Afghan Earthquake: అఫ్గాన్‌లో భూకంప విలయం.. 800 మందికి పైగా మృతి

Eenadu icon
By International News Team Updated : 01 Sep 2025 15:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు (Earthquake in Afghanistan) కారణంగా 800 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ వెల్లడించింది. మరో 2500 మంది వరకు గాయపడినట్లు తెలిపింది.

యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘోర విపత్తు కారణంగా కునార్‌ ప్రావిన్స్‌ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు.

భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్‌ ప్రావిన్స్‌ మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ పోస్టు పెట్టారు. ఈ విపత్తు ధాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. ‘అఫ్గానిస్థాన్‌లోని కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అసమర్థ తాలిబన్‌ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ సమయంలో కునార్‌ ప్రజలకు సాయం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి. అవసరమైన ఆహారం అందించి.. ఆశ్రయం కల్పించాలి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి’ అని పోస్టులో పేర్కొన్నారు. 

భూకంపం కారణంగా పలువురు మరణించారనే వార్త విని తాను చలించిపోయానని క్రికెటర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ పోస్టు పెట్టారు. బాధితుల కుటుంబం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అంతకుముందు ఓ అధికారి తెలిపారు. 20 నిమిషాల వ్యవధి తర్వాత 4.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్లు పేర్కొన్నారు. 

Tags :
Published : 01 Sep 2025 09:42 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని