Current Affairs: కరెంట్‌ అఫైర్స్‌

2015 నాటి ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం ‘బాజీరావ్‌ మస్తానీ’లో ఏ హీరోయిన్‌ నృత్యం చేసిన ‘దివానీ మస్తానీ’ పాటను పొగుడుతూ ఆస్కార్‌ ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్‌ చేసింది?

Published : 22 May 2024 00:12 IST

మాదిరి ప్రశ్నలు

  •  2015 నాటి ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం ‘బాజీరావ్‌ మస్తానీ’లో ఏ హీరోయిన్‌ నృత్యం చేసిన ‘దివానీ మస్తానీ’ పాటను పొగుడుతూ ఆస్కార్‌ ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్‌ చేసింది? (మరాఠీ, కవ్వాలీ మేళవింపులో సాగే ఈ పాటకు కథక్, కాంటెంపరరీ విధానాల్లో నృత్య రీతులు తీర్చిదిద్దారు. ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ.) 

జ: దీపికా పదుకొణె

  • ః ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ), యూకేకు చెందిన వేస్ట్‌ అండ్‌ రిసోర్స్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌ సంస్థలు రూపొందించిన ‘ఆహార వృథా సూచీ నివేదిక-2024’ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2022లో ఎన్ని కోట్ల టన్నుల ఆహార పదార్థాలు వృథా అయ్యాయి? (ప్రపంచవ్యాప్తంగా 2022లో 550 కోట్ల టన్నుల మేర ఆహార పదార్థాలు ఉత్పత్తయ్యాయి. నివేదిక ప్రకారం అత్యధికంగా మాల్దీవుల్లో వార్షిక తలసరి ఆహార వృథా 207 కిలోలుగా ఉంది. ఇది భారత్‌లో 55 కిలోలుగా ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా వృథా అయిన మొత్తం ఆహారంలో గృహాల వాటా 60 శాతం; హోటళ్లు, రెస్టారెంట్లలో 28 శాతం, ఇతర చోట్ల 12 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.)

జ: 105 కోట్ల టన్నులు

  •  125 దేశాలతో కూడిన ‘ప్రపంచ ఆకలి సూచీ - 2023’లో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది? (ఈ సూచీలో శ్రీలంక (60వ స్థానం), బంగ్లాదేశ్‌ (81), పాకిస్థాన్‌ (102) మనకంటే కాస్త మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.) 

జ: 111

  •  ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తీవ్రస్థాయి క్షుద్బాధను అనుభవిస్తున్నారు.)

జ: 78.3 కోట్ల మంది


ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ 2024, మే 19న తూర్పు అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ మే 20న ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లా హియన్‌ (60) కూడా మృతి చెందారు. రైసీ 2021లో ఇరాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 


కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు.  తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు.


ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జీవాంజి దీప్తి బంగారు పతకం నెగ్గింది. 2024, మే 20న కోబె (జపాన్‌)లో జరిగిన మహిళల టీ20 400 మీటర్ల పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచింది. 2023లో పారిస్‌లో బ్రెనా క్లార్క్‌ (55.12 సె,. అమెరికా) నమోదు చేసిన రికార్డును అధిగమించింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6.2% వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని