US: ‘జాబ్‌ లేదు.. వీసా టైం ఆగదు’: అమెరికాలో భారతీయులకు కొత్త సవాళ్లు..!

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారత ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. వీరంతా అగ్రరాజ్యంలో ఉండాలంటే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే..!

Published : 23 Jan 2023 12:29 IST

అమెజాన్‌లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికా (US)లో అడుగుపెట్టింది. ఇటీవల లేఆఫ్‌ల్లో భాగంగా మార్చి 20 ఆమె చివరి వర్కింగ్‌ డే అని చెప్పారు. హెచ్‌-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో అవకాశం లేదు. 

హెచ్‌-1బీ (H-1B) వీసాతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్న సీత (పేరు మార్చాం) జనవరి 18న లేఆఫ్‌ (Lay-off)కు గురైంది. ఒంటరి తల్లి. కొడుకు త్వరలోనే కాలేజీలో చేరబోతున్నాడు. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. 

వీరిద్దరే కాదు, అమెరికా (America)లో ఉంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇది..! ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాలోని టెక్‌ కంపెనీలు కోతల బాటపట్టాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థలు సహా అమెరికాలో అనేక టెక్‌ కంపెనీలు ఇటీవల వేలాదిగా ఉద్యోగుల కోతలు ప్రకటించాయి. వాషింగ్టన్ పోస్ట్‌ కథనం ప్రకారం.. గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది ఐటీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో 30 నుంచి 40శాతం మంది భారత ఐటీ నిపుణులే (Indian IT professionals) . వీరిలో మెజార్టీ ఉద్యోగులు హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. దీంతో అగ్రరాజ్యంలోనే ఉండేందుకు ఇప్పుడు వీరంతా ప్రత్యామ్నాయాలు అన్వేషించక తప్పట్లేదు. గడువులోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లేదా.. వీసా స్టేటస్‌ను మార్చుకునేందుకు వీరు తంటాలు పడుతున్నారు.

‘‘వేలాది మంది టెక్‌ ఉద్యోగులు లేఆఫ్‌లను ఎదుర్కోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు విధుల నుంచి తొలగిపోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదంటే వీసాను మార్చుకోవాలి. దీంతో ఈ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల హెచ్‌-1బీ వీసాదారులకు టెక్‌ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్లో ఉన్న సమస్యల కారణంగా వీరి టర్మినేషన్ తేదీని కొన్ని నెలలు పొడిగించాలి’’ అని సిలికాన్‌ వ్యాలీకి చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌ అజయ్‌ జైన్ భుటోరియా అభిప్రాయపడ్డారు.

అమెరికా (US) టెక్‌ పరిశ్రమలో అధిక మొత్తంలో ఉద్యోగులు భారత వలసదారులే. దీంతో లేఆఫ్‌ల్లోనూ వీరే ఎక్కువ మంది ఉన్నారు. యూఎస్‌ నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసాదారులు లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదంటే ఆ గడువు దాటిన 10 రోజుల్లోగా అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని