ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

కార్పొరేట్‌ సంస్థలకు అవసరమైన ఉద్యోగార్హతలూ, నైపుణ్యాలూ విద్యార్థుల్లో ఉండటం లేదని అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి. ఆ నైపుణ్యాలను తమ పరిధిలో పెంపొందించుకునేందుకు విద్యార్థులు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి.

Published : 10 Nov 2022 00:02 IST

కార్పొరేట్‌ సంస్థలకు అవసరమైన ఉద్యోగార్హతలూ, నైపుణ్యాలూ విద్యార్థుల్లో ఉండటం లేదని అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి. ఆ నైపుణ్యాలను తమ పరిధిలో పెంపొందించుకునేందుకు విద్యార్థులు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి. ఇందుకు ఏయే అంశాలపై శ్రద్ధ పెట్టాలో చూద్దాం!  

వృత్తివిద్యా కోర్సులను చదివితేనే ఉద్యోగావకాశాలు దొరుకుతాయనేది అపోహ. ఏ కోర్సునయినా శ్రద్ధతో అభ్యసించి పట్టు సాధించాలి. ఎక్కువ మార్కులు సంపాదించాలని కాకుండా తమ సబ్జెక్టులను పూర్తిగా అర్థం చేసుకోవాలి. విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా చర్చించగలగాలి. మీరు సాంప్రదాయిక కోర్సు అయిన ఎంఏ అర్థశాస్త్రం చదువుతున్నారనుకుంటే.. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుంటేనే ఉపయోగం. యాంత్రికంగా చదివి పట్టా పొందినంత మాత్రాన ప్రయోజనం శూన్యం. కోర్సుకు సంబంధించిన వివిధ రచయితల గ్రంథాలను చదవడమే కాకుండా.. ఆ సబ్జెక్టుకు సంబంధించిన సమకాలీన పోకడలను అర్థంచేసుకోవడానికి పత్రికలూ, జర్నల్స్‌ చదవాలి. సంబంధిత విషయాలను అధ్యాపకులతో, స్నేహితులతో తరచూ చర్చిస్తుండాలి. అప్పుడే చదివిన కోర్సు మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది.


భావ వ్యక్తీకరణ: విద్యార్థులు ఏ కోర్సు చదువుతున్నప్పటికీ భావవ్యక్తీకరణలో నైపుణ్యం పెంచుకోవాలి. అంటే.. చెప్పదలుచుకున్న విషయాన్ని అర్థవంతంగా, స్పష్టంగా ఇతరులకు వివరించటం. అలాగే ఆ విషయాన్ని తప్పులు లేకుండా రాయటం. కార్పొరేట్‌ యుగంలో దీనికి అధిక ప్రాధాన్యం ఉంది. అందుకుగానూ మొదటి నుంచీ భాషపై, భావాల వ్యక్తీకరణపై పట్టు సాధించాలి. దీనికి తగిన శ్రద్ధ, సాధన అవసరమవుతాయి.


నాయకత్వం: విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్నపుడే మనం ఇతరులకు మార్గదర్శనం చేయగలుగుతాం. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారానికి ప్రయత్నించడం, ముందుండి సహచరులను ముందుకు నడిపించడం చేయాలి. ఇందుకు చొరవ ముఖ్యం.


చర్చలు: తరగతిలో అభ్యసించిన విషయాలకు మాత్రమే పరిమితం కాకుండా వాటికి అదనపు సమాచారాన్ని జోడించుకోవాలి. గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవటం ముఖ్యం. దినపత్రికలు, జర్నల్స్‌, ప్రముఖ రచయితల గ్రంథాలను తరచుగా చదువుతూ ఉండాలి. అప్పుడే సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. తెలుసుకున్న విషయాలను మిత్రులతో, ఆసక్తి ఉన్న ఇతరులతో చర్చించాలి. దీనిద్వారా విషయ పరిజ్ఞానం పటిష్ఠమవుతుంది.


సాంకేతికత: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన అభివృద్ధి కారణంగా ఎలక్ట్రానిక్‌/ డిజిటల్‌ పరికరాల వినియోగం ఎక్కువైంది. ప్రపంచంలో ఏ మూలన జరిగిన విషయమైనా క్షణాల్లో అందరికీ చేరుతోంది. ఇది విద్యార్థులకు మంచి అవకాశం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. కళాశాలలో నేర్చుకున్న అంశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అవసరమైన విషయాల శోధన, పరిశోధనలను చేపట్టాలి.


పరిశోధన: విద్యార్థులకు కొత్త విషయాల పరిశోధనల పట్ల ఆసక్తీ, అభిరుచీ ఉండాలి. ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. మొదటగా చిన్నచిన్న అంశాలను ఎంచుకుని వాటిని పరిశీలించాలి. తర్వాత ఆ అలవాటే ఇతర పెద్ద అంశాల పరిశీలనకు దారి చూపుతుంది. పరిశోధనల్లో ముందంజ వేసినవారికి కార్పొరేట్‌ రంగంలో మంచి డిమాండ్‌ ఉంటుంది.


సానుకూల దృక్పథం: ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలను చేస్తుండాలి. ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇందుకు పుస్తక పఠనం ఎంతో ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలను చదవడమే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న ప్రముఖుల జీవన విధానాలను గమనించాలి. వారి జీవన విధానం తెలుసుకుని ప్రేరణ పొందాలి.


సమయపాలన: చేయాల్సిన విధులను ఏదో సాకుతో వాయిదా వేసే అలవాటుకు దూరంగా ఉండాలి. దీనివల్ల పని ఆలస్యమవడమే కాకుండా ఆ పని మరుగునపడే అవకాశాలు ఎక్కువ. సమయపాలన, క్రమశిక్షణ వల్ల విద్యార్థి జీవితంలోనే కాకుండా కెరియర్లోనూ వేగంగా దూసుకువెళ్లటం సాధ్యమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని