Israel Hamas Ceasefire: సంధికి తూట్లు.. ‘విరమణ’లో ఉన్నా ఆగని విధ్వంసం!

Eenadu icon
By International News Team Published : 29 Oct 2025 19:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండేళ్లుగా కొనసాగిన ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel Hamas Conflict) యుద్ధంలో వేలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చివరకు అమెరికా జోక్యంతో సంధి కుదిరినప్పటికీ.. ఉల్లంఘనలు జరుగుతుండటం ఆందోళలకు కారణమవుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌ మెరుపు దాడులతో గాజా మరోసారి దద్దరిల్లింది. డ్రోన్లు, యుద్ధ, నిఘా విమానాలతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒక్కరోజే 100 మందికిపైగా చనిపోయారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంతో ఊపిరి పీల్చుకుంటున్న పాలస్తీనావాసుల్లో మళ్లీ గుబులు మొదలైంది.

పరస్పర ఆరోపణలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మధ్యవర్తిత్వంతో రెండేళ్ల కాల్పులకు తెరదించుతూ అక్టోబర్‌ 10న ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది అమల్లోకి వచ్చిన పక్షం రోజుల్లోనే ఉల్లంఘనలపై ఇరుపక్షాలు ఆరోపణలకు దిగాయి. బందీల మృతదేహాలను అప్పగించడంలో హమాస్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న సమయంలోనే ఓ ఇజ్రాయెల్‌ సైనికుడు రఫాలో ప్రాణాలు కోల్పోవడం నెతన్యాహు ఆగ్రహానికి కారణమైంది. ఆయన ఆదేశాల మేరకు గాజాపై ఐడీఎఫ్‌ భీకర దాడులు చేపట్టింది. ఇందులో భారీ ప్రాణ నష్టంతోపాటు మౌలిక సదుపాయాలు  ధ్వంసమయ్యాయి.

ఇజ్రాయెల్‌కు మద్దతుగా ట్రంప్‌..

అయితే, గాజాలో ఇజ్రాయెల్‌ సైనికుడి మరణానికి తాము కారణం కాదని హమాస్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్‌ జరిపిన భీకర దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. దీనిపై ఇజ్రాయెల్ దీటుగా స్పందించింది. తమ సైనికుల వైపు వేలెత్తి చూపుతే చెయ్యి తీసేస్తామని హెచ్చరించింది. అయితే, కాల్పుల విరమణ మళ్లీ అమల్లోకి వచ్చినట్లు తాజాగా తెలిపింది. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. సైన్యంపై దాడులు చేస్తే ఎదురుదాడి చేయొచ్చని అన్నారు. అయినప్పటికీ గాజాలో శాంతిని ఎవరూ అస్థిరపర్చలేరని చెప్పారు.

ఇజ్రాయెల్‌ చేపట్టిన తాజా దాడుల్లో 104 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. మరో 250 మంది గాయపడినట్లు అంచనా. అయితే, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకు పలువురు పాలస్తీనీయన్లు చనిపోయారని, సుమారు 600 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ ఆరోపించింది. మొత్తంగా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 68,643కు చేరుకుందని, లక్షా 70 మంది గాయపడినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు