సాధన... కృషి సాగటం లేదా?

విద్యార్థులందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. కానీ కొందరు మాత్రమే వాటిని సజావుగా సాధించగలుగుతున్నారు. మిగిలినవారి సంగతి..? మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకూ కొనసాగకపోవడంతో వీరు మధ్యలోనే వదిలిపెట్టేస్తుంటారు.

Updated : 23 Mar 2023 06:35 IST

విద్యార్థులందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. కానీ కొందరు మాత్రమే వాటిని సజావుగా సాధించగలుగుతున్నారు. మిగిలినవారి సంగతి..? మొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకూ కొనసాగకపోవడంతో వీరు మధ్యలోనే వదిలిపెట్టేస్తుంటారు. ఇలా కాకుండా చివరవరకూ అదే స్ఫూర్తిని కొనసాగించాలంటే...?

‘బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి.. ఈ ఇంటర్వ్యూ లో నెగ్గి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి.. లక్షల మంది పోటీ పరీక్షలు రాస్తున్నాసరే.. నేను మాత్రం పాసవ్వాల్సిందే..’ ఇలా ఎవరికివారు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అవి ఆచరణలోకి రావటానికి పాటించాల్సిన మెలకువలు ఏమిటంటే.. 

ఇష్టంగా చదవాలి

ఏదో తప్పదుకాబట్టి మొక్కుబడిగా చదవాలనుకోవడం వేరు. సాధించి తీరాలనే పట్టుదలతో ఇష్టంగా చదవడం వేరు. స్నేహితులు చదువుతున్నారనో, డిమాండ్‌ ఉందనో మీరో కోర్సును ఎంచుకున్నారనుకుందాం. ఇష్టంతో కాకుండా.. ఇతరుల అభిప్రాయాలకు విలువనిచ్చి అలాచేసి ఉండొచ్చు. దీంతో మొదట్లో ఉన్న ఉత్సాహం కాస్తా క్రమంగా కరిగిపోతుంది. పొరపాటు చేశామనే భావనే రోజురోజుకూ పెరుగుతుంది. అలాకాకుండా మీకు ఇష్టమైన కోర్సునే ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. చివరివరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించగలుగుతారు.

సానుకూల ఆలోచనలు

మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే ఏ పనీ చేయాలనిపించదు. గతంలో మొదలుపెట్టిన పనినీ చివరివరకూ కొనసాగించలేరు. ఏ విషయం గురించైనా ప్రతికూలంగా ఆలోచిస్తే నిరాశ పెరిగిపోతుంది. ఉదాహరణకు కాస్త కష్టంగా అనిపించే సబ్జెక్టును చదువుతున్నారు అనుకోండి.. అలాంటప్పుడు ‘ఈ సబ్జెక్టు ఇంతే ఎంత కష్టపడ్డా ఇందులో పాసుమార్కులే గగనం’ అనుకుంటే చదువు ముందుకు సాగదు. ‘ఇది స్కోరింగ్‌ సబ్జెక్టు.. కాస్త ప్రయత్నిస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు’ ఇలా ఆలోచించారనుకోండి వెంటనే ఉత్సాహంతో పుంజుకుంటారు. సంతోషంగా చివరి వరకూ చదవగలుగుతారు. ఎప్పటికప్పుడు సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే ఏ పనినైనా సగంలోనే వదిలిపెట్టాల్సిన అవసరం రాదు. కాబట్టి ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సానుకూల ఆలోచనలతో జయించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

సంతోషం పంచుకోవాలి

అనుకున్నది సాధించినప్పుడు ఆ ఆనందాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలి. ఉదాహరణకు మీకిష్టమైన సబ్జెక్టులో క్లాసులోని అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు కూడా. ఆ సంతోషాన్ని నలుగురితో కలిసి పంచుకుంటే రెట్టింపు అవుతుంది. ఆ ఆనందం మీలో ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. దాంతో ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆపేయాలనే ఆలోచనే రాదు.

సృజనాత్మకత

ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణిలో పనులు చేసుకుంటూ వెళితే కొన్నాళ్లకే బోరు కొట్టేస్తుంది. పరిధిని దాటి సులువైన పద్ధతుల కోసం ఆలోచించాలి. చేసే పనులనే కాస్త కొత్తగా, సృజనాత్మకంగా చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ఒక సబ్జెక్టును తీసుకుని రోజంతా అదే చదువుతూ కూర్చోకూడదు. దీనివల్ల మెల్లగా చదవొచ్చులే అనే ధోరణితో సమయాన్ని వృథా చేస్తారు. దీనికి బదులుగా టైమ్‌టేబుల్‌ వేసుకుని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించాలి. దీన్ని ఆచరించడం వల్ల సమయం వృథా కాదు, ఉత్సాహంగానూ చదవగలుగుతారు.

చురుగ్గా పనిచేస్తేనే

సాధించాల్సిన లక్ష్యాల గురించి వివిధ రకాలుగా ఆలోచిస్తారు. తగిన ప్రణాళికలూ వేసుకుంటారు. అయితే మీ అభివృద్ధి ఎప్పుడూ ఊహలకే పరిమితం కాకూడదు. మీ ఆలోచనల రథానికి మీరే సారథి. కాబట్టి మీ నాయకత్వంలోనే అవన్నీ నిజమయ్యేలా అన్ని రకాలుగా ప్రయత్నించాలి. మీరు బద్ధకంగా ఉండకుండా చురుగ్గా పనిచేస్తేనే వాటిని నిజం చేయగలుగుతారు.


కారణం సరైందేనా..

అందరూ అన్ని రోజులూ ఒకే విధంగా ఉండలేరు. ఒకరోజు సంతోషంగా అనిపించొచ్చు.. మరోరోజు విచారంగానూ ఉండొచ్చు. అలాంటప్పుడు విచారానికి వెనుక ఉన్న అసలు కారణాన్ని అన్వేషించాలి. అది సరైనదా కాదా అనే దిశగానూ ఆలోచించాలి. సరికాని దాని గురించి గంటలకొద్దీ ఆలోచిస్తూ కూర్చుంటే ప్రతికూల ఆలోచనలే వస్తాయి. ఇలాంటి వాతావరణంలో ఉత్సాహంగా చదువును కొనసాగించలేరు. తార్కికంగా, హేతుబద్ధంగా ఆలోచించడం మొదలుపెడితే ఆనందంగా ముందుకు వెళ్లగలుగుతారు.


సహనంతోనే ఫలితం

అన్ని పనులూ వెంట వెంటనే జరిగిపోయి ఉత్తమ ఫలితం వచ్చేయాలంటే ఏదీ సాధ్యం కాకపోవచ్చు. ఏది సాధించాలన్నా ముందుగా కావాల్సింది సహనమే. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పరీక్షలు ఉండవు కదా. అధ్యాపకులు పాఠాలు బోధించాలి.. వాటిని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. చివరగా వార్షిక పరీక్షలు రాయాలి. ఆ తర్వాతే తుది ఫలితాలు వస్తాయి. ఇదంతా జరగడానికి అటూఇటూగా ఏడాది సమయం పడుతుంది. సహనమే లేకపోతే చేసే ప్రయత్నాలను మధ్యలోనే ఆపేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సిలబస్‌ మొత్తం పూర్తిచేయాలనే ఆతృతలో అర్థమైనా కాకపోయినా చదువుకుంటూ వెళితే.. ఫలితం శూన్యమే. కాస్త సమయం తీసుకున్నా పాఠ్యాంశాలను అర్థంచేసుకుంటూ మెల్లగా చదవాలి. వేయి అడుగుల ప్రయాణమైనా.. మొదలయ్యేది ఒక్క అడుగుతోనే కదా!


అతిగా ఆలోచించడం

ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూడటం వల్ల స్థిమితంగా ఉండలేరు. మానసిక ప్రశాంతతనూ కోల్పోతారు. దాంతో చేతిలో పుస్తకం ఉన్నా.. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. చదువుతున్న దానికి మధ్యలోనే అంతరాయం కలిగి సమయం వృథా అవుతుంది. ఉదాహరణకు ప్రీఫైనల్స్‌లో మార్కులు తక్కువ వచ్చాయనుకుందాం. ఫైనల్స్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందేమోననే అనుమానం పెట్టుకుంటే స్థిమితంగా చదవలేరు.


మార్పు సహజం

మార్పు అనేది అత్యంత సహజం. నిన్నటిలా ఈరోజు ఉండదు.. ఈరోజులా రేపూ ఉండదు. ఈ సూత్రం చదువుకూ వర్తిస్తుంది. ‘నేనింతే.. ఇలాగే ఉంటాను. నాకిష్టమైన పద్ధతిలోనే చదువుతాను’ అని భీష్మించుకుని కూర్చుంటే కుదరదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాలి. నిపుణుల సలహాలు, సూచనలతో చదివే విధానంలోనూ అవసరమైన మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. కొత్త పద్ధతులను అనుసరించడం వల్ల మరింత సులువుగా లక్ష్యాన్ని సాధించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎప్పటి మాదిరిగానే మూసధోరణిలో వెళ్లకుండా మార్పును స్వాగతించాలి. చదవడం, చదివినదాన్ని చూడకుండా రాయడమే కాకుండా.. ఆన్‌లైన్‌లో పరీక్షలు రాస్తుండాలి. దీంతో నిర్ణీత సమయంలో ఎన్ని కరెక్టుగా రాయగలిగారనేది తెలుస్తుంది. నిన్నటికంటే ఈరోజు మెరుగయ్యారంటే మార్పును అందిపుచ్చుకున్నట్లేగా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని