APPSC-TSPSC: విస్తృత అధికారాలు సొంతం.. సమన్యాయ విధానమే లక్ష్యం

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు, కిందిస్థాయి న్యాయస్థానాలు ఉంటాయి. న్యాయవ్యవస్థ అనేది స్వయంప్రతిపత్తి కలిగిన అంశం.

Updated : 26 May 2024 00:56 IST

ఏపీపీఎస్సీ,ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ పాలిటీ
భారత న్యాయవ్యవస్థ, న్యాయసమీక్ష

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు, కిందిస్థాయి న్యాయస్థానాలు ఉంటాయి. న్యాయవ్యవస్థ అనేది స్వయంప్రతిపత్తి కలిగిన అంశం. కోర్టుల వ్యవహారం కేంద్ర జాబితా పరిధిలో ఉంటుంది. వీటి ఏర్పాటు, విధివిధానాలు, న్యాయమూర్తుల నియామకాలు, వారి ప్రమాణస్వీకారం, పదవీ కాలం, పదవీ విరమణ, జీతభత్యాలు తదితరాలన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటాయి. వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి.

సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారం

భారత రాజ్యాంగ పరిషత్తు అత్యంత శ్రద్ధ చూపిన ప్రధాన అంశాల్లో న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి, న్యాయ సమీక్ష అనే రెండు భావనలు ఉన్నాయి. 

 • ప్రాథమిక హక్కుల పరిరక్షణ, సమాఖ్య వివాదాల పరిష్కారం, రాజ్యాంగ ఆధిక్యతను పరిరక్షించడానికి న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి న్యాయసమీక్షాధికారం దోహదం చేస్తుంది.
 • న్యాయసమీక్ష అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. 
 • అమెరికాలో 1803లో మార్బరీ vs మాడిసన్‌ల మధ్య జరిగిన వివాదంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్‌ జాన్‌ మార్షల్‌ వెలువరించిన తీర్పు నుంచి న్యాయసమీక్ష సూత్రం ఆవిర్భవించింది.
 • రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు కె.ఎం.మున్షీ అభిప్రాయం ప్రకారం, శాసనం నిర్ణయించిన పద్ధతిలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అనివార్యం.
 • రాజ్యాంగంలోని ప్రకరణ 13(2)లో న్యాయ సమీక్షాధికారాన్ని న్యాయవ్యవస్థకు కల్పించారు.

చారిత్రక పరిణామం - ముఖ్య వివాదాలు

1951లో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో కొన్ని కులాలకు రిజర్వేషన్ల కోసం చేసిన చట్టాలను కొట్టివేస్తూ హైకోర్టు  తీర్పునిస్తే, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కొన్ని కులాలకు సాయం చేసే ఉద్దేశంతో ఇతర కులాలకు అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొంది. 

 • 1951లో ఎ.కె. గోపాలన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ వివాదంలో సెమినార్‌ పత్రిక సంపాదకుడైన రమేష్‌ థాపర్‌ను కారణాలు చెప్పకుండా నిర్బంధించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
 • 1952 శంకరీ ప్రసాద్‌ వివాదం, 1965లో సజ్జన్‌ సింగ్‌ వివాదంలో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, తద్వారా జమీందారీ, జాగీర్దారీ విధానాలను రద్దు చేసే పార్లమెంటరీ అధికారాన్ని కోర్టు సమర్థించింది.
 • 1969లో బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు కోసం చేసిన ఆర్డినెన్స్‌లను ప్రాథమిక హక్కుల పరిరక్షణ దృష్ట్యా చెల్లవని తీర్పు చెప్పింది.
 • 1973లో కేశవానంద భారతి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ వివాదంలో రాజ్యాంగానికి చేసిన 24, 25 సవరణలు పరిశీలనకు వచ్చాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు గోలక్‌నాథ్‌ వివాదంలో ఇచ్చిన తీర్పును మార్చి పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని తీర్పునిచ్చింది. 
 • 1980 మినర్వా మిల్స్‌ కేసు వివాదంలో 42వ రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చినప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని మరలా నొక్కి చెప్పి రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు పరిమిత అధికారమే ఉందని స్పష్టం చేసింది. అలాగే న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగమని, దాన్ని పరిమితం చేయడం లేదా మొత్తానికి తీసివేయడం జరగదని సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించింది.

న్యాయవ్యవస్థ - న్యాయ క్రియాశీలత

న్యాయశాఖ క్రియాశీలత అనేది న్యాయ సమీక్షాధికారంలో అంతర్భాగం. 

 • న్యాయశాఖ క్రియాశీలత అంటే న్యాయవ్యవస్థ తన అధికార విధులను మరింత చొరవగా, క్రియాశీలకంగా, ఉదారంగా వినియోగించడం. న్యాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో అనేక నూతన పద్ధతులను, ప్రక్రియలను వినియోగించి సమన్యాయ పాలనకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతుంది.

న్యాయశాఖ క్రియాశీలతకు కారణాలు: శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ తమ విధుల నిర్వహణలో విఫలమై, ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం.

 • ఓటు బ్యాంకు రాజకీయాల పట్ల దీర్ఘకాలిక, నిర్మాణాత్మక, కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రజల కనీస అవసరాలు కూడా మెరుగపరచని స్థితిలో ప్రభుత్వాలు కొనసాగడం.
 • ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా మూడో వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు, పౌరహక్కుల సంఘాలు ప్రజాప్రయోజనాల కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావచ్చు.
 • న్యాయస్థానాలు స్వయం ప్రేరిత (సుమోటో) కేసులను ప్రవేశపెట్టి ప్రజల హక్కుల కోసం తగిన ఆదేశాలను జారీ చేయడం.
 • దత్త శాసనాధికారాల వల్ల కార్యనిర్వాహకశాఖ అధికారాలు విస్తృతమై అధికార దుర్వినియోగం, జవాబుదారీతనం లోపించడం.

న్యాయశాఖ క్రియాశీలత ముఖ్య వివాదాలు: 2009లో ఫరీదాబాద్‌ గనుల్లో పనిచేసే బాలకార్మికుల స్థితిగతులపై బందువా ముక్తి మోర్చా వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు.

 • బిహార్‌ పశుగ్రాసం కేసు 
 • లక్ష్మీకాంత్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న మోసాలు. చిన్నపిల్లల దత్తత వివాదంలో సుప్రీంకోర్టు తీర్పులు.
 • ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అవినీతి వివాదం
 • రక్షణశాఖ కొనుగోళ్లలో కుంభకోణం
 • కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఆర్‌.బొమ్మై తొలగింపు వివాదం (1994)

రాష్ట్ర హైకోర్టు

రాష్ట్రంలో అత్యున్నత న్యాయశాఖ హైకోర్టు. ఇది కేంద్ర జాబితాలోని అంశం. 

 • రాజ్యాంగంలోని జుఖివ భాగంలో 214 నుంచి 231 వరకు గల అధికరణాలు హైకోర్టు గురించి వివరిస్తాయి.
 • భారతదేశంలో లార్డ్‌ కానింగ్‌ కాలంలో హైకోర్టుల చట్టం 1861 ప్రకారం కలకత్తాలో మొట్టమొదటి హైకోర్టును ఏర్పాటు చేశారు.
 • కలకత్తా హైకోర్టు 1862 ఆగస్టులో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
 • 1862లో మొత్తంగా మూడు హైకోర్టులను ప్రారంభించారు. అవి.. కలకత్తా, బొంబాయి, మద్రాస్‌ హైకోర్టులు.
 • 1866లో అలహాబాద్‌ హైకోర్టును ప్రారంభించారు. 
 • ఇందిరాగాంధీ vs రాజ్‌ నారాయణ్‌ రాయ్‌బరేలీ నియోజకవర్గం కేసులో భాగంగా అలహాబాద్‌ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని 1975లో తీర్పునిచ్చింది. (తీర్పు ఇచ్చినవారు జస్టిస్‌ సిన్హా)
 • ప్రకరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. 
 • రాష్ట్రాల్లో హైకోర్టులను నెలకొల్పే అధికారం పార్లమెంటుకు ఉంది.
 • 231 నిబంధన ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పలు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టులు ఉన్నాయి. అవి...

1. మహారాష్ట్ర, గోవా బొంబాయి హైకోర్టు పరిధిలోకి వస్తాయి.

2. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు కలిపి చంఢీగఢ్‌ హైకోర్టు

3. అసోం హైకోర్టు పరిధిలో ఆ రాష్ట్రంతో కలిపి నాలుగు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అవి అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్‌.

 • ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులున్నాయి.
 • ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం - అమరావతి హైకోర్టు (25వ) 2019 జనవరి 1న ప్రారంభమైంది. నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌.
 • మణిపూర్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల్లో 2013 మార్చిలో హైకోర్టులను ప్రారంభించారు.
 • 241 నిబంధన ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

ఉదా: 1966 సెప్టెంబరు 5న దిల్లీ హైకోర్టును ఏర్పాటు చేశారు.

 • హైకోర్టు పరిధిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అనుసంధానం చేయవచ్చు.

ఉదా: బొంబాయి హైకోర్టు పరిధిలోకి మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్‌ హవేలి, డయ్యూ డామన్‌లు వస్తాయి.

 • కలకత్తా హైకోర్టు పరిధిలో పశ్చిమ్‌ బంగా, అండమాన్‌ నికోబార్‌ దీవులు ఉన్నాయి.
 • తమిళనాడు, పుదుచ్చేరి మద్రాస్‌ హైకోర్టు పరిధిలో భాగం.

హైకోర్టు నిర్మాణం

ప్రకరణ 216 ప్రకారం ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. 

 • హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్రాలను బట్టి మారుతుంది. 
 • ఉత్తర్‌ప్రదేశ్‌ హైకోర్టు (అలహాబాద్‌)లో అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు ఉంటారు. 
 • సిక్కిం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర హైకోర్టుల్లో అతి తక్కువగా ఉన్నారు. 
 • 1956లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 1 + 11 సంఖ్యలో న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం ఉండాల్సిన సంఖ్య 1 + 36. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌. 
 • తెలంగాణలో 1 + 41 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ అరాధే.

నియామకం:

 • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అధికరణ 217 (1) ప్రకారం సీనియారిటీ సూత్రం ఆధారంగా, కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. వీరి నియామకంలో భాగంగా రాష్ట్రపతి కింది వారిని సంప్రదిస్తారు. 
 • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఆ రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాష్ట్రాల హైకోర్టు వ్యవహారాలు తెలిసిన సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులను రాష్ట్రపతి సంప్రదిస్తారు.

రచయిత
ఎం. ఈశ్వర వెంకటరావు విషయ నిపుణులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని