ఎంచుకునే ముందు ఆలోచించారా?

శ్వేత పదోతరగతి చదివింది. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకోవాలనే విషయంలో ఇంట్లో ఒకటే చర్చ. పదిలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి సైన్స్‌/ మ్యాథ్స్‌ గ్రూప్‌ తీసుకోవాలని, అలా అయితే కెరియర్‌ బాగుంటుందని ఇంట్లో వాళ్లు.

Updated : 25 Jul 2023 02:53 IST

కెరియర్‌ ఎంపికలో కౌన్సెలింగ్‌ ప్రాముఖ్యం

శ్వేత పదోతరగతి చదివింది. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకోవాలనే విషయంలో ఇంట్లో ఒకటే చర్చ. పదిలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి సైన్స్‌/ మ్యాథ్స్‌ గ్రూప్‌ తీసుకోవాలని, అలా అయితే కెరియర్‌ బాగుంటుందని ఇంట్లో వాళ్లు. తనకేమో వాటిపై అంతగా ఆసక్తి లేదనీ, చరిత్ర సబ్జెక్టు ఇష్టమనీ, అదే చదువుతానని శ్వేత.. ఎవరి ఆలోచన సరైనదో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఎటూ పాలుపోని సందిగ్ధం. జీవితాన్ని నిర్దేశించే ఇంతటి ముఖ్య విషయాలు నిర్ణయించుకునేటప్పుడు ప్రొఫెషనల్‌ సహాయం ఉండటం ఉపకరిస్తుంది. ఇదే కాదు.. ఇటువంటి చాలా సమస్యలకు నిపుణులైన కెరియర్‌ కౌన్సెలర్‌లు సరైన విధంగా దారి చూపగలుగుతారు.

ఒక విద్యార్థి ఏం చదవాలి, పెద్దయ్యాక ఏం చేయాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. చాలామంది తల్లిదండ్రులు ఈ అంశమై కంగారు పడుతూ ఉంటారు. ఇందులో విద్యార్థితోపాటు తల్లిదండ్రులు, టీచర్లు, ప్రొఫెషనల్‌ కౌన్సెలర్లు కూడా భాగం పంచుకోవాలి. చివరిగా నిర్ణయం మాత్రం విద్యార్థికే వదిలేయాలి. అప్పుడే లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. చాలా తక్కువమంది మాత్రమే అన్నీ ఆలోచించి కోర్సులు ఎంచుకుంటున్నారు. ఉన్నత స్థాయి కుటుంబాల్లో విద్యార్థికి స్వేచ్ఛ దొరుకుతున్నా.. దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో ఈ విధమైన ఆలోచన తక్కువగా ఉంటోంది. చదువంటే కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అనే భావన బలపడిపోయింది. నేర్చుకునే ప్రక్రియ ముఖ్యమనే ఆలోచనే కరవైంది. ఈ కారణంగానే విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎప్పుడంటే..

నేటి కాలం విద్యార్థులు చాలా వేగంగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచే వారేం కావాలనుకుంటున్నారనే విషయమై రకరకాలైన ఆలోచనలు మొదలవుతున్నాయి. అయితే దానికి సరిపోయే విధంగా 10వ తరగతి నుంచే వారికి సరైన గైడెన్స్‌ అవసరం. ఈ వయసులో వారికి తాము ఏం కావాలనే విషయమై వివిధ అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. వయసు పెరిగేకొద్దీ వాటికి స్థిరమైన రూపం వస్తుంది. ఆ వచ్చే ప్రక్రియలో తల్లిదండ్రులు, టీచర్లు వారికి మద్దతుగా నిలవాలి. విద్యార్థి ఆలోచనలను స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. తమ సొంత ఆశలు, ఆశయాలను వారిపై రుద్దకుండా తమ జీవితం వేరు, తమ పిల్లల చదువు - కెరియర్‌ వేరనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి, విద్యార్థి తాను అనుకున్నది సాధించగలుగుతాడు.

పరుగు కాదు ఇప్పుడు చదువంటే మార్కెట్‌ వెనుక పరుగెత్తే సరుకుగా మారిపోయింది. అధికశాతం మంది డిమాండ్‌ ఉంటుందనే ఉద్దేశంతో సైన్స్‌/మ్యాథ్స్‌ గ్రూపులు, అందునా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కువ మంది విషయంలో చదువుకున్నదానికీ, చేస్తోన్న ఉద్యోగానికీ సంబంధం ఉండటం లేదు. తల్లిదండ్రులు  సావధానంగా ఆలోచిస్తే, ఇలా గంపగుత్తగా విద్యార్థులంతా ఒకే విధమైన చదువులు చదవడం, ఉద్యోగాలు చేయడం భవిష్యత్తులో ఎంత ప్రమాదకరమో అర్థం అవుతుంది. ఓ పదేళ్ల తర్వాత ఏదైనా జరగరానిది జరిగి ఆ రంగం అభివృద్ధి తిరగబడితే ఒక్కసారిగా విద్యార్థుల జీవితాలన్నీ కుదేలవుతాయి. అన్ని రంగాలూ, అన్ని రకాలైన ఉద్యోగాలూ ఉంటేనే కుటుంబాలకే కాదు దేశానికి కూడా మంచిది. ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు మాత్రమే చదువు పరమార్థం కాకూడదు. ఏ విధమైన ఆదాయంతోనైనా దాని స్థాయికి తగినట్టుగా సౌకర్యంగా బతకొచ్చు, కానీ వృత్తిలో సంతృప్తి లేకపోతే జీవితాంతం నచ్చని పనిచేస్తూ బతకాలి. అదంత సులభం కాదు.

సర్కారీ ఉద్యోగాలు

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడాలని కోరుకుంటున్నారు.. విద్యార్థికి ఆసక్తి ఉంటే ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేటు ఉద్యోగమైనా పెద్దగా తేడా లేదన్న విషయాన్ని గుర్తించాలి. పింఛను సౌకర్యం తీసివేశాక అంతగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు. ప్రైవేటులో ఇంకా ఎక్కువ సంపాదన తక్కువ కాలంలోనే ఆర్జించే అవకాశం ఉంది. దీన్ని గుర్తించని చాలామంది విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీలు చేసి కూడా ప్రభుత్వ రంగంలో చిన్న చిన్న ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. దీని వల్ల ఒక్కసారి ఆ చిన్నస్థాయి ఉద్యోగానికి అలవాటుపడితే తర్వాత చదువుకోవడం, కెరియర్‌ను మళ్లీ ఉన్నతస్థాయిలో నడిపించడం కష్టం అవుతుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలి అనుకునేవారు చిన్ననాటి నుంచే దానికి తగిన సబ్జెక్టులు చదువుతూ అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటూ సన్నద్ధం కావాలి.

తల్లిదండ్రులకు..

కొందరు తల్లిదండ్రులు తమకు అంతగా అవగాహన లేకపోయినా చాలా శ్రద్ధ పెట్టి పిల్లల కెరియర్‌ కోసం ఆలోచిస్తూ  ఉంటారు. అది అభినందించదగ్గ విషయం. కానీ వీరి సంఖ్య తక్కువ. చాలామంది ఎక్కువగా పట్టించుకుని అంతా వారే నిర్దేశించేయడం, లేదంటే పూర్తిగా పట్టించుకోకపోవడం చేస్తుంటారు. రెండూ సరి కాదు. పిల్లలకు ఒకపక్క ఆలోచనా స్వేచ్ఛను ఇస్తూనే మరోపక్క సరైన మార్గంలో పయనిస్తున్నారా లేదా అనేది జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సమయం వచ్చినప్పుడు నిపుణులైన కెరియర్‌ కౌన్సెలర్ల సహాయం తీసుకోవాలి.

సమయం కావాలంటే..

కొందరు విద్యార్థులు ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి కొంత సమయం కావాలని భావిస్తారు. అలా తీసుకోవడంలో తప్పు లేదు. అందరూ ఏం అనుకుంటారో అని .. అడిగితే ఏం సమాధానం చెప్పాలో అని.. ఇలాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఏదో ఒక కోర్సులో చేరిపోవాలని బలవంతం చేస్తారు. అది సరైన పద్ధతి కాదు. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో ఒకటి చేసి తర్వాత బాధపడేకంటే.. కొంత విరామం తీసుకుని ఆలోచించుకోవడం మంచిదే కదా? అయితే ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా, లేదా జాగ్రత్తగా పరిశీలించాలి. విదేశాల్లో ఇటువంటి విషయాల్లో పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. సంప్రదాయ కోర్సులకు విభిన్నంగా వారు ఏం చేయాలని భావించినా ప్రోత్సహిస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చదువు, ఆసక్తి ఏదైనా పర్లేదు.. అందులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటే చాలా మెరుగైన అవకాశాలు, పేరు, డబ్బు అందుకోవచ్చు. కేవలం ఇవి చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయంటూ ఏదీ ఉండదు. ఏం చేసినా చివరికి సంతోషంగా ఉండటం ముఖ్యం. ‘మన రంగంలో మెరుగైనవారిలో మనమూ ఒకరం’ అనే స్థాయిలో ఉండగలిగితే అదే అసలైన విజయం!

తీసుకోకపోతే..

సరైన సమయంలో కౌన్సెలింగ్‌ తీసుకోకపోతే విద్యార్థి తానేం చేస్తున్నాడో తనకే తెలియని అయోమయంలో పడతాడు. తోటివారిని అనుసరిస్తాడే తప్ప తనకంటూ సొంత మార్గం, లక్ష్యాలు ఉండవు. దాని వల్ల చివరికి ఏం అవుతాడో ఎటువంటి వృత్తిలోకి వెళతాడో అంచనా ఉండదు. అదృష్టంకొద్దీ  కొందరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా స్థిరపడిపోతూ ఉంటారు. కానీ అందరికీ అలా అవ్వదు కదా! గాలివాటుగా పోతే గమ్యం ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే సరైన ప్రణాళిక, తగిన లక్ష్యసాధన అవసరం.


కౌన్సెలింగ్‌ ఎలా?

వీలైనంత వరకూ కెరియర్‌ కౌన్సెలింగ్‌ను 10వ తరగతి స్థాయి నుంచీ మొదలుపెట్టడం మంచిది. అప్పుడు విద్యార్థి ఏ విధంగా ఎదుగుతున్నాడనే విషయమై అందరికీ అవగాహన ఉంటుంది. విద్యార్థిని పూర్తిగా అంచనా వేసే తన బలాలు, బలహీనతలు, ఆసక్తులు, ఆలోచనలు అన్నీ క్రోడీకరించాలి. ఆఫ్‌లైన్‌లో కౌన్సెలర్లు నేరుగా విద్యార్థిని చూసి, మాట్లాడి, అర్థం చేసుకుని దీన్ని సులభంగా చేయగలుగుతారు. అయితే అందరికీ ఇలా అందుబాటులో దొరకడం సాధ్యం కాదు కాబట్టి ఆన్‌లైన్‌లో నాణ్యమైన ప్రమాణాలు కలిగిన కెరియర్‌ కౌన్సెలింగ్‌ వేదికలను ఆశ్రయించవచ్చు. నేరుగా కౌన్సెలర్లను కలిస్తే వచ్చే ఫలితాలు ఎక్కువ ఆశాజనకంగా ఉంటాయి. వారు విద్యార్థికి ఉన్న అవకాశాలు, వాటి మంచి చెడులు మాత్రమే చెబుతారు. నిర్ణయం మాత్రం విద్యార్థే తీసుకోవాలి. కౌన్సెలింగ్‌ కూడా హేతుబద్ధంగా జరగాలి. ఏ విధమైన కోర్సులకు, సంస్థలకు అనుబంధంగా లేని సొంత సంస్థలు/వ్యక్తుల ద్వారా జరిగితే విద్యార్థికి మంచిది. ఏది ఏమైనా బంగారు భవితకు బాటలు వేయడంలో కౌన్సెలింగ్‌ ప్రాముఖ్యాన్ని  అందరూ గుర్తించాలి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని