ముహూర్తం మించిపోతే ముప్పే!

తాజావార్తలు


ముహూర్తం మించిపోతే ముప్పే!
జీఎస్టీపై తెగని తగవు
రాష్ట్రాల మధ్య పన్నుపరమైన అడ్డుగోడలను తొలగించి దేశమంతటినీ ఉమ్మడి మార్కెట్‌గా మార్చే వస్తుసేవల (జీఎస్టీ) బిల్లుపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు పరస్పర విభేదాలను పక్కనపెట్టి బిల్లును ఏకాభిప్రాయంతో చట్టంగా మార్చడం దేశ శ్రేయస్సుకు ఎంతో అవసరం. జీఎస్టీ ప్రభావం ఒక్కో రాష్ట్రంపై ఒక్కో విధంగా ఉంటుంది. పారిశ్రామిక వస్తూత్పత్తి సాగించే రాష్ట్రాలపైన, వస్తు వినియోగం జరిగే రాష్ట్రాలపైన అది వేర్వేరు ప్రభావాలను ప్రసరిస్తుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను చెల్లింపు ఖాతాలను కేంద్రం, రాష్ట్రాలు పరిశీలించి, ఆడిట్‌ చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి వ్యతిరేకించారు. దీనివల్ల జీఎస్టీ పరమార్థమే దెబ్బతింటుందన్నది ఆయన అభ్యంతరం. కానీ, ఇలాంటి అంశాల్లో తమకూ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల తమ ఆదాయాల్లో కొంతకాలంపాటు తరుగు ఏర్పడుతుందనే భయంతో రాష్ట్రాలు జీఎస్టీపై మరింత బిగుసుకుపోయాయి. ఈనెల మూడో తేదీన జరిగిన జీఎస్టీ మండలి సమావేశం ఈ కారణాల వల్లనే విఫలమైంది. వస్తుసేవలపై పన్ను చెల్లించేవారి మీద ఎవరికి నియంత్రణ ఉండాలనే దానిపై కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రూ. 1.5కోట్ల లోపు టర్నోవరు ఉన్న చిన్న వ్యాపారులు చెల్లించే పన్నులపై తమకే పూర్తి అదుపు ఉండాలని దిల్లీ, పశ్చిమ్‌ బంగ, కేరళతో సహా అనేక రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రూ.1.5కోట్లకు మించి టర్నోవరు ఉండే వ్యాపారులు, సంస్థల నుంచి కేంద్రంతో కలసి పన్నులు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండాలంటున్నాయి. కానీ, రూ. 1.5 కోట్ల లోపు ఆదాయం ఉండే వ్యాపారుల నుంచి పన్ను వసూలు అధికారాన్ని వదులుకుంటే, తన పరిధిలోని పన్ను చెల్లింపుదార్ల సంఖ్య మరీ కుదించుకుపోతుందని కేంద్రం అభ్యంతరపెడుతోంది.

వ్యతిరేకత ఎందుకంటే...
ఇంతకాలం కేంద్ర, రాష్ట్రాలు వస్తుసేవలపై విడివిడిగా పన్నులు విధించేవి. వస్తువు ఉత్పత్తి అయిన చోటే (మూలంలోనే) పన్ను పడుతుండగా, జీఎస్టీ వచ్చాక వస్తువు గమ్యస్థానంలో పన్ను పడుతుంది. ఇంతవరకు వస్తుసేవలపై విధిస్తున్న రకరకాల పరోక్ష పన్నుల స్థానంలో ఏకీకృత పన్ను వ్యవస్థ అమలులోకి వస్తుంది. అంటే ఒకే వస్తువుపై అనేకసార్లు పన్ను విధించే పద్ధతి తొలగిపోతుంది. జీఎస్టీ రాకముందు ఉత్తర్‌ ప్రదేశ్‌లో వ్యాట్‌/అమ్మకం పన్ను 14 శాతమైతే పంజాబ్‌లో 12 శాతమే. దీనికి తోడు కేంద్రం ఏడు శాతం కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) విధిస్తోంది. జీఎస్టీ చట్టం కింద కేంద్ర రాష్ట్రాలు నిర్ణీత, ఏకీకృత రేట్లకు పన్ను విధిస్తాయి. ఒక రాష్ట్రం లోపల అమ్ముడయ్యే వస్తుసేవలపై కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) విధిస్తే, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరఫరా అయ్యే వస్తుసేవల మీద కేంద్రం సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ)ని వసూలు చేస్తుంది. వివరాల్లోకి వెళితే... గతంలో ఒక రాష్ట్రంలో విక్రయమైన వస్తుసేవలపై వ్యాట్‌, ఎక్సైజ్‌, అమ్మకం పన్నులు వసూలు చేసేవారు. రాష్ట్రం వెలుపలకు సరఫరా అయిన వస్తుసేవలపై సీఎస్టీ, అమ్మకం పన్ను, వ్యాట్‌లు వసూలుచేసేవారు. జీఎస్టీ కింద రాష్ట్రం లోపల ఎస్జీఎస్టీ, సీజీఎస్టీలను, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వస్తుసేవల మీద ఐజీఎస్టీని వసూలు చేస్తారు.

జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చాక పన్నులన్నింటినీ కేంద్రమే వసూలు చేసి నిర్దిష్ట సూత్రం ప్రకారం రాష్ట్రాలకు పంచుతుంది. అది జరగాలంటే మొదట పన్ను రేట్లపై, మినహాయించాల్సిన వస్తుసేవల జాబితాపై, చట్టం అమలు విధానంపైనా అంగీకారం కుదరాలి. జీఎస్టీ కార్యరూపం ధరించాక తమ ఆదాయం తగ్గిపోతుందంటూ పారిశ్రామిక రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. జీఎస్టీ అనేది విలువ ఆధారితమైనది. వినియోగంపై ఆధారపడిన పన్ను అది. దీనివల్ల వస్తూత్పత్తి చేసే పారిశ్రామిక రాష్ట్రాలు పన్ను ఆదాయం కోల్పోతాయి. ఎలా అంటే- ఔరంగాబాద్‌ (మహారాష్ట్ర)లోని ఎక్స్‌ అనే ఓ ప్రెషర్‌ కుక్కర్‌ తయారీదారుడు హైదరాబాద్‌లోని ఆర్‌ అనే చిల్లర వర్తకుడికి రూ.2,000 ధరకు కుక్కర్‌ అమ్మాడనుకుందాం. చిల్లర వర్తకుడు తన లాభాన్ని జోడించి కుక్కర్‌ను రూ.3,000కు అమ్మాడు. ఇక్కడ జీఎస్టీ రేటు పది శాతం. ఎక్స్‌ ప్రెషర్‌ కుక్కర్‌ తయారీ కోసం రూ. 500 విలువ చేసే ముడి పదార్థాలను మహారాష్ట్ర వ్యాపారుల నుంచి కొన్నాడు. దానిమీద ఎక్స్‌ జోడించిన విలువ రూ. 1,500 (అమ్మకం ధర రూ. 2000నుంచి ముడి సరకుల ధర రూ. 500 తీసివేస్తే). కేంద్రానికి, మహారాష్ట్రకు తాను జోడించిన విలువ రూ.1500పై ఎక్స్‌ పది శాతం పన్ను (రూ.150) చెల్లిస్తాడు. ఇక హైదరాబాద్‌ చిల్లర వర్తకుడు ఆర్‌ తన అమ్మకం ధర రూ. 3,000పై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు పది శాతం పన్ను రూ. 300 చెల్లిస్తాడు. ఇక్కడ ఆర్‌ తన కొనుగోలు ధర రూ. 2,000పై అప్పటికే చెల్లించిన 10 శాతం పన్ను (రూ. 200)ను పన్ను క్రెడిట్‌గా పొందాల్సి ఉంది. దీన్ని కేంద్రం, మహారాష్ట్రలు చెల్లించాలి. మహారాష్ట్ర తాను అంతకుముందు వసూలు చేసుకున్న పన్ను అంతటినీ వదలుకోవాలన్న మాట. చివరికి, ప్రెషర్‌ కుక్కర్‌ వినియోగం జరిగిన తెలంగాణకే పన్ను ఆదాయం దఖలు పడుతుంది. ఈ విధంగా పారిశ్రామిక ఉత్పత్తిదారైన రాష్ట్రం జీఎస్టీ వల్ల నష్టపడితే, సదరు వస్తువును వినియోగించుకునే రాష్ట్రం అంతిమంగా లాభపడుతుంది.

ఈ కారణాల వల్లనే జీఎస్టీ పన్నును మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ వంటి పారిశ్రామిక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది కాబట్టి జీఎస్టీని ఆ రాష్ట్రాలు మరీ తీవ్రంగా వ్యతిరేకించలేకపోయాయి. భాజపా ఏలుబడిలో లేని తమిళనాడు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి అయిదేళ్లపాటు పారిశ్రామిక రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని భర్తీచేస్తానని కేంద్రం భరోసా ఇవ్వడంతో బండి ముందుకు కదలింది. ఇంతలో పెద్ద నోట్ల రద్దు వచ్చిపడటంతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కోసుకుపోయి తమ పన్ను ఆదాయాలకు గండిపడుతుందని రాష్ట్రాలకు కొత్త భయం పట్టుకుంది. పశ్చిమ్‌ బంగ, కేరళ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తమ భయాలను గట్టిగా వ్యక్తీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికంలో జీడీపీ పెరగకపోగా తరిగిపోతుందని, దీనివల్ల కేంద్ర, రాష్ట్రాల పన్ను ఆదాయాలూ క్షీణిస్తాయని పశ్చిమ్‌ బంగ ఆర్థిక మంత్రి ఆందోళన వ్యక్తపరిచారు. పెద్ద నోట్ల రద్దు రూ.2.5లక్షల కోట్ల ఉత్పత్తి నష్టానికి దారితీస్తుందని వారి అంచనా. నిజం చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దువల్ల రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టం జీఎస్టీ పరిధిలోకి రాదు. ఏతావతా జీఎస్టీ కింద నాలుగు అంచెల (5, 12, 18, 28 శాతం) పన్ను రేట్ల విధింపుపై ఏకాభిప్రాయం కుదరడాన్ని గొప్ప విజయంగా భావించాలి. 28 శాతం పన్నులో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీలు చెరి సగం ఆక్రమిస్తాయి. విలాసవంతమైన కార్లు, పొగాకు, పాన్‌ మసాలా, సోడా పానీయాల వంటి వస్తువులపై జీఎస్టీ రేట్లను మించి అదనపు సెస్సు విధిస్తారు. ఇలా వసూలయ్యే అదనపు మొత్తాలను జీఎస్టీ వల్ల నష్టపోయే పారిశ్రామిక రాష్ట్రాలకు పంచుతారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన అయిదేళ్ల తరవాత ఈ సెస్సును ప్రతిపాదిత పన్ను రేట్లలో కలిపేస్తారు. దీనికి పార్లమెంటు, రాష్ట్రాల లెజిస్లేచర్ల సమ్మతి పొందాల్సిన పని లేకుండా, గరిష్ఠ జీఎస్టీ రేటును 40 శాతానికి (20 శాతం సీజీఎస్టీ, 20 శాతం ఎస్జీఎస్టీ) పరిమితం చేయాలని ముందుగానే ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. దీన్ని జీఎస్టీ బిల్లులో పొందుపరిచారు. 2017 సెప్టెంబరు 16కల్లా జీఎస్టీ చట్టం అమల్లోకి రాకపోతే రాష్ట్రాలు తమకు రావాల్సిన పన్ను వాటాలను పొందలేవు కాబట్టి, జీఎస్టీ అమల్లో ఇక జాగు చేసే వీలు లేదు.

ఆలస్యం అమృతం విషం
జీఎస్టీ మండలి, సమాఖ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకొంటుంది. అలాగని ప్రతి చిన్నా పెద్దా అంశం మీద అదేపనిగా చర్చిస్తూ కూర్చుంటే పని జరగదు. జీఎస్టీ మండలి మొదట్లో అవలంబించే పని విధానమే తదుపరి సంవత్సరాల్లోనూ కొనసాగవచ్చు. సంస్కరణల వ్యతిరేకమైనవిగా ముద్రపడే రాష్ట్రాలకు కొత్త పెట్టుబడులు రాకపోవచ్చు. సంస్కరణల అనుకూల రాష్ట్రాల వైపే పెట్టుబడిదారులు మొగ్గుచూపవచ్చు. నేడు, రేపు జీఎస్టీ మండలి మరోసారి సమావేశం కానుంది. పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈ నెల 16వతేదీతో ముగుస్తాయి. కాబట్టి ఆలోపే జీఎస్టీ సంగతి తేలిపోవాలి. వచ్చే ఏడాది సెప్టెంబరు 16వతేదీ లోపే జీఎస్టీ విధానం రంగప్రవేశం చేయాల్సి ఉంది. అప్పటికి ప్రస్తుత పరోక్ష పన్నుల వ్యవస్థ ముగిసిపోతుంది కాబట్టి, కేంద్ర రాష్ట్రాలు తమకు రావలసిన పన్నులను వసూలు చేసుకోలేవు. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే జీఎస్టీని అమలుచేయాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు శీతకాల సమావేశాల్లో జీఎస్టీకి అనుబంధమైన సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను, ముసాయిదా పరిహార చట్టాన్ని ఆమోదించాల్సి ఉంది.

జీఎస్టీ సమర్థంగా అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, బ్యాంకులు ఇతర భాగస్వాములను వేగంగా అనుసంధానించే సమాచార సాంకేతిక (ఐటీ) చట్రాన్ని నిర్మించాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక జీఎస్టీ పోర్టల్‌ రూపొందించాలని నిశ్చయించింది. ఈ బాధ్యతను వస్తుసేవల పన్ను యంత్రాంగం (జీఎస్టీఎన్‌) అనే ప్రత్యేక సంస్థకు అప్పగించారు. రిజిస్ట్రేషన్‌, రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులకు జీఎస్టీఎన్‌ సాంకేతిక దన్ను ఇస్తుంది. జీఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. పన్ను చెల్లింపుదారులతో జీఎస్టీ నిర్వహణ సిబ్బంది వ్యవహరించే తీరు సక్రమంగా ఉండేట్లు చూడాలి. దివాలా చట్టం, బినామీ ఆస్తుల చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం జీఎస్టీ బిల్లునూ ప్రవేశపెట్టి ఆర్థిక రథం వేగంగా పరుగుతీసే వాతావరణాన్ని కల్పిస్తోంది. జీఎస్టీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడమే ఇక తరువాయి!

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.