ఫీడ్‌బ్యాక్... తీసుకుంటున్నారా?
రమ్య ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఒకపక్క పరీక్షలకు సిద్ధం అవుతూనే మరోపక్క క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ప్రతి ముఖాముఖికి హాజరయ్యే ముందు తన మెంటర్‌తో కచ్చితంగా మాట్లాడుతోంది.
రమ్య ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఒకపక్క పరీక్షలకు సిద్ధం అవుతూనే మరోపక్క క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ప్రతి ముఖాముఖికి హాజరయ్యే ముందు తన మెంటర్‌తో కచ్చితంగా మాట్లాడుతోంది. తానెక్కడ బలంగా ఉందో, ఏ అంశాల్లో బలహీనంగా ఉందో తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ ఇంటర్వ్యూల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇస్తోంది.
చివరికి నచ్చిన కంపెనీలో చక్కటి ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. తానిలా ఒక్కోమెట్టు పైకెక్కుతూ లక్ష్యం చేరుకోవడానికి తోడ్పడిందేంటో తెలుసా... తన మెంటర్స్ ఎప్పటికప్పుడు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్! మరి మీరూ తీసుకుంటున్నారా?
మనకెన్నో లక్ష్యాలు ఉంటాయి. వాటిని అందుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. చదువులోనూ ఉద్యోగంలోనూ ముందుండాలని... జీవితంలో కలలుగన్న స్థాయికి చేరాలని ఆశపడుతూ నిరంతరం శ్రమిస్తుంటాం. కానీ ఆ దిశగా వేసే అడుగుల్లో కొన్ని తడబడితే.. ఆ పొరపాట్లను సరిదిద్దడానికి, సరైన దారిలో మనల్ని నడిపించడానికి.. ఓ మంచి ఫీడ్‌బ్యాక్ అవసరం అవుతుంది. నిజానికి మనల్ని మనం తెలుసుకోవడంలో ఇదెంతో ఉపయోగపడుతుంది.
ఏది ఉత్తమం
మంచి ఫీడ్‌బ్యాక్ మనం చేసిన తప్పులను ఎత్తిచూపదు. జరిగిన పొరపాట్లను గుర్తించి, వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో చెబుతుంది. ఇది మనల్ని మరింత ప్రొడక్టివ్‌గా మారేలా సహకరిస్తుంది. దీని కోసం నిపుణులు ‘ఫీడ్‌బ్యాక్ శాండ్‌విచ్’ అనే పద్ధతిని కూడా కనిపెట్టారు. కాంప్లిమెంట్, కరెక్ట్, కాంప్లిమెంట్ అనేది ఈ సిద్ధాంతం. ముందు చేస్తున్న పనిని అభినందించి, తర్వాత జరుగుతున్న తప్పులను ఎలా సరిచేయాలో చెప్పి, అనంతరం తిరిగి అభినందించడమే ఈ పద్ధతి ఉద్దేశం.
* ఈ విధానంలో వచ్చిన అభిప్రాయాలను ఉత్తమమైనవిగా గమనించవచ్చు. ఫీడ్‌బ్యాక్ మనం ఊహించిన దానికంటే ప్రభావవంతమైన లెర్నింగ్ టూల్. దీంతో ఆత్మవిశ్వాసం, మనమేంటో మనకు తెలుసనే ధీమా, నేర్చుకోవాలనే ఉత్సాహం... ఇవన్నీ అధికమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. అకడమిక్స్, ఇంటర్న్‌షిప్స్, జాబ్స్.. ఇలా ఎక్కడైనా ఇది చాలా సానుకూల ప్రభావం చూపగలదు.
ఇచ్చేవారు...
మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు కూడా చాలా ముఖ్యం కదా! మన గురించి పూర్తిగా తెలిసినవారు, బలాలు - బలహీనతలను అంచనా వేయగలిగేవారు, ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా కేవలం ఆ సంభాషణ లేదా సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు. అన్నింటికీ మించి మనం నమ్మదగిన వారి అభిప్రాయాలను మాత్రమే పూర్తిస్థాయిలో పరిగణించడం మంచిది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, అధ్యాపకులు.. కొన్నిసార్లు స్నేహితులు.. ఇలా చాలా కొద్దిమంది వద్ద నుంచి మాత్రమే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి.
అంగీకరించాలి..
ఎవరైనా సరే... తమ అభిప్రాయాలు, చర్యలు సరైవనే అనుకుంటారు, ప్రభావవంతంగా పని చేస్తున్నామనే నమ్ముతారు. అలా కాదని... ఇలా చేస్తే ఇంకా బాగా ఉంటుందని చెబితే ఒప్పుకోవడానికి ఒకపట్టాన మనసు అంగీకరించదు. అది అత్యంత సహజం. కానీ ఆ భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత వేగంగా విషయాలను నేర్చుకోగలుగుతాం. అలా అని ఎవరేం చెప్పినా మనల్ని మనమే తప్పు పట్టుకుని ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. కానీ సరైన సమయంలో, సరైన వ్యక్తి చెప్పే మాటల గురించి మాత్రం కచ్చితంగా మనసుతో ఆలోచించాల్సిందే!
సమయానుకూలంగా...
అభిప్రాయాలు తీసుకోవడమే కాదు... సమయానికి తగినట్టుగా తీసుకోవడం కూడా ప్రధానం. కొన్నిసార్లు గడువులోపల ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దానికి శ్రేయోభిలాషుల అభిప్రాయం కావాల్సి వస్తుంది. అప్పుడు ఆలోగానే తెలుసుకోవాలి. అన్నికోణాల్లోనూ ఆలోచించాక.. నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. అంతేకాదు, చాలాసార్లు అలా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. సమయపాలన ఇక్కడ కూడా అవసరమే!
సానుకూల ఆలోచనలు..
మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో ఎదుటివారు చెబుతున్నప్పుడు ఎంతోకొంత ఇబ్బంది, నిరాశ కలగకమానవు. కానీ ఫీడ్‌బ్యాక్ ప్రధాన ఉద్దేశం విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం కాదు.. మరింత సానుకూల దృక్పథంతో, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగడం. అందుకే దీన్ని ఎంత పాజిటివ్‌గా తీసుకుంటే అంత మంచిది.
గ్రోత్ మైండ్‌సెట్
మనస్తత్వాలు అనేక రకాలు. అందులో విద్యార్థులు అలవరుచుకోవడానికి ప్రయత్నించాల్సింది ‘గ్రోత్ మైండ్‌సెట్’ అంటారు శాస్త్రవేత్తలు. ఈ విధమైన ఆలోచనాధోరణిలో విద్యార్థులు ఫీడ్‌బ్యాక్‌ను వేగంగా ఆకళింపు చేసుకుని తమదైన శైలిలో రాణించగలరు. దీన్ని పాటించాలంటే అలవరుచుకోవాల్సిన ముఖ్య లక్షణాలు...
* శ్రమ, సాధనలతో మరింత బాగా నేర్చుకోగలమని నమ్మడం.
* ఎదురయ్యే ఇబ్బందులను అవకాశాలుగా భావించి కృషితో విజయం సాధించడం.
* ఇతరుల నుంచి ఇష్టంగా, సులభంగా నేర్చుకోవడం.
నిరంతర సాధన
విద్య, ఉద్యోగం, ఏదైనా సరే... నిరంతర సాధనతోనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం. కష్టపడటం, లోటుపాట్లు గుర్తించడం, వాటిని సరిచేసుకోవడం.. మెరుగైన దిశగా అడుగులు వేయడం.. ఇదే లక్ష్యం. ఇందుకు ఫీడ్‌బ్యాక్‌ను సరిగ్గా వాడుకోవాలి.
భావోద్వేగాల నియంత్రణ
ఫీడ్‌బ్యాక్ ఎలా వచ్చినా.. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ‘బాగా చేశావు’ అన్నప్పుడు పొంగిపోవడం, ‘బాగా లేదు’ అన్నప్పుడు కుంగిపోవడం.. రెండూ సరికాదు. ఎలాంటి సందర్భంలోనైనా స్థిరంగా ఉండటం అవసరం. ఇంకా సూటిగా చెప్పాలంటే ఎమోషనల్‌గా కంటే ఆబ్జెక్టివ్‌గా ఉండటానికే ప్రయత్నించాలి.
* అలాగే ఫీడ్‌బ్యాక్ ఒక సందర్భం, సంఘటన, విషయానికి సంబంధించినది మాత్రమే. దాన్ని అంతవరకే చూడాలి. మొత్తం మన ప్రతిభనూ, సామర్థ్యాన్నీ అంచనా వేసేదిగా భావించకూడదు. ముఖ్యంగా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్స్ విషయంలో ఈ సూత్రాన్ని కచ్చితంగా పాటించాలి.
* మంచి, చెడు అంశాలూ రెండూ ఉన్నప్పుడు చెడువాటిని మాత్రమే గుర్తుంచుకోవడం, మంచి వాటిని విస్మరించడం చేయకూడదు. రెంటినీ సమప్రాధాన్యంతో స్వీకరించాలి.
ఫీడ్‌బ్యాక్ అంటే కేవలం మనం చేసింది తప్పా ఒప్పా అని చెప్పే మాట మాత్రమే కాదు.. గతం నుంచి భవిష్యత్తులోకి అభివృద్ధి దిశగా నడపగలిగే ఓ గొప్ప సాధనం!
నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు కొత్త అవకాశాలకు దారితీయగలవు. లక్ష్యసాధనలో తీసుకోవాల్సిన చర్యలను సూచించగలవు.
ఇలాంటి ఫీడ్‌బ్యాక్ మనల్ని ప్రేరేపిస్తుంది. ఇంకా బాగా కష్టపడాలనే తాపత్రయం కలిగిస్తుంది. మంచి కాంటాక్ట్స్ ఉండేలా చేస్తుంది.
* ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించుకున్నప్పుడు మనసుతో కంటే మెదడుతో ఆలోచించడమే ప్రధానం. ఎందుకంటే మనపట్ల మనకు ఎంత సంతృప్తి ఉన్నా, ‘నేనే కరెక్ట్’ అని అనుకోకుండా ఉన్నప్పుడే ఎక్కువ నేర్చుకోగలుగుతాం.
ఫీడ్‌బ్యాక్ తీసుకునే ప్రతి విద్యార్థీ కచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు..
1. నా లక్ష్యం ఏంటి?
2. ఆ దిశగా నా ప్రయత్నం ఏంటి?
3. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా లేదా..?
4. నేను బాగా చేస్తున్నది ఏంటి?
5. చేయలేకపోతున్నది ఏంటి?
6. ఎలా మెరుగుపరుచుకోవాలి?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!