గురువారం, జనవరి 19, 2017

జనరల్

పారిశ్రామికరంగ అభివృద్ధికి నాబ్‌కాన్స్‌ తోడ్పాటు
పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నూతన పరిశ్రమల స్థాపన, వాటి విస్తరణకు కావాల్సిన రుణ సదుపాయాన్ని పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాబ్‌కాన్స్‌ క్రెడిట్‌ ఫెసిలిటేషన్‌ బ్యూరోను ఏర్పాటు చేసిందని బ్యూరో ప్రాజెక్టు మేనేజర్‌ ఏవీ రామకృష్ణారావు తెలిపారు. నాబ్‌కాన్స్‌ క్రెడిట్‌ ఫెసిలిటేషన్‌ బ్యూరో గురించి అవగాహన కార్యక్రమాన్ని విజయడవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ హాలులో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామకృష్ణారావు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి డీపీఆర్‌లు తయారు చేసి ఇస్తామన్నారు. ప్రతి జిల్లాలోను సంభావ్య రంగాల వివరాలను రూపొందించామని, ఏయే రంగాలు బాగున్నాయి, అభివృద్ధికి ఎందులో ఆస్కారం ఉన్నదో ఔత్సాహికులకు తెలియజేస్తామన్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో కాజు యూనిట్ల వల్ల కాలుష్యం వస్తున్నందున తరలించాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలిచ్చిందని, ఏపీఐఐసీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తే 106 యూనిట్లు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏపీఐఐసీతో మాట్లాడితే స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించిందని కొత్త యంత్రాల ఏర్పాటుకు 25 నుంచి 30 కోట్లు అవుతుందని ఈ విషయంపై బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇచ్చేందుకు అంగీకరించేలా చేశామన్నారు. చెప్పుల పరిశ్రమలు కూడా తరలించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని ఆయన వివరించారు. బ్యాంకులకు కొన్ని నిబంధనలు ఉంటాయని, రుణాలు ఇచ్చే విషయంలో వారు అన్ని రకాలుగా ఆలోచిస్తారన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.10 లక్షల వరకు సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలని, ఏదైనా బ్యాంకులు సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోతే, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు బ్యాంకు రూ.11వేల కోట్లు రుణాలు ఇస్తే అందులో ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చింది కేవలం రూ.200 కోట్లు మాత్రమేనని అన్నారు. నాబ్‌కాన్స్‌ టీమ్‌ హెడ్స్‌ కె.శ్రీహరి, ఎస్‌.జగన్‌మోహన్‌, కేపీఆర్‌ఎస్‌ విఠల్‌లు మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వారి క్రెడిట్‌ చూస్తారని, పరిశ్రమలు నడుపుతున్నవారికైతే బ్యాలెన్స్‌ షీట్‌లు చూస్తారన్నారు. స్టార్టప్‌ ఇండియాలో ఒక ఎస్సీ, ఎస్టీ, మహిళకు రుణాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించడం జరిగిందని.. మహిళలు రావడం లేదన్నారు. సిక్‌ రివైవల్‌ కమిటీలో చేసిన ప్రతిపాదనలు బ్యాంకర్లు పరిశీలించకపోతే బ్యాంకర్ల సమావేశంలో చర్చిస్తామన్నారు. ఛాంబర్‌ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ, ఛాంబర్‌ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలను, ఉత్పత్తిని పెంచేందుకు, ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు నాబ్‌కాన్స్‌ క్రెడిట్‌ బ్యూరో కన్సెల్టెన్సీని ప్రారంభించిందన్నారు. బ్యాంకులు రుణాలు మంజూరులో ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు వడ్డీ రేటు అధికంగా ఉండడం, 80 శాతం మాత్రమే రుణాలు ఇస్తుండడంతో రవాణా రంగంలో 90 శాతం రుణాలు ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి తీసుకుంటున్నారని జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు కోనేరు వెంకట రమేష్‌ తెలిపారు. ఫాప్సియా ప్రధాన కార్యదర్శి వి.మురళీ మాట్లాడుతూ సిక్‌ రివైవల్‌ కమిటీలో బ్యాంకు రుణాలకు సంబంధించి చర్చించి తీసుకున్న నిర్ణయాలను బ్యాంకర్‌ దృష్టికి తీసుకువెళితే పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. సమావేశంలో చర్చకు వచ్చిన సమస్యలపై ఒక నివేదికను ఏర్పాటుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో సమావేశమై ఆయనకు వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో ఎలీప్‌ ఛైర్‌పర్సన్‌ కె.కనకదుర్గ, సభ్యురాలు ఎం.మోహిని, కేవీఎల్‌ఓఎంఏసీ ఛైర్‌పర్సన్‌ వై.రాజారావు, స్థి´రాస్తి రంగం నుంచి ఎ.బాలాజీ, జీఎస్‌ఎస్‌ ప్రసాద్‌, కృష్ణా జిల్లా ఫైనాన్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జయప్రకాష్‌, ఆప్సియా అధ్యక్షుడు టి.పార్థసారధి, ఎస్‌.రమేష్‌ బాబు, కె.నాగేశ్వరరావు, కేటీ రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.