SpaceX Moon Flight: స్పేస్‌ఎక్స్‌ జాబిల్లి యాత్రకు భారత నటుడి ఎంపిక..!

స్పేస్‌ఎక్స్‌ నిర్వహించనున్న తొలి జాబిల్లి యాత్రకు భారత్‌కు చెందిన నటుడు దేవ్‌ జోషి ఎంపికయ్యాడు.  

Published : 09 Dec 2022 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్పేస్‌ఎక్స్‌ జాబిల్లి యాత్రలో ప్రయాణించే అవకాశం భారత్‌కు చెందిన ఓ నటుడికి లభించింది. జపాన్‌ బిలియనీర్‌ యుసాకు మేజవా రిజర్వు చేసుకొన్న స్పేస్‌ఎక్స్‌ యాత్ర కోసం ఎంచుకొన్న బృందంలో ‘బాల్‌వీర్‌’ ఫేమ్‌ దేవ్‌ జోషికి స్థానం దక్కింది. యుసాకు గతేడాది ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మక వ్యక్తుల కోసం అన్వేషణ చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని తన ప్రైవేటు స్పేస్‌ఎక్స్‌ ఫ్లైట్‌లో క్రూగా ఎంచుకొన్నట్లు వెల్లడించారు. ఇలా ఎంచుకున్న వారిలో దేవ్‌ జోషితోపాటు అమెరికన్‌ డీజే స్టీవ్‌ అయెకి, కొరియాన్‌ స్టార్‌ టీవోపీ (చోంగ్‌ సెయుంగ్‌ హ్యూన్‌), చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌ యేమీ ఎ.డి., ఐర్లాండ్‌కు చెందిన రియాన్నోన్‌ ఆడమ్‌, అమెరికా యూట్యూబర్‌ టిమ్ డోడ్డ్‌, యూకేకు చెందిన ఫొటోగ్రాఫర్‌ కరీమ్‌ ల్లియ, అమెరికాకు చెందిన దర్శకుడు బ్రెండన్‌ హాల్‌, స్నోబోర్డర్‌ కైట్లిన్‌ ఫారింగ్టన్‌, జపాన్‌ డ్యాన్సరు మియూ ఉన్నారు.

 ఈ యాత్ర వచ్చే ఏడాది జరగవచ్చని అంచనావేస్తున్నారు. 1972 తర్వాత మానవ సహిత తొలి జాబిల్లి యాత్ర ఇదే కావచ్చు. ఈ యాత్రలో భాగంగా వీరు జాబిల్లికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్య వరకూ వెళతారు. ఈ యాత్రకు మొత్తం 8 రోజుల సమయం పట్టనుంది. దీని కోసం ఉపయోగించే స్టార్‌ షిప్‌ రాకెట్‌కు అమెరికా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. వాస్తవానికి ఈ అంతరిక్ష నౌక ప్రయోగ పరీక్ష గతేడాది మేలోనే పూర్తయింది. భూభ్రమణ పరీక్షకు మాత్రం ఇప్పటి వరకు అనుమతులు లభించకపోవడంతో టెక్సాస్‌లో నిలిచి ఉంది.

యుసాకు మేజవా గతేడాది నుంచి ట్విటర్‌ వేదికగా తన క్రూ సభ్యులను ఎంచుకోవడం మొదలుపెట్టారు. దీనికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నట్లు యుసాకు పేర్కొన్నారు. ఆయన బృందంలో క్రీడాకారులు, కళాకారులే ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని