నేర్చుకుంటూ సంపాదించు!

‘ట్యూషన్‌ ఫీజు కట్టడం ఇబ్బంది అవుతోంది. చదువు మానేద్దాం అనుకొంటున్నా’ ‘పీజీ చదువుతూ కూడా అమ్మానాన్నల్ని డబ్బు అడగడం సిగ్గుగా ఉంది’ ‘మా నాన్నగారు చనిపోయారు. మా  కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఇక చదువు కొనసాగించలేనేమో!’

Updated : 25 Apr 2023 05:04 IST

విద్యాసంస్థల్లో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల సద్వినియోగానికి సూచనలు  

‘ట్యూషన్‌ ఫీజు కట్టడం ఇబ్బంది అవుతోంది. చదువు మానేద్దాం అనుకొంటున్నా’

‘పీజీ చదువుతూ కూడా అమ్మానాన్నల్ని డబ్బు అడగడం సిగ్గుగా ఉంది’

‘మా నాన్నగారు చనిపోయారు. మా  కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఇక చదువు కొనసాగించలేనేమో!’

‘నాకు డిగ్రీ అయితే వచ్చింది. వృత్తి నైపుణ్యాలు లేవని ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు’

‘పీజీ కోర్సులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ లేదు. కాలేజీ వాళ్ళే ఏదైనా పని ఇచ్చి ట్యూషన్‌ ఫీజు మాఫీ చేస్తే బాగుండు’

ఇవీ ఉన్నత విద్యాసంస్థల్లో తరచుగా వినే మాటలు! త్వరలో ఈ సమస్యలకు పరిష్కారం లభించే ఆశలు చిగురిస్తున్నాయి.

విదేశాల్లో చదువుతున్న చాలామంది భారతీయ విద్యార్థులు యూనివర్సిటీల్లో/ కాలేజీల్లో చదువుతూనే, అదే విద్యాసంస్థల్లో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తుంటారు. నెలవారీ ఖర్చులకు వారే సంపాదించుకుంటూ కుటుంబంపై ఆర్థిక భారం తగ్గిస్తుంటారు. ఇలాంటి సౌలభ్యం మనదేశంలో కూడా ఉంటే బాగుంటుందని చాలామంది విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ చాలాకాలంగా కోరుకొంటున్నారు.

ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇదే విషయంపై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘నేర్చుకుంటూనే సంపాదించండి’ (ఎర్న్‌ వైల్‌ లెర్న్‌) అనే ఈ పథకం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కొన్ని వేల కుటుంబాలకు  ప్రయోజనకారి అవుతుంది.  

దేశంలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నవారికి వృత్తి నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయని చాలాకాలంగా విమర్శలు వింటున్నాం. యూజీసీ ప్రతిపాదనతో ముందుకొచ్చిన ఈ ప్రయోగం ఆ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువుతూ, పనిచేస్తూ సంపాదించడం వల్ల విద్యార్ధుల్లో నైపుణ్యాలు, సామర్ధ్యం మెరుగుపడతాయి. అంతే కాదు- వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ ‘ఎర్న్‌ వైల్‌ లెర్న్‌’ పథకం పూర్తి స్థాయిలో అమలయితే విద్యా నాణ్యతతోపాటు విద్యార్థుల వ్యక్తిత్వం, సాంకేతిక నైపుణ్యాలు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి.

ఈ పథకంలో ఉన్న మరో అవకాశం ఏంటంటే- విద్యార్థులు వృత్తిపరమైన అసైన్‌మెంట్‌లు కూడా చేయవచ్చు. కొంతమంది విద్యార్థులకు పరిశోధనపై ఆసక్తి ఉంటే పరిశోధనా ప్రాజెక్టుల్లో సహాయకులుగా చేరి, పరిశోధనలో మెలకువలు కూడా పెంపొందించుకోవచ్చు. ఇటీవలికాలంలో విద్యాసంస్థల సేవల నాణ్యతపై చాలామంది విద్యార్థులు/ తల్లిదండ్రులు అసంతృప్తితో ఉంటున్నారు. అందుకు ముఖ్య కారణం- విద్యాసంస్థల్లో బోధనేతర సిబ్బంది తక్కువగా ఉండటం, ఉన్న కొంతమందికీ సాంకేతిక నైపుణ్యాలు కొరవడటం. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలయితే విద్యార్థులతో పాటు బోధనేతర సిబ్బంది నైపుణ్యాలు కూడా మెరుగవుతాయి.

ఈ నూతన పథకంలో విద్యార్ధులకు అసిస్టెంట్‌షిప్‌, లైబ్రరీ అసైన్‌మెంట్‌లు, కంప్యూటర్‌ సేవలు, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్‌, పరిశోధనా ప్రాజెక్టులో సహాయకులుగా వివిధ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ పథకం విజయవంతం అవ్వాలంటే విద్యా నాణ్యత, విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఈ పథకానికి వాటాదారుల ఆర్థిక సహకారం కూడా చాలా అవసరం.

విజయవంతం కావాలంటే...

ఈ పథకం విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను ఉన్నత విద్యాసంస్థలు వివిధ ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల నుంచి సమకూర్చే ప్రయత్నం చేయాలి. ఈ పథకంలో పాల్గొన్న విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థలు సర్టిఫికెట్‌లను జారీ చేయడం వల్ల వారి విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. చివరిగా... ఈ పథకం ఫలాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఆర్థిక వనరులు, పారదర్శకత, క్రమశిక్షణ, జవాబుదారీతనం అవసరం.

ఈ విధానం విదేశాల్లో చాలాకాలం నుంచి అమల్లో ఉంది. మన దేశంలో ఐఐఎస్‌సీ బెంగళూరులో, చాలా ఐఐటీల్లో, కొన్ని ఎన్‌ఐటీల్లో, బిట్స్‌లో అందుబాటులో ఉంది. చాలాకాలం క్రితం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ కూడా ‘యూనివర్సిటీస్‌ విత్‌ పొటెన్షియల్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ స్కీమ్‌’ కింద ఎర్న్‌ వైల్‌ లెర్న్‌ పథకాన్ని అమలు చేసింది. ఇది కొద్దికాలమే కొనసాగింది.

ఈ పథకం సరిగ్గా అమలు అవ్వాలంటే విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన, సహకారం,   క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. చాలా సందర్భాల్లో విద్యార్థులు తాము చేసే పనిపై మనసు పెట్టకుండా తప్పులు చేయడం, సరైన సమయానికి పనికి రాకపోవడం, కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం లేకపోవడం, ఈ పథకాన్ని డబ్బు సంపాదించే అవకాశంగా మాత్రమే చూడటం వల్ల ఈ పథకం ఆశించిన ఫలితాలను పొందలేకపోవటం కొన్ని విద్యా సంస్థల అనుభవం. ఈ లోపాలను సరిచేసుకుంటే ఈ పథకం అన్నిరకాలుగా విజయవంతమై విద్యార్థులకు అద్భుత ఫలితాలను అందిస్తుంది!  


‘ఎర్న్‌ వైల్‌ లెర్న్‌’ పథకం విద్యార్థులకు వారి కెరియర్‌ అన్వేషణ, వృత్తిపరమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించగలదు.


నూతన పథకం ప్రయోజనాలు

1  ఉపాధి నైపుణ్యాలు, కెరియర్‌ సంసిద్ధతలు పెరుగుతాయి.

2  విద్యాసంస్థల్లో డ్రాప్‌ అవుట్‌ రేటును తగ్గించడంలో సహాయపడుతుంది.

3  విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

4  విద్యార్థి కెరియర్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.

5  విద్యార్థులు డబ్బు సంపాదిస్తూ, పని అనుభవాన్ని పొందుతూ చదువుతున్నప్పుడు ప్రయోగాత్మక శిక్షణ పొందే అవకాశమూ ఉంది.

6  పని అనుభవం కారణంగా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు మెరుగవుతాయి.

7  భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందడానికి వివిధ కెరియర్‌ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.

8  విద్యా సంస్థలకూ, విద్యార్థులకూ  నెట్‌వర్కింగ్‌ అవకాశాలు పెరుగుతాయి.

9  విద్యార్థులు అవసరమైన సామర్థ్యం, సానుకూల దృక్పథం పొందగలుగుతారు.

10  విద్యార్థుల బయోడేటాకి విలువ పెరుగుతుంది.

* ఉన్నత విద్యా సంస్థలు ఈ పథకంలో నమోదు చేసుకున్న విద్యార్థులకు వివిధ పార్ట్‌-టైమ్‌ ఉద్యోగావకాశాలను అందిస్తాయి.

* వివిధ విద్యా విభాగాల హెడ్‌/ డైరెక్టర్‌/ కోఆర్డినేటర్‌లు ఈ పథకానికి అర్హులైన విద్యార్థుల సమాచారాన్ని సేకరించి, వారందరికీ ఈ పథకంలో భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేస్తారు.

* ఈ పథకంలో ప్రతి విద్యార్థికీ వేతనం గంటకు చొప్పున ఏకీకృత మొత్తంగా ఉంటుంది.

* ఈ అవకాశం గరిష్ఠంగా వారానికి 20 గంటలు, నెలకు 20 రోజులపాటు తరగతి గంటల తర్వాత అందుబాటులో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని