పరీక్షను అర్ధం చేసుకుంటే..దాదాపు గెలిచినట్టే!
మొదట్లో సివిల్స్ పరీక్షల తీరును సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఎలాంటి సిలబస్ ఇస్తారో తెలుసుకోలేకపోయా. ఎలా చదవాలో, ఎలా రాయాలో సరిగా తెలియక పరీక్ష సక్రమంగా రాయలేకపోయాను
వైఫల్యాలు ఎదురైనపుడు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకుంటేనే పురోగతి సాధ్యం! జాతీయ స్థాయిలో జరిగే అత్యున్నత పరీక్షలు రాసే అభ్యర్థులు తాము చేసిన లోపాలు గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం తప్పనిసరి. తాజా సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.. తెలంగాణ విద్యార్థిని నూకల ఉమా హారతి! మూస పంథాలో సాగకుండా స్వీయ పరిశీలన చేసుకుని, చొరవతో లోపాలు సరిదిద్దుకుంది. ఐదో ప్రయత్నంలో గెలుపు బావుటా ఎగురవేసింది. విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన తన విజయ ప్రస్థానం గురించి ఆమెతో ‘చదువు’ముఖాముఖీ..
గతంలో చేసిన పొరపాట్లు ఏమిటి? వాటినెలా అధిగమించారు?
* మొదట్లో సివిల్స్ పరీక్షల తీరును సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఎలాంటి సిలబస్ ఇస్తారో తెలుసుకోలేకపోయా. ఎలా చదవాలో, ఎలా రాయాలో సరిగా తెలియక పరీక్ష సక్రమంగా రాయలేకపోయాను. చిన్నచిన్న పొరపాట్లతో తగిన ర్యాంకు సాధించలేకపోయాను. నేర్చుకున్నదాన్ని పరీక్షలో రాయటంపైనే గతంలో దృష్టి ఉండేది కానీ మార్కుల కోణంలో ఆలోచించేదాన్ని కాదు. అలాగే రాసే విధానమూ అంత మెరుగ్గా ఉండేది కాదు. గతంలో జరిగిన ఇంటర్వ్యూలో బోర్డు అడిగిన ప్రశ్నలకు వరసగా సమాధానాలు చెప్పుకుంటూ పోయాను. ఈసారి మాత్రం ఎక్కువ మార్కులు సాధించాలన్న లక్ష్యంతో చదివాను. జవాబులు రాసే విధానం, ఇంటర్వ్యూలో సమాధానాల ప్రజెంటేషన్ మెరుగుపర్చుకున్నాను. వారంలో రెండు ప్రాక్టీస్ టెస్టులు రాసి మిత్రులకు పంపించి పొరపాట్లను సరిదిద్దుకునేదాన్ని. సివిల్స్ పరీక్షపై నా ఆలోచన, దృక్పథం మార్చుకోవడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది.
సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఎప్పుడు ఏర్పరచుకున్నారు?
* ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తయ్యాక 2017లో సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నా
ఇందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?
* నాన్న వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీ. ఆయన కోరిక మేరకు ఐఏఎస్ కావాలని లక్ష్యంగా ముందుకుసాగాను. సివిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడానికి నాన్నే బలమైన కారణం. తమ్ముడు సాయివికాస్ 2020లో యూపీఎస్సీ ఐఈఎస్‌లో 12వ ర్యాంకు సాధించి ముంబయిలోని సీపీడబ్ల్యూడీలో ఉద్యోగంలో చేరాడు. నా పొరపాట్లు సరిదిద్దుకుని, ఇప్పుడు మూడో ర్యాంకు రావటానికి నాన్న, తమ్ముడి సహకారం మరువలేనిది.
ఏ విధంగా సన్నద్ధమయ్యారు?
* సివిల్స్ సిలబస్‌పై, ప్రశ్నపత్రాలు ఇస్తున్న విధానంపై సంపూర్ణంగా అవగాహన పెంచుకున్నా. ఇంటర్నెట్లో అవసరమైన సమాచారం సేకరించి ప్రణాళికబద్ధ్దంగా సన్నద్ధమయ్యా. రోజుకు 8 గంటలు చదివాను. పరీక్ష అలవోకగా రాసేందుకు ఎంతో సాధన చేశా.
ఆప్షనల్ సబ్జెక్టు ఏమిటి, దాన్ని తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
* ఆంత్రొపాలజీ నా ఆప్షనల్ సబ్జెక్టు. ఇదివరకు జాగ్రఫీ తీసుకున్నా. కానీ అందులో ఎక్కువ మార్కులు రాలేదు. దీంతో- రిస్క్ అని అందరూ హెచ్చరించినా సరే, ఆంత్రొపాలజీకి మారి ప్రిపేరయ్యాను.
పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఎలా జరిగింది?
* టెక్నికల్ ప్రశ్నలతోపాటు.. అంతర్జాతీయ సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం, బ్రిక్స్, నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్, ట్రైబల్ డెవలప్‌మెంట్, ఆంత్రొపాలజీ.. అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. నా ప్రొఫైల్‌ను బేస్ చేసుకుని వీటి నుంచే ప్రశ్నలు అడిగారు.
* ఐదేళ్ల నుంచి ఏం చేస్తున్నావని అడిగారు. ‘నేను మిస్టేక్స్ చేస్తూ వాటి నుంచి నేర్చుకుంటున్నా’నని (నవ్వుతూ) చెప్పాను.
* ఉక్రెయిన్ సమస్య గురించి నిర్దిష్టంగా అడిగారు. ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది కదా.. ఆ వారెంట్ వల్ల ఇప్పుడు ఏమవుతుంది’ అని అడిగారు. రష్యా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబరు కాదు కాబట్టి పెద్దగా ప్రభావం ఉండదు. కానీ...దౌత్యపరంగా కొద్దిగా ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంటుందని చెప్పాను.
* ‘ట్రైబల్స్ అసలు డెవలప్ అవుతున్నారా?’ అని అడిగారు. డెవలప్ అవుతున్న కొన్ని గిరిజన జాతుల గురించి చెప్పి.. కానీ అభివృద్ధి చెందడానికి ఇంకా చాలా ఉందని చెప్పాను.
సివిల్స్ సన్నద్ధతలో ఉపయోగపడే పుస్తకాలు, రిసోర్సెస్, టిప్స్...
* సివిల్స్‌కు సన్నద్ధం కావడానికి ఆన్‌లైన్‌లో పుస్తకాలన్నీ ఉచితంగా లభిస్తాయి. దేశ, అంతర్జాతీయ అంశాలు, సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి. వార్తాపత్రికలు చదవడం, ముఖ్య అంశాలను నోట్ చేసుకోవడం మంచిది. ఏదైనా సమాచారం అవసరమనుకుంటే ఇంటర్నెట్లో సెర్చ్‌చేయాలి. అవసరమైన అంశాలను ప్రింట్ తీసుకుని సన్నద్ధం కావాలి. ముఖ్యంగా ప్రాక్టీస్ టెస్టు చాలా ముఖ్యం. మనం రాసిన వాటిలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఇదెంతో ఉపయోగపడుతుంది.
శిక్షణ ఎంతవరకు ఉపయోగపడుతుంది?
* దిల్లీలో ఏడాది పాటు శిక్షణ పొందాను. కొంతవరకు ఈ శిక్షణ ఉపయోగపడినా అక్కడ ఉండటం ఇష్టంలేక ఇంటి పట్టునే ఉంటూ సన్నద్ధమయ్యా.
సివిల్స్ లక్ష్యం ఉన్నవారు ఎలాంటి లక్షణాలు ఏర్పరచుకోవాలి?
* అభ్యర్థులు ప్రతి దశలోనూ పరీక్షను అర్థం చేసుకోవాలి. పరీక్షను అర్ధం చేసుకుంటే దాదాపు విజయం సాధించినట్లే. పాత ప్రశ్నపత్రాలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అందుకు శిక్షణ ఒక్కటే కాదు.. ఇంటర్నెట్లో అవసరమైన సమాచారం సేకరించాలి. రాసే విధానంపై సాధన చాలా ముఖ్యం. మనం రాసిన ప్రాక్టీస్ టెస్టు పత్రాలను సీనియర్‌లకు పంపించి తప్పిదాలను తెలుసుకుని వాటిని పునరావృతం కానీయకూడదు.
ఒత్తిడిని అధిగమించడానికి మీరు ఏం చేసేవారు?
* నాలుగుసార్లు విఫలమయ్యా కదా? దీంతో ఒత్తిడిని అధిగమించడానికి బ్యాడ్మింటన్ ఆడాను. యోగా సాధన చేయడంతోపాటు అప్పుడప్పుడూ సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, రన్నింగ్, వంటలు వండటం లాంటివి చేశాను. వీటన్నిటితో కొంత వరకు ఒత్తిడిని తగ్గించుకోగలిగాను.
సివిల్స్ ఆశావహులకు మీ సూచనలు?
* యువత తమకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. సివిల్స్ ఎంచుకున్నవారు నిరంతర సాధన చేయాలి. పరీక్షకు చాలా పకడ్బందీగా సన్నద్ధం కావాలి. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి? వాటికి జవాబు ఎలా రాయాలో అవగాహన పెంచుకోవాలి. పరీక్షను అర్థం చేసుకోవాలి. గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఏది, ఎంత చదవాలో అంతే చదవడం మంచిది. బాగా కష్టపడాలి. పరీక్షలో ఫెయిల్ అయినా నిరాశ చెందవద్దు.
ప్రతి రంగంలోనూ విజయం సాధించిన ప్రతి ఒక్కరి నుంచీ ఏదో ఒక విషయంలో స్ఫూర్తి పొందవచ్చు. ఒకటి రెండుసార్లు విఫలమైనప్పటికీ ఆందోళన పడకూడదు. ఇది వరకు సివిల్స్ సాధించినవారి సహకారం తీసుకుని తప్పులు జరుగకుండా జాగ్రత్తపడాలి. ఆప్షనల్ సబ్జెక్టుల ఎంపికలోనూ జాగ్రత్త తీసుకోవాలి. లేకుంటే అనుకున్నన్ని మార్కులు సాధించలేకపోవచ్చు. ప్రతిరోజు చదవడం, ప్రాక్టీసు చేయడం మంచిది. రోజూ పది గంటలు చదువుకు కేటాయించాలి. వారానికోసారి చదివిన అంశాలను ప్రాక్టీస్ టెస్టు రాయడం అలవాటుచేసుకోవాలి. పరీక్షలో ఎన్నిసార్లు విఫలమైనా ఫెయిల్యూర్‌గా భావించకూడదు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పొందడం చాలా ముఖ్యం.
వి.నరేందర్, న్యూస్‌టుడే, నారాయణపేట
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
దిగంబరత, అశ్లీలత ఒకటి కాదు: హైకోర్టు
-
Crime News
హైటెక్ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె..!
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి