Hitler watch: హిట్లర్‌ వాచీ వేలం.. ధరెంత పలికిందో తెలుసా!

Eenadu icon
By International News Team Published : 01 Aug 2022 01:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్‌: జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌(Adolf Hitler)కు చెందినదిగా భావిస్తోన్న ఓ చేతి గడియారం తాజాగా ఓ వేలంలో 1.1 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అమెరికాలో నిర్వహించిన ఈ ప్రక్రియలో ఓ అజ్ఞాత వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నట్లు వేలం సంస్థ ‘అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్’ వెల్లడించింది. ఈ వాచీ వెనుక వైపు స్వస్తిక్‌ చిహ్నంతోపాటు ‘ఏ’, ‘హెచ్‌’ ఆంగ్ల అక్షరాలు పొందుపర్చి ఉన్నాయి. ఇది హిట్లర్‌కు 1933లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. హిట్లర్ పుట్టిన, ఆయన ఛాన్సలర్‌గా మారిన, 1933లో నాజీ పార్టీ ఎన్నికల్లో గెలిచిన.. ఈ మూడు తేదీలు వాచీపై ఉన్నాయి.

వేలం సంస్థ వివరాల ప్రకారం.. 1945లో ఫ్రెంచ్ సైనికులు హిట్లర్‌ తలదాచుకున్న ‘బెర్‌గాఫ్‌’పై దాడి చేసినప్పుడు ఈ గడియారాన్ని స్మారక చిహ్నంగా సేకరించారు. అనంతరం దాన్ని విక్రయించారని, అప్పటినుంచి అనేక చేతులు మారుతూ వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు.. ఈ గడియారాన్ని వేలం వేయడాన్ని యూదు నాయకులు ఖండించారు. దీన్ని అసహ్యకర చర్యగా అభివర్ణించారు. హిట్లర్‌ తన పాలనలో లక్షలాది యూదులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అయితే.. చరిత్రను భద్రపరిచే లక్ష్యంతో ఈ వేలం నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని