మంచి మార్కులకు మెలకువలు ఇవిగో!

ఏడాది పొడవునా ఎంత శ్రద్ధగా చదివినా పరీక్షల  సమయానికి ఎంతోకొంత ఆందోళన సహజం. ‘చదివినవన్నీ పరీక్షలో వస్తాయో రావో.. సమయంలోగా అన్నీ రాయగలుగుతామో లేదో... అసలు చదివినవన్నీ గుర్తుంటాయో లేదో’- ఇలా రకరకాల సందేహాలు వస్తుంటాయి.

Updated : 22 Feb 2023 03:50 IST

ఏడాది పొడవునా ఎంత శ్రద్ధగా చదివినా పరీక్షల  సమయానికి ఎంతోకొంత ఆందోళన సహజం. ‘చదివినవన్నీ పరీక్షలో వస్తాయో రావో.. సమయంలోగా అన్నీ రాయగలుగుతామో లేదో... అసలు చదివినవన్నీ గుర్తుంటాయో లేదో’- ఇలా రకరకాల సందేహాలు వస్తుంటాయి. ఇవన్నీ ఒత్తిడికి కారణమవుతూ పరీక్షల్లో సరైన మార్కులు రాకుండా చేస్తాయి. దీనికి ఆస్కారం ఇవ్వకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే కొన్ని కిటుకులు పాటించాలి.

‘సరిగా రాయలేనేమో.. అనుకున్న మార్కులు వస్తాయో..రావో’... పరీక్షల ముందు సాధారణంగా విద్యార్థుల ఆలోచనలన్నీ ఇలాగే సాగుతుంటాయి. అనుమానాలూ వస్తుంటాయి. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మితే సమస్యలను సులువుగా అధిగమించొచ్చు. నిజానికి అందరూ ఎక్కువ మార్కులు రావాలనే కోరుకుంటారు. అయితే మనం చేసే ప్రయత్నాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. అందుకే ప్రతికూల ఆలోచనలు మన ప్రయత్నాలకు అవరోధం కలిగించకుండా చూసుకోవాలి. సానుకూలంగా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలి.

సమయం విలువ

సమయం విలువ తెలుసుకున్నారంటే... సగం విజయం సాధించినట్టే. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ ఎలా ఉన్నా.. పరీక్షల ముందు అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయం ఎంతో విలువైంది. కాబట్టి ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించాలి. ఏడాది మొదట్లో చదివిన పాఠ్యాంశాలు ఇప్పుడు పూర్తిగా గుర్తుండకపోవచ్చు. కాబట్టి వాటిని ఒకసారి పునశ్చరణ చేసుకోవడం వల్ల పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఇంతకుముందు సరిగా చదవలేదనుకోండి. అదే విషయాన్ని పదేపదే తలుచుకుంటూ ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ప్రస్తుత సమయమూ వృథా అవుతుంది. కాబట్టి నిర్ణీత సమయంలోగా కొన్ని పాఠ్యాంశాలను పూర్తిచేయాలనే నియమం పెట్టుకుని చదవాలి. అందుబాటులో ఉన్న ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  

అతిగా ఆలోచనలు వద్దు

అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. దాంతో ఒత్తిడి పెరిగిపోతుంది. ఏడాది చివరిలో ఏ విద్యార్థి అయినా పరీక్షలు రాయాల్సిందే. విద్యార్థి జీవితంలో పరీక్షలనేవి ఒక ముఖ్యమైన భాగం. రాయక తప్పని వీటి గురించి అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. విద్యా సంవత్సరంలో అధ్యాపకులు పాఠాలను బోధిస్తారు. విద్యార్థులు వాటిని శ్రద్ధగా విని.. చదువుకుని గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత వాటిని పరీక్షల్లో రాస్తారు. అంటే.. విద్యా సంవత్సరంలో పరీక్షలనూ భాగంగానే చూడాలి. పరీక్షలంటే సాధారణంగా కొంత ఒత్తిడి ఉండటం సహజం. కానీ విపరీతమైన ఒత్తిడికి గురైతే.. అది ఆరోగ్యం మీదా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దృష్టి పరీక్షల మీద కాకుండా. వాటిని ఎంత బాగా రాయగలరనే దానిమీదే కేంద్రీకరించాలి.

పోల్చుకుంటే సమస్యలే

తోటి స్నేహితులు ఎలా సన్నద్ధం అవుతున్నారో తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. దీనివల్ల నష్టమేగానీ లాభం ఉండదు. వాళ్లు చదివినన్ని ఛాప్టర్లు మీరు చదివి ఉండకపోవచ్చు. ఇలా వారితో పోల్చుకోవడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. తక్కువ సమయంలో వారిలా మీరు అన్నీ చదవగలుగుతారో లేదోననే దిగులూ మొదలవుతుంది. సన్నద్ధత విషయంలో ఎవరి బలాలు వారివి. కొన్ని పాఠ్యాంశాలు కొందరికి త్వరగా రావొచ్చు. మరికొందరికి ఆలస్యం కావొచ్చు. కాబట్టి పోల్చుకోవడం మానేసి వీలైనంత మెరుగ్గా సన్నద్ధం కావడమే మంచిది.

గుర్తు చేసుకోవాల్సినవి

విద్యార్థిగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరై ఉంటారు. పాఠాలను శ్రద్ధగా విని నోట్సు తయారుచేసుకునే ఉంటారు. లైబ్రరీకి వెళ్లి అదనంగా ఎన్నో కొత్త విషయాలనూ నేర్చుకునే ఉంటారు. బాధ్యతగల విద్యార్థిగా ఈ పనులన్నీ మీరు చేసే ఉంటారు. వీటికి ఒకసారి గుర్తుచేసుకుంటే.. ఈ పనులన్నీ బాగా చేసిన మీరు పరీక్షలనూ బాగా రాయగలరనే నమ్మకం వస్తుంది. అలాగే అనవసర వ్యాపకాలతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకోకపోవడమే మంచిది. అప్పట్లో సమయాన్ని వృథా చేశారనే ఆలోచన.. ఇప్పుడు అనవసరమైన ఒత్తిడికి కారణమవుతుంది. పరీక్షల ముందు మీ ఆలోచనలు ఎప్పుడూ మీలో విశ్వాసాన్ని పెంచడానికి మాత్రమే తోడ్పడాలి.

చిన్న విరామం

ఒక్కోసారి అసలు పుస్తకం తీయాలనిపించదు.. ఒకవేళ తీసినా ఒక్క అక్షరం కూడా చదవాలనిపించదు. ఎంత ప్రయత్నించినా మీ దృష్టి ఎంతకూ చదువు మీదకు మళ్లదు. అలాంటప్పుడు చిన్న విరామం తీసుకోవడమే మంచిది. దీనివల్ల సమయం వృథా అవుతుందనుకోవద్దు. ఇలాంటప్పుడు కాసేపు అలా ఆరుబయట నడవడం.. ఇష్టమైన ఆటలు ఆడటం.. బాగా నచ్చే పాటలను వినడం.. లాంటివి చేయాలి. ముఖ్యంగా స్ఫూర్తిదాయక గీతాలను వినడం వల్ల ప్రేరణ పొంది.. ఇష్టంగా చదువుతారు. ఇలా సేదతీరితే తేడా మీకే తెలుస్తుంది.

పునశ్చరణ ప్రణాళిక

చదవడానికి సాధారణంగా ప్రణాళిక వేసుకుంటారు కదా. సరిగ్గా అలాగే పునశ్చరణ (రివిజన్‌)కూ తగిన ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. నేర్చుకోవటం ఎంత ముఖ్యమో పునశ్చరణ కూడా అంతే ముఖ్యం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే విలువైన మార్కులను కోల్పోవాల్సివస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్టులను పునశ్చరణ చేసుకోవాలో స్పష్టంగా టైమ్‌టేబుల్‌ వేసుకోవాలి. దాన్ని పాటించాలి. అలాగే ప్రతి గంటకూ పది నిమిషాలపాటు విరామం తీసుకోవడం మంచిదే. దీనివల్ల పునరుత్తేజాన్ని పొంది పాఠ్యాంశాలను ఆసక్తిగా చదవగలుగుతారు.

స్మార్ట్‌ఫోన్లకు దూరంగా

చదివేటప్పుడు ఫోన్‌ను పక్కన కాకుండా మరో గదిలో పెట్టుకోవడమే మంచిది. నోటిఫికేషన్లు వస్తే మీ దృష్టి ఫోన్‌ మీదకు మళ్లుతుంది. స్నేహితులు ఫోన్‌ చేసినా.. సందేశాలు పంపినా చదవడం మానేసి వాటి గురించే ఆలోచించడం మొదలుపెడతారు. అలాగే మీకు పరీక్షలు జరిగే తేదీల్లోనే స్నేహితులందరికీ జరగవు కదా. కొన్నిసార్లు వాళ్లు ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తారు, విహార యాత్రల అనుభవాలతో వీడియోలూ పంపుతుంటారు. ఇవన్నీ మీ ఏకాగ్రతకు భంగం కలిగించొచ్చు. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌కు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. అలాగే చదువుకునేటప్పుడు అంతరాయం కలిగించొద్దని కుటుంబ సభ్యులకూ ఒక మాట చెప్పి ఉంచితే మంచిది.

వ్యాయామం ఆపొద్దు

శారీరక వ్యాయామం పరీక్షల ముందు కూడా కొనసాగించొచ్చు. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంతోపాటు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. పరీక్షల ఒత్తిడితో ఏదో ఒకటి తినటం కాకుండా పోషకాహారం తీసుకోవాలి. అలాగే నిద్రకు కేటాయించే సమయాన్నీ కుదించి.. దాన్ని కూడా చదవడానికే వాడాలని తాపత్రయపడకూడదు. తగినంత విశ్రాంతి తీసుకుంటేనే ఏకాగ్రతతో చదవగలుగుతారు. అప్పుడే మంచి మార్కులు వస్తాయి.  

సానుకూల ఆలోచనలు

కష్టపడకుండా అత్యుత్తమ ఫలితాలను పొందాలని మీరు కోరుకోవడం లేదు. నిజాయతీగా కష్టపడిన తర్వాతే ఫలితాన్ని ఆశిస్తున్నారు. కాబట్టి ఫలితాలూ సానుకూలంగానే ఉంటాయి. సానుకూల ఆలోచనల వల్ల పరీక్షలు రాయటానికి అవసరమయ్యే ఆత్మ విశ్వాసమూ పెరుగుతుంది.


నేర్చుకోవటం ఎంత ముఖ్యమో పునశ్చరణ కూడా అంతే ముఖ్యం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే విలువైన   మార్కులను కోల్పోవాల్సివస్తుంది.

ఏ రోజు ఏ సబ్జెక్టులను పునశ్చరణ చేసుకోవాలో స్పష్టంగా టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి. దాన్ని పాటించాలి.


ఉపయోగపడే యాప్స్‌!

పరీక్షల సందర్భంగా ఎదురయ్యే ఆందోళన, ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని యాప్స్‌ సహాయపడతాయి.  

బ్రీత్‌2రిలాక్స్‌: ఈ ఉచిత యాప్‌ను కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. డౌన్‌లోడ్‌ చేసుకుని.. దీంట్లో సూచించిన విధంగా శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలినప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని కొలుస్తారు. ప్రతి సెషన్‌లోని ఫలితాలను భద్రపరిచే రికార్డును నిర్వహిస్తారు. దీని ద్వారా శ్వాస వ్యాయామాల పనితీరును పరీక్షించుకోవచ్చు.

మైండ్‌షిఫ్ట్‌: దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్ని రకాల భయాలు, ఆపదలు రాబోతున్నాయని ముందుగానే ఊహించుకుని ఒత్తిడికి గురికావడం, ఎదుటివాళ్లు ఏమనుకుంటారోనని భయపడటం వీటన్నింటికీ దీంట్లో పరిష్కారాలను సూచించారు. ఆలోచనలను రికార్డు చేయడం ద్వారా ఒత్తిడికి గురిచేసే అంశాలను గుర్తించే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో ఆడియో రికార్డింగ్‌ల లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది.

సాన్‌వెల్లో: మానసిక ఆరోగ్య మార్గాలూ, ధ్యానానికి సంబంధించిన మార్గదర్శకాలనూ దీంట్లో పొందుపరిచారు. ఒత్తిడిని తగ్గించుకుని, విశ్వాసాన్ని పెంచుకునే చిట్కాలూ అందుబాటులో ఉంటాయి. గుండె కొట్టుకునే వేగాన్ని రికార్డు చేసే మానిటర్‌ ఉంటుంది. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక ఫీచర్లకు మాత్రం నామమాత్రపు ఫీజు చెల్లించాలి.

సెల్ఫ్‌హెల్ప్‌ ఫర్‌ యాంగ్జైటీ మేనేజ్‌మెంట్‌: ఈ అప్లికేషన్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించారు. దీన్ని గూగుల్‌, ఆపిల్‌ ప్లేస్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను తెలియజేస్తుంది. దీంట్లో అందుబాటులో ఉండే జర్నల్‌లో రోజు మొత్తంలో ఒత్తిడి స్థాయులను రికార్డు చేసుకోవచ్చు. దీనిద్వారా ఏయే సందర్భాల్లో ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారో సులువుగా తెలుసుకోవచ్చు.

వర్రీవాచ్‌: ఈ యాప్‌ను కళాశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం రూపొందించారు. తక్కువ ఫీజుతో యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రోజు మొత్తంలో ఒత్తిడికి గురైన సందర్భాలను, అనుభవాలను దీంట్లో రాసుకోవచ్చు. వీటి ద్వారా ఒత్తిడికి అసలు కారణాలను గుర్తిస్తారు. ఈ యాప్‌ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది.

హ్యాపీఫై: దీంట్లో కొన్ని గేమ్స్‌, యాక్టివిటీస్‌ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, డెస్క్‌టాప్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్‌ వేదికగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. యాప్‌లోని వివిధ ఆటల ద్వారా వినియోగదార్లు పొందిన ఆనందాన్ని కొలుస్తారు. నాలుగు వారాలపాటు వీటిని ఆడిన తర్వాత 80 శాతం మందిలో మూడ్‌ మెరుగైనట్టు గుర్తించారు. దీన్ని వాడటానికి ముందు కొన్ని సంక్షిప్త సర్వే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సబ్‌స్క్రైబ్‌ చేసుకుని ఈ యాప్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని