Current Affairs: కరెంట్‌ అఫైర్స్‌

పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

Published : 29 May 2024 00:17 IST

మాదిరి ప్రశ్నలు

  • పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ ఈయన్ను నియమించారు. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం ప్రధానిగా ఉన్న మొహమ్మద్‌ ఇబ్రహీం ష్టయేహ్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఈయన నియమితులయ్యారు.)

: మొహమ్మద్‌ ముస్తఫా

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని టన్నుల పండ్లు ఉత్పత్తి అయ్యాయి? (పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. అరటి, బత్తాయి, నిమ్మ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో  నిలిచింది.)

జ: 11,20,77,190 టన్నులు

  • ప్రసార భారతి నూతన ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? (ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈయన్ను ప్రతిపాదిస్తూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. 2020 ఫిబ్రవరిలో ఎ.సూర్యప్రకాశ్‌ ప్రసార భారతి ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నాక ఈ పదవి ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది.)

జ: నవనీత్‌ కుమార్‌ సెహగల్‌

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) సీజన్‌ 2 విజేతగా ఏ జట్టు నిలిచింది? (దిల్లీలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ పై విజయం సాధించింది. టోర్నీలో అత్యధికంగా 347 పరుగులు చేసిన బెంగళూరు క్రీడాకారిణి ఎలీస్‌ పెరీ ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకుంది. టోర్నీలో అత్యధికంగా 13 వికెట్లు తీసిన బెంగళూరు క్రీడాకారిణి శ్రేయాంక పాటిల్‌ పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకుంది. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ పురస్కారాన్ని కూడా ఆమెనే గెలుచుకుంది.)

జ: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)


కరెంట్‌ అఫైర్స్‌

లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్‌ నౌసెడా (60) రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్‌పై ఆయన విజయం సాధించారు. నౌసెడాకు 74.5 శాతం ఓట్లు రాగా, సిమోనైట్‌కు 24.1 శాతం ఓట్లు వచ్చాయి.


కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా అశోక్‌ ఎస్‌ గోయల్‌ను 2024, మే 27న కేంద్రం నియమించింది. జూన్‌ 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సీఈఓగా పనిచేస్తున్న శివ్‌నందన్‌ కుమార్‌ రెండేళ్లుగా కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మే 31న పదవీ విరమణ చేయనున్నారు.


సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 2023-24లో రూ.2.8 లక్షల కోట్లుగా నమోదైందని ఇక్రా తెలిపింది. 2025-26 నాటికి ఇది 32% వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది.


ఫ్రికా దేశమైన ఘనాలో 4జీ, 5జీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రిలయన్స్‌ జియో అనుబంధ సంస్థ ర్యాడిసిస్, టెక్‌ మహీంద్రా, నోకియా లాంటి సంస్థలు పాలుపంచుకోనున్నాయి. ఈ సంస్థలతో ఘనా ప్రభుత్వ నేతృత్వంలోని నెక్ట్స్‌-జెన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ (ఎన్‌జీఐసీ) ఒప్పందాలు చేసుకుంది. నివేదికల ప్రకారం, కాంట్రాక్టు విలువ 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1660 కోట్లు)గా ఉంది. 


కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాయల్‌ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’కు గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు దక్కింది. ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారంగా దీన్ని పేర్కొంటారు.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు