icon icon icon
icon icon icon

కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) 48 గంటల పాటు నిషేధం విధించింది.

Updated : 02 May 2024 06:57 IST

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
మహబూబాబాద్‌ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు
నేడు జమ్మికుంటలో భారాస అధినేత బస్సు యాత్ర, రోడ్‌షో రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) 48 గంటల పాటు నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్‌షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్‌ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నిర్దేశించింది. గతంలో కూడా కేసీఆర్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది. ‘‘2019, 2023లలో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు, సలహాల ఉత్తర్వులు జారీ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా కేసీఆర్‌ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నిందాపూర్వక వ్యాఖ్యలు, దూషణల ద్వారా నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తించాం. అందుకే ఆయన నిర్వహించే ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించాం’’ అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహబూబాబాద్‌ పట్టణంలో ప్రచారంలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్‌ బస్సు యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులను అందజేశారు. వాటిని స్వీకరించిన కేసీఆర్‌.. ఎన్నికల సంఘం సూచించిన విధంగా బుధవారం రాత్రి 8 గంటల లోపే తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం స్థానికంగా మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని భారాస ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్లిపోయారు.

నా వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ వక్రభాష్యం చెప్పింది: కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌ 5న సిరిసిల్లలో కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తమ పార్టీపై, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ మరుసటి రోజు ఈసీకి ఫిర్యాదు చేశారు. దానిపై నివేదిక పంపాల్సిందిగా ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిని ఆదేశించింది. అదే నెల 10న ఆయన నివేదిక పంపారు. దానిని అధ్యయనం చేసిన మీదట 18వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌కు ఈసీ నోటీసు జారీ చేసింది. వారం సమయం కావాలని ఆయన కోరడంతో 24 వరకు గడువు ఇచ్చింది. ఆ మేరకు 23న రాత్రి కేసీఆర్‌ సమాధానం పంపారు. ‘సిరిసిల్లలో ఎన్నికల వ్యవహారాల బాధ్యులైన అధికారులు తెలుగు వారు కాదు. తెలుగు మాండలికాన్ని అర్థం చేసుకోలేరు. నా విలేకరుల సమావేశంలోని కొన్ని వ్యాఖ్యలను తీసుకుని కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. నా వ్యాఖ్యలకు ఇంగ్లిషు తర్జుమా సక్రమంగా లేకపోవటమే కాకుండా వక్రభాష్యం చెప్పింది’ అని తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్‌ నాయకులను విమర్శించలేదు. కాంగ్రెస్‌ పార్టీ విధానాలు, పథకాలపై నేను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నా’ అని కేసీఆర్‌ తన లేఖలో వివరించారని ఈసీ పేర్కొంది. మరోవైపు ఈసీ ఉత్తర్వుల నేపథ్యంలో గురువారం జమ్మికుంటలో నిర్వహించాల్సిన బస్సు యాత్ర, రోడ్‌షోను కేసీఆర్‌ రద్దు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img