IPL 2024 - playoffs race: చెన్నైకి గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!

ఐపీఎల్ 17 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్‌కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్‌ ఉంది. 

Published : 17 May 2024 00:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ చివరి దశకు చేరింది. మరో నాలుగు మ్యాచ్‌లు జరిగితే లీగ్ దశ ముగుస్తుంది. మూడు జట్లు (కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 14 పాయింట్లతో చెన్నై(Chennai Super Kings)తోపాటు బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ చేరడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. చెన్నైపై భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ముందంజ వేస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.

ఇలా జరిగితే చెన్నై రెండో స్థానానికి

శనివారం జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై తప్పక విజయం సాధించాలి. దీంతోపాటు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోవాలి. రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించాలి. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లు, హైదరాబాద్‌ 15 పాయింట్లతో ఉంటాయి. చెన్నై.. ఆర్సీబీపై గెలుపుతో 16 పాయింట్లు సాధించి మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో రాజస్థాన్‌ను అధిగమించి సెకండ్ ప్లేస్‌కు వెళ్తుంది. 

సన్‌రైజర్స్‌కూ అవకాశం  

ఆరెంజ్‌ ఆర్మీ తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడానికి ఛాన్స్‌ ఉంటుంది. అలా జరగాలంటే కోల్‌కతాతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లతో ఉంటుంది. హైదరాబాద్‌ 17 పాయింట్లతో రెండో స్థానానికి వెళ్తుంది.  

రెండు మ్యాచ్‌లూ రద్దయితే.. 

హైదరాబాద్‌, పంజాబ్ మ్యాచ్‌.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే హైదరాబాద్‌ 16 పాయింట్లు, చెన్నై 15 పాయింట్లతో లీగ్‌ దశను ముగిస్తాయి. ఆర్సీబీ ఇంటి ముఖం పడుతుంది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని