Indian Economy: నవకల్పనలకు ఊతం... సాంకేతిక ప్రగతికి బాట!

ఆర్థికాభివృద్ధి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఇది ఒక గుణాత్మకమైన భావనను కలిగి ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలు ముఖ్యమైనవి. అనేక దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు వివిధ లక్ష్యాలను నిర్దేశించుకుంటాయి.

Published : 23 May 2024 00:37 IST

టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

ఆర్థికాభివృద్ధి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఇది ఒక గుణాత్మకమైన భావనను కలిగి ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలు ముఖ్యమైనవి. అనేక దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు వివిధ లక్ష్యాలను నిర్దేశించుకుంటాయి. వీటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే అంశాలు

ఆర్థికాభివృద్ధిని రెండు అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. 

1) ఆర్థికపరమైన అంశాలు     2) ఆర్థికేతర అంశాలు

ఆర్థికపరమైన అంశాలు

వృద్ధి లేదా అభివృద్ధిని నిర్ణయించడంలో ఆర్థిక కారకాల్లో ఉత్పత్తి కారకాలే ముఖ్యమైనవని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 
ఈ అంశాలు పలు రకాలుగా ఉంటాయి. అవి....

సహజ వనరులు

ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ప్రధాన కారకం ఆ దేశంలో లభ్యమయ్యే సహజ వనరులు.

  • భూసారం, అటవీ సంపద, ఖనిజ వనరులు, చమురు, జీవావరణ వ్యవస్థ, జలవనరులు, సముద్ర వనరులు మొదలైనవి దీనిలో భాగంగా ఉంటాయి. విస్తారమైన వనరుల లభ్యత ఆర్థికవృద్ధికి కీలకమైన అంశం.
  • ఒక దేశంలో సహజ వనరుల లభ్యత తక్కువగా ఉంటే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందడం కష్టం. అయితే ఆర్థికవృద్ధికి సహజ వనరుల లభ్యత అవసరమే అయినా అది మాత్రమే సరిపోదు. దీనికి జపాన్, ఇండియా రెండూ పరస్పర విరుద్ధమైన ఉదాహరణలు.
  • లూయిస్‌ అభిప్రాయం ప్రకారం - ఇతర అంశాలు సమానంగా ఉన్నప్పుడు మానవులు సమృద్ధిగా ఉన్న వనరులను అల్ప వనరుల కంటే ఉన్నతంగా వినియోగించుకుంటారు. అల్పాభివృద్ధి చెందిన దేశాలు సహజ వనరులను వినియోగించలేవు లేదా తక్కువ/తప్పుగా ఉపయోగించవచ్చు. వాటి వెనకబాటుకు ఇదొక కారణం. ఆర్థిక వెనకబాటుతనం, సాంకేతిక ప్రగతి లేకపోవడమూ మరో కారణంగా చెప్పవచ్చు.
  • మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సహజ వనరులను అభివృద్ధి చేయవచ్చు. 

సహజ వనరులను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.

పునరుత్పత్తి చేసే వనరులు (Renewable Resources): నీరు, అటవీ సంపద, మత్స్య సంపద సౌరశక్తి మొదలైనవి.

పునరుత్పత్తి చేయలేని వనరులు: పెట్రోలియం, డీజిల్, బొగ్గు, చమురు, భూమి మొదలైనవి.


వ్యవసాయ స్వరూపం 

భూమి యాజమాన్య వ్యవసాయం ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులోని భూసంస్కరణలు, సాంకేతిక పరమైన మార్పుల ద్వారా వ్యవసాయంలో ఆధునికీకరణ, మెరుగైన ఉత్పాదకాలు, మార్కెటింగ్, పరపతి అనేవి ఆర్థిక రంగంలో వేగవంతమైన వృద్ధికి కారణం అవుతాయి.


పారిశ్రామిక నిర్మాణం

భారీ, చిన్నతరహా, కుటీర పరిశ్రమలు వాటి సాపేక్ష ప్రాధాన్యతను, వాటిలో ఉపయోగించే సాంకేతిక స్థాయిని కోరుకుంటాయి. 

అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగించడం వల్ల ఆధునికీకరణ ఏర్పడి వ్యవస్థ నిర్మితిలో మార్పు వస్తుంది. ఫలితంగా అధిక ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది. 

సాంకేతిక ప్రగతి: కొత్త పరిశోధన లేదా నవకల్పనల మూలంగా ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు రావడమే సాంకేతిక ప్రగతి. 

  • సాంకేతిక మార్పుల వల్ల శ్రమ, మూలధనం, ఇతర ఉత్పత్తి కారకాల ఉత్పాదకత పెరుగుతుంది.
  • షుంపీటర్, కుజ్నెట్స్‌ ఆర్థికవృద్ధిలో నవకల్పనను అతి ముఖ్యమైన సాంకేతిక కారకంగా పరిగణించారు. పరిశోధన, అభివృద్ధిపై జాతీయాదాయంలో ఎక్కువ శాతాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.

వ్యవస్థాపరమైన మార్పులు: సంస్థలు, సాంఘిక దృక్పథాలు, ప్రేరేపణల్లో విప్లవాత్మక మార్పుల ద్వారా సంప్రదాయ వ్యవసాయక సమాజం నుంచి ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు మారడాన్ని వ్యవస్థాపరమైన మార్పు అంటారు. 

ఉద్యోగ అవకాశాల కల్పన, శ్రామిక ఉత్పాదకత, మూల ధనరాశి పెరగడం, నూతన వనరులను ఉపయోగించడం, సాంకేతిక మెరుగుదల వీటిలో భాగం. 


వ్యవస్థాపన: ఆర్థిక కార్యకలాపాల్లో ఉత్పత్తి కారకాలను అభిలషణీయంగా ఉపయోగించడానికి సంబంధించినదే వ్యవస్థాపన. 

  • ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు నిర్వహించే విధులను నిర్వర్తిస్తూ వ్యాపారంలోని నష్టభయాన్ని, అనిశ్చితిని ఎదుర్కొంటాడు. 
  • అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యమిత్వ చర్యలు లేవు. వెనకబడిన దేశాలు ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని ఆయా దేశాల్లో కల్పించాలి. దీనికోసం అవసరమైన సామాజిక, ఆర్థిక, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయడం అవసరం. 

శ్రమ విభజన: ప్రత్యేకీకరణ, శ్రమ విభజన వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అంతేకాకుండా పెద్దతరహా ఉత్పత్తిలో ఆదా ఏర్పడి ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. 

  • ఆడమ్‌స్మిత్‌ ఆర్థికాభివృద్ధిలో శ్రమ విభజనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
  • శ్రమ విధాన మార్కెట్లు పరిమాణంపై ఆధారపడతాయి. పెద్దతరహా ఉత్పత్తి ఉన్నప్పుడు ప్రత్యేకీకరణ, శ్రమ విభజన అధికమవుతాయి. 
  • ఆధునిక రవాణా, కమ్యూనికేషన్‌ సాధనాలను ఏర్పాటు చేయడం వల్ల మార్కెట్‌ను విస్తృతం చేసి తద్వారా అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. 
  • అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికవృద్ధి లేదా అభివృద్ధిని వ్యవసాయక, పారిశ్రామికీకరణ వల్ల సాధించవచ్చు.

మార్కెట్‌లో విక్రయమయ్యే వ్యవసాయ మిగులు (Marketable surplus)

గ్రామీణ జనాభా మనుగడకు కావాల్సిన ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉన్న వ్యవసాయోత్పత్తిని మార్కెట్‌లో విక్రయమయ్యే వ్యవసాయ మిగులు అంటారు. 

  • వ్యవసాయ రంగ పురోగతిని మార్కెట్‌లో విక్రయించిన వ్యవసాయ మిగులు ద్వారా సూచిస్తారు.
  • వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు ఉత్పాదకతను పెంచడం ఒక దేశ అభివృద్ధిలో ముఖ్యమైన ప్రక్రియ. 
  • అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మార్కెట్‌లో విక్రయమయ్యే వ్యవసాయ మిగులుపై పట్టణ పారిశ్రామిక ప్రజల మనుగడ ఆధారపడి ఉంటుంది.
  • ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి క్రమంలో పట్టణ జనాభా నిష్పత్తి పెరిగితే ఆహార ధాన్యాల కోసం డిమాండ్‌ పెరుగుతుంది. 
  • ఈ పెరిగిన డిమాండ్‌ను సరైన రీతిలో ఎదుర్కోకపోతే పట్టణాల్లో ఆహార సమస్య ఏర్పడి ఆర్థికాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. 
  • ఏ దేశమైనా తగినంత అమ్మదగిన మిగులును సాధించడంలో విఫలమైనట్లయితే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి. ఇది విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం సమస్యకు కారణం అవుతుంది.
  • మనదేశం 1976 - 77 వరకు ఈ సమస్యను ఎదుర్కొంది. 
  • ఏదైనా ఒక దేశం పారిశ్రామికీకరణ వేగాన్ని కోరుకున్నప్పుడు వ్యవసాయ రంగాన్ని విస్మరించకూడదు.
  • పట్టణాల్లో పరిశ్రమల స్థాపన జరిగినప్పుడు గ్రామీణ ప్రజలు ఆకర్షితులవుతారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా ఆహార ధాన్యాల సరఫరా పెరగాలి.
  • వ్యవసాయ ఉత్పత్తి పెరిగినప్పుడు వ్యవసాయ రంగంలో ద్రవ్య ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఫలితంగా వినియోగ వస్తువులకు, వ్యవసాయ ఉత్పాదకాలకు గ్రామీణ డిమాండ్‌ పెరిగి పారిశ్రామికరంగ విస్తరణకు ప్రేరేపకంగా పనిచేస్తుంది.

విదేశీ వర్తకం

క్కువ కాలవ్యవధిలో పరిశ్రమలను స్థాపించే దేశాలు విదేశీవర్తకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. 

  • జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు తమ పారిశ్రామిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో స్థానాన్ని పొందగలిగాయి. 
  • సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన పరికరాలు, పారిశ్రామిక ఉత్పత్తుల్లో స్వావలంబనను సాధించే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులకు బదులుగా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఉండే స్థాయికి పరిశ్రమల అభివృద్ధి జరగాలి.
  • భారత్‌ లాంటి ఆర్థిక వ్యవస్థల్లో స్థూల ఆర్థిక అంతర్‌ సంబంధాలకు ప్రాధాన్యం ఉంది. ఈ దేశ సమస్యలకు పరిష్కారం కేవలం విదేశీ వర్తక రంగం ద్వారా మాత్రమే ఉండదు.

ఆర్థిక వ్యవస్థ 

క దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశ చారిత్రక ఏర్పాటు అభివృద్ధిని నిర్ణయిస్తుంది. 

  • స్వేచ్ఛా వాణిజ్య విధానం అమల్లో ఉన్న కాలంలో ఏ విధమైన ఆటంకాలు దేశ ఆర్థికవృద్ధిలో ఏర్పడవు. అయితే మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అభివృద్ధి వ్యూహంతో ఒక దేశం వృద్ధి చెందడం కష్టం.
  • ప్రస్తుతం మూడో ప్రపంచ (వర్తమాన) దేశాలకు రెండు అవకాశాలు ఉన్నాయి. అవి

1) సమర్థవంతమైన మార్కెట్‌ విధానం ఉండి ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యం జోక్యం హేతుబద్ధంగా, స్వేచ్ఛా విధానానికి అనుగుణంగా ఉండే పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం.

2) రాజ్యం పాత్ర ప్రధానంగా ఉండే సామ్యవాద ఆర్థిక ప్రణాళికలు అవలంబించడం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో రాజ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సామ్యవాద ఆర్థిక వ్యవస్థల్లో మార్కెట్‌ యంత్రాంగాన్ని అనుమతిస్తారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని