Earthquake: ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంపం (Earthquake) సృష్టించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏ భవనశిథిలాల కింద చూసిన ప్రాణం లేని దేహాలే కన్పిస్తుండటం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తోంది.

Published : 08 Feb 2023 10:56 IST

అంకారా: పదుల అంతస్తుల భవనాలు శవాల దిబ్బలుగా మారిపోయాయి.. ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహాలే కన్పిస్తున్నాయి.. ప్రకృతి సృష్టించిన భూప్రళయం అనంతరం తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ఇప్పుడు కన్పిస్తున్న హృదయవిదారక దృశ్యాలివే. సోమవారం చోటుచేసుకున్న భూకంపం (Earthquake) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్తు జరిగి రెండు రోజులు దాటడంతో శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఈ విపత్తులో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.

భూకంప (Earthquake) విలయ తీవ్రతలో రెండు దేశాల్లో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య దాదాపు 8వేలకు చేరింది. ఒక్క తుర్కియేలోనే 5,894 మరణాలు చోటుచేసుకోగా.. సిరియాలో 2032 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఇప్పటివరకు 7,926 మంది ప్రాణాలు కోల్పోగా.. 20వేల మందికి పైగా గాయపడ్డారు.

భూకంపం అనంతరం తుర్కియేలోని కహ్రామన్మరాస్‌ పరిస్థితి ఇది (శాటిలైట్‌ దృశ్యం)

శిథిలాల కింద 1.80లక్షల మంది..

భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఒక్క తుర్కియే (Turkey)లోనే 6000 భవంతులు కూలిపోయాయి. భవన శిథిలాల కింద 1,80,000 మంది చిక్కుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి కోసం గత రెండు రోజులుగా 25వేల మంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా ఇంకా అనేక మందిని గుర్తించాల్సి ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు సహాయక బలగాలు కాలంతో పోటీపడి ప్రయత్నిస్తున్నాయి. అయితే వరుసగా వస్తున్న ప్రకంపనలు, గడ్డకట్టే చలి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల కింద మృత్యుంజయులు కన్పించే అవకాశాలు సన్నగిల్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తులో 20 వేల మంది మరణించే అవకాశముందని డబ్ల్యూహెచ్ఓ (WHO) అంచనా వేసిన విషయం తెలిసిందే.

గూడు కోల్పోయి.. రోడ్డున పడి

భూకంపం (Earthquake) ధాటికి లక్షలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. తుర్కియేలో 3.80లక్షల మంది ఇప్పుడు ప్రభుత్వ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అవి కూడా దొరకని ఎంతోమంది రోడ్లపైనే శిబిరాలను ఏర్పాటు చేసుకుని గడ్డకట్టే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలంగడుపుతున్నారు. చలి తీవ్రతకు చిన్నారులు వణికిపోతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని