Sheikh Hasina: దిల్లీలో స్వేచ్ఛగా జీవిస్తున్నా: షేక్‌ హసీనా

Eenadu icon
By International News Team Published : 29 Oct 2025 19:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలో తాను స్వేచ్ఛగా నివసిస్తున్నానని (Living freely in Delhi) బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) పేర్కొన్నారు. అయితే తన కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఆమె దిల్లీలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే హసీనా బుధవారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.  

ఇందులో భాగంగా ఆవామీ లీగ్‌ పార్టీ నేతలపై ఆరోపణలు, స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆలోచనలు మొదలైన విషయాల గురించి హసీనా (Sheikh Hasina) మాట్లాడారు. వచ్చే ఏడాది బంగ్లాలో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోతే.. తమకు ఉన్న లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారన్నారు. భవిష్యత్తులో తన స్వదేశంలో అధికారం చేపట్టడానికైనా.. ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌లో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలంటే తిరిగి తమ ప్రభుత్వం అధికారం చేపట్టాలని అన్నారు. దేశ భవిష్యత్తును ఏ ఒక్క వ్యక్తిగానీ కుటుంబం కానీ నిర్వహించాలని తాను అనుకోవట్లేదని స్పష్టం చేశారు. 

తాను దేశం విడిచి వెళ్లిన అనంతరం అవామీ లీగ్ నేతలపై దాడులు చేయడం, పార్టీపై నిషేధం విధించడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తమ స్వీయ ఓటమిని ఒప్పుకుందన్నారు. తదుపరి అధికారంలోకి వచ్చే ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా ఎన్నికవ్వాలని ఆకాంక్షించారు. యూనస్‌ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగా పేర్కొన్నారు. తనపై అభియోగాలు నమోదు చేసే ముందు బంగ్లాలోని కోర్టులు కూడా తనకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదన్నారు. తన వాదనను వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. 

విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అనంతరం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీని నిషేధించింది. అయితే ప్రభుత్వ నిషేధాన్ని తాము అంగీకరించడం లేదనీ, తమ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అవామీ లీగ్‌ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని