తరచూ మూడ్‌ మారుతుంటే..

కొందరు విద్యార్థుల మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు సంతోషానికి బ్రాండ్‌ అంబాసిడర్లలా.. కాసేపట్లోనే విషాదానికి సిసలైన చిరునామాలా కనిపిస్తుంటారు.

Published : 11 Sep 2023 00:12 IST

కొందరు విద్యార్థుల మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు సంతోషానికి బ్రాండ్‌ అంబాసిడర్లలా.. కాసేపట్లోనే విషాదానికి సిసలైన చిరునామాలా కనిపిస్తుంటారు. క్షణ క్షణం మారిపోయే ఇలాంటి వారితో.. సహవిద్యార్థులు స్నేహం చేయడానికీ సంకోచిస్తుంటారు.

రగతిలో రోషన్‌ ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. సంతోషంగా నవ్వుతూ ఉన్నవాడు కాస్తా క్షణాల్లోనే ఆవేశంగా మారిపోతాడు. రేష్మి పరిస్థితీ దాదాపుగా ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశమే హద్దు అన్నట్టుగా పొంగిపోతూ ఉంటుంది. మరికొన్ని సార్లు కుంగిపోతూ కనిపిస్తుంది. ఎప్పుడెలా స్పందిస్తారో తెలియని వారి ప్రవర్తనతో చుట్టుపక్కలవాళ్లు ఎంతో ఇబ్బందిపడుతుంటారు కూడా.
ఇలా ‘మూడ్‌ స్వింగ్స్‌’తో ఇబ్బందిపడేవాళ్లు దూకుడుగా ఉంటారు. వీరి ఆవేశపూరితమైన ప్రవర్తన వల్ల కుటుంబసభ్యులు, సహవిద్యార్థులు, స్నేహితులు ఇబ్బందిపడుతుంటారు. ఎదుటివారి ఆలోచనలు, అభిప్రాయాలకు వీళ్లు ఏమాత్రం విలువనివ్వరు. ఇతరుల స్థానంలో తాముండి ఆలోచించడానికీ ఇష్టపడరు. సరదాగా మాట్లాడుతూనే అకస్మాత్తుగా గొడవలకు దిగుతుంటారు. ఇలా తరచూ మూడ్స్‌ మారిపోవడం వల్ల అనర్థాలెన్నో జరుగుతుంటాయి. స్నేహితుల మధ్యా అపార్థాలూ, ఇతరులతో పోట్లాటలకూ కొదవుండదు.

దీన్నుంచి బయటపడాలంటే...

  • సాధ్యమైనంతవరకూ దీన్నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలోనే ప్రాణ స్నేహితులు, కుటుంబ సభ్యులతో బాధలు, భయాలను పంచుకోవాలి.
  • జీవితంలో దీన్నో భాగంగానే చూడాలిగానీ భూతద్దంలో చూస్తూ భయంకరమైన సమస్యలా ఊహించుకుని బెంబేలెత్తకూడదు.
  • తమ ప్రవర్తను తామే అసహ్యించుకుంటూ ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.
  • ప్రతిచిన్న విషయానికీ స్పందించకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. బాగా కోపం వచ్చినప్పుడు రివర్స్‌లో అంకెలు లెక్కపెట్టడం, దీర్ఘంగా శ్వాస తీసుకుని దాన్ని మెల్లగా బయటకు వదలడం లాంటివి సాధన చేసినా ఫలితం ఉంటుంది.
  • సాధ్యమైనంతవరకూ మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే జరిగినదాన్ని పదేపదే గుర్తుచేసుకోకుండా దృష్టిని ఇతర విషయాల మీదకు మళ్లించాలి. అప్పుడు మనసులో ఆవేశానికి బదులు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
  • మూడ్‌ ఆకస్మాత్తుగా మారిపోవడానికి వెనక ఉన్న అసలు కారణాలను అన్వేషించాలి. ఈ క్రమంలో ఆలోచనలు అటువైపు మరలడం వల్ల వెంటనే కోపం రాదు.
  • మూడ్‌ తరచూ మారిపోవడానికి గల కారణాలను ఎలాంటి దాపరికాలూ లేకుండా స్నేహితులతో పంచుకోగలగాలి. కోపం రావడం వెనుక ఉన్న అసలు కారణాలు విశ్లేషించాలి.
  • చాలా సందర్భాల్లో మన ప్రవర్తన మనకు బాగా నచ్చుతుంది. జరిగిన దాంట్లో అసలు మన తప్పేమీ లేదనే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు జరిగినదాన్ని నిజాయతీగా విశ్లేషించి తప్పును ఎత్తిచూపే స్నేహితుల సలహాలు
  • తీసుకోవాలి.
  • జరిగిన వాటి గురించి స్వార్థంతో కాకుండా.. సహేతుకంగా ఆలోచించడానికి ప్రయత్నించాలి. మీ ఆలోచనా పరిధి విస్తరించే కొద్దీ.. చిన్నచిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మానేస్తారు. అసలు వాటిని లెక్కలోకే    తీసుకోరు.
  • ఇతరుల పట్లా సహానుభూతి ప్రదర్శించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు స్నేహితుడు చేసిన పొరపాటు వల్ల బాగా కోపం వచ్చిందనుకుందాం. అదే పరిస్థితులు మనకు ఎదురైతే ఏం చేస్తామనేది ఒకసారి ఆలోచించాలి. ఇలా ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించడం వల్ల ప్రతి చిన్న విషయానికీ ఆవేశపడటం క్రమంగా తగ్గిపోతుంది.
  • ఎంత గొప్పవాళ్లయినా కూడా కొందరు చిన్నతనంలో కొన్ని ప్రవర్తనాపరమైన లోపాలతో ఇబ్బందిపడే ఉండొచ్చు. వాటిని వాళ్లెలా మార్చుకుని ముందుకు వెళ్లారో ప్రముఖుల జీవిత చరిత్రలు చదివి తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని