బోధన, పరిశోధనలకు రహదారి.. నెట్‌!

బోధనలో మేటి గుర్తింపు, పరిశోధనల్లో పాగా వేయడానికి నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) ప్రామాణికం. ఈ పరీక్షలో లెక్చరర్‌షిప్‌లో అర్హత సాధించినవారు విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు ఎంపికైనవారు ప్రతి నెలా స్టైపెండ్‌ పొందుతూ పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు నెట్‌ స్కోరుతో ఉన్నత స్థాయి ఉద్యోగాలూ అందిస్తున్నాయి.

Updated : 09 Jan 2023 06:36 IST

మేటి కొలువులకూ వీలు

బోధనలో మేటి గుర్తింపు, పరిశోధనల్లో పాగా వేయడానికి నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) ప్రామాణికం. ఈ పరీక్షలో లెక్చరర్‌షిప్‌లో అర్హత సాధించినవారు విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు ఎంపికైనవారు ప్రతి నెలా స్టైపెండ్‌ పొందుతూ పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు నెట్‌ స్కోరుతో ఉన్నత స్థాయి ఉద్యోగాలూ అందిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) తరఫున నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏడాదికి రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇటీవలే ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...  

పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు నెట్‌ రాసుకోవచ్చు. పరీక్షను 83 సబ్జెక్టులు/విభాగాల్లో దేశవ్యాప్తంగా 398 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల్లో పరీక్షలు రాయడానికి ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాలను ఎంచుకోవచ్చు.

* నెట్‌లో అర్హత పొందినవారు తమ స్కోరును బోధన రంగంలో పాస్‌పోర్టులా ఉపయోగించుకోవచ్చు.

*  డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ స్కోరు సాధించినవారికి అధిక వేతనంతో ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి.  

*  శిక్షణ సంస్థల్లోనూ నెట్‌ అర్హులకు ప్రాధాన్యం ఉంది.  

*  ఎస్సీ, ఓబీసీ విభాగాల్లో నేషనల్‌ ఫెలోషిప్పులు పొందడానికి నెట్‌ తప్పనిసరి.  ఈ దఫా నెట్‌లో కొత్తగా ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ సబ్జెక్టు ప్రవేశపెట్టారు.


పరీక్ష ఇలా...

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 300 మార్కులు. 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు. పేపర్‌ 1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. 50 ప్రశ్నలకు వంద మార్కులు. రెండో పేపర్‌ వంద ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రం అభ్యర్థి ఎంపిక చేసుకున్న విభాగం/సబ్జెక్టు నుంచి ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్‌ 1, 2 మధ్య విరామం లేదు. పరీక్షను విడతలవారీ వివిధ తేదీలు, సమయాల్లో నిర్వహిస్తారు.  

పేపర్‌ 1: ఇందులో 10 విభాగాలు ఉంటాయి. అవి..టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌, కాంప్రహెన్షన్‌, కమ్యూనికేషన్‌, మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ), పీపుల్‌, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం. అభ్యర్థి బోధన, పరిశోధన రంగంలో రాణించగలరా, లేదా తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు. ఆలోచన విధానం, ఆంగ్లాన్ని అర్థం చేసుకునే తీరు, గణితంలో ప్రాథమిక పరిజ్ఞానం, తర్కం, విశ్లేషణ సామర్థ్యం, కమ్యూనికేషన్‌ సాధనాలు, అభివృద్ధి, పర్యావరణం, ఉన్నత విద్యలకు సంబంధించిన సాధారణ స్థాయి ప్రశ్నలే వస్తాయి.    

పేపర్‌-2: ఇందులో మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. అభ్యర్థి ఎంచుకున్న విభాగంలో.. ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా వీటిని అడుగుతారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉన్నప్పటికీ ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివితేనే సమాధానం గుర్తించగలరు. యూజీసీ వెబ్‌సైట్‌లో సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి.


అర్హత పొందితే...

జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హులు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ) దిశగా అడుగులేయవచ్చు. వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెలా  రూ.31,000 చెల్లిస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించకపోతే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఏటా కంటింజెన్సీ గ్రాంటు అందుతుంది. ఇటీవలికాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.

కటాఫ్‌

సబ్జెక్టు బట్టి మారుతుంది. ఆ సబ్జెక్టులో పరీక్ష రాసినవారి సంఖ్య, ప్రశ్నపత్ర కఠినత్వం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి. లెక్చరర్‌షిప్‌ అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 200 మార్కులు పొందితే సరిపోతుంది. అదే జేఆర్‌ఎఫ్‌ కోసమైతే 220 వరకు రావాలి. కొన్ని సబ్జెక్టుల్లో లెక్చరర్‌షిప్‌ 180 మార్కులకీ పొందవచ్చు. జేఆర్‌ఎఫ్‌ 200కీ లభిస్తోంది.


ఇవి గమనించండి

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జేఆర్‌ఎఫ్‌ కోసం ఫిబ్రవరి 1, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపులు వర్తిస్థాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత పొందడానికి వయసు నిబంధన లేదు. విద్యార్హతలున్న ఎవరైనా రాసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 17 సాయంత్రం 5 వరకు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1100. ఓబీసీ(నాన్‌ క్రీమీ లేయర్‌), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.550; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.275.

పరీక్షలు: ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు.

వెబ్‌సైట్‌:  https://ugcnet.nta.nic.in/


ఏ పుస్తకాలు?

ట్రూమెన్స్‌/అరిహంత్‌/ఉప్‌కార్‌/ టాటా మెక్‌గ్రాహిల్స్‌/ పియర్సన్‌ వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకోవచ్చు.  


సన్నద్ధత ఎలా?

* సబ్జెక్టుపై మీకెంత పట్టు ఉందో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి.

*  రెండు, మూడు అంశాలను కలిపి ఒకే ప్రశ్నగా రూపొందిస్తారు. ప్రాథమికాంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఇలాంటి వాటికి సమాధానం గుర్తించగలరు.

*  ముందుగా డిగ్రీ పాఠ్యాంశాలను విస్తృతంగా చదవాలి. ఏవైనా చాప్టర్లు అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వాటిని ఇంటర్మీడియట్‌ స్థాయిలో అధ్యయనం చేయాలి. ఈ పుస్తకాలు బాగా చదవడం పూర్తయ్యాకే పీజీ పాఠ్యాంశాల్లోకి వెళ్లాలి.

*  అకడమిక్‌తోపాటు రిఫరెన్స్‌ పుస్తకాలూ అవసరమవుతాయి. అయితే వాటిని పరిమితంగానే ఎంచుకుని, బాగా చదవాలి. ఒకే అంశంలో ఎక్కువ పుస్తకాలు అధ్యయనం వల్ల సమయం సరిపోదు. ఆశించిన ప్రయోజనమూ దక్కదు.

*  చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సు రాసుకోవాలి. పరీక్షకు ముందు వీటిని మరోసారి శ్రద్ధగా గమనించాలి.  

*  పాత ప్రశ్నపత్రాలు నిశితంగా గమనించాలి. ప్రశ్నలడిగే విధానం, వాటి స్థాయి, అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం పరిశీలించి, సన్నద్ధతలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.

*  ఎలాంటి ప్రశ్న వచ్చినా ఎదుర్కోగలిగే స్థాయిలో అధ్యయనం ఉండాలి.  

*  రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌/స్లెట్‌ పేపర్లూ పరిశీలించవచ్చు. జేఎల్‌, డీఎల్‌ ప్రశ్నపత్రాలూ ఉపయోగపడతాయి. పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల అధ్యయనమూ మేలు చేస్తుంది.

* సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ చాప్టర్లు/విభాగాల్లో తప్పులొస్తున్నాయో తెలుసుకుని వాటిని మరింత శ్రద్ధగా చదవాలి. ఇదే పద్ధతిని చివరిదాకా కొనసాగిస్తే అభ్యాసం సరైన దిశగా వెళ్తున్నట్లు భావించవచ్చు. పరీక్షలో విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

* రుణాత్మక మార్కులు లేవు కాబట్టి బాగా ఆలోచించి తెలియని ప్రశ్నలకూ జవాబులు గుర్తించవచ్చు.

*  ఏదైనా ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నా, ప్రశ్నలో ఏమైనా పొరపాట్లు ఉన్నా బోనస్‌ మార్కులు ఇస్తారు. అయితే ఆ ప్రశ్నకు ఏదో ఒక ఆప్షన్‌ జవాబుగా గుర్తించినవారికే ఇవి దక్కుతాయి. ఏ సమాధానమూ ఇవ్వనివారికి ఈ మార్కులు జతచేయరు. అందువల్ల తెలియని ప్రశ్నలకూ ఏదో ఒక ఆప్షన్‌ సమాధానంగా ఇవ్వాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని