సరఫరాను ఈ కమాండ్‌ పర్యవేక్షిస్తుంది. 

అమెరికా (America), తైవాన్‌ (Taiwan)లో 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు మినిహన్‌ కమాండ్‌ సభ్యులకు రాసిన ఓ లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆ సమయానికి అమెరికా (America) దృష్టి ఇతర అంశాలపై ఉంటుందని పేర్కొన్నారు. తైవాన్‌ విషయంలో ముందుకెళ్లడానికి చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దీన్ని అవకాశంగా మార్చుకుంటారని అంచనా వేశారు. అందువల్ల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆ దిశగా తీసుకుంటున్న కీలక చర్యల్ని తనకు ఫిబ్రవరి 28కల్లా నివేదించాలని ఆదేశించారు.

దీనిపై అమెరికా రక్షణశాఖకు చెందిన ఉన్నతాధికారి స్పందించారు. మినిహన్‌ వ్యాఖ్యలు అమెరికా రక్షణశాఖ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. వాయుసేన బ్రిగేడియల్‌ జనరల్‌ ప్యాట్రిక్‌ రైడర్‌ మాట్లాడుతూ.. చైనా (China)తో సైనిక పోటీ తమ ముందున్న ప్రధాన సవాల్‌ అన్నారు. స్వేచ్ఛాయుత, శాంతియుతమైన ఇండో- పసిఫిక్‌ కోసం మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి పనిచేయడంపై తాము దృష్టి సారించామన్నారు.

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ గతనెల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తైవాన్‌ జలసంధి వద్ద చైనా (China) తమ సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని తాము అనుమానిస్తున్నామన్నారు. తైవాన్‌ ఆక్రమణకు చైనా (China) సిద్ధమవుతోందనడానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని