APSLPRB alert: ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌.. తుది రాత పరీక్ష తేదీలివే..

ఏపీలో ఎస్సై తుది రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో ఈ పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహించనున్నట్టు పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌ సింగ్‌వెల్లడించారు.

Updated : 30 Aug 2023 15:42 IST

అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. ప్రస్తుతం  ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి  పీఎంటీ/పీఈటీ పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించాలని ఏపీ పోలీస్‌ నియామక మండలి (APSLPRB) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో నిర్వహించనున్నట్టు ఏపీ పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ అతుల్‌ సింగ్‌ వెల్లడించారు. పీఎంటీ/పీఈటీ ఫలితాలు వెల్లడించిన తర్వాత తుది రాత పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. 

ఎస్సై తుది రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలో, మరో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటాయి. అక్టోబర్‌ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్‌ 1; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లూ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటాయి. అలాగే, అక్టోబర్‌ 15న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్‌-3, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌- 4 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.  

రాష్ట్రంలో మొత్తం 411 ఉద్యోగాల గానూ ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో 56,130 మంది అభ్యర్థులు స్టేజ్‌ -2 ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించడంతో ఆగస్టు 25 నుంచి విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు నాలుగు కేంద్రాల్లో దేహదారుఢ్య (పీఎంటీ/పీఈటీ) పరీక్షలు కొనసాగుతున్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని