ఆన్‌క్యాంపస్‌.. ఆఫ్‌క్యాంపస్‌..ఏ ఇంటర్వ్యూ ఎలా?

కొందరు విద్యార్థులు చదువుతున్న సమయంలో క్యాంపస్‌లోనే ఉద్యోగం సాధించి బయటకు పట్టాతోపాటు ఆఫర్‌ లెటర్‌ కూడా తీసుకుని వెళ్తుంటారు.

Updated : 07 Nov 2023 03:57 IST

కొందరు విద్యార్థులు చదువుతున్న సమయంలో క్యాంపస్‌లోనే ఉద్యోగం సాధించి బయటకు పట్టాతోపాటు ఆఫర్‌ లెటర్‌ కూడా తీసుకుని వెళ్తుంటారు. అందరికీ ఇలా సాధ్యం కాకపోవచ్చు. వీరు ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలను లక్ష్యంగా చేసుకుంటారు. రెండూ వేటికవే ప్రత్యేకం. వీటికి సన్నద్ధమయ్యే సమయంలో దేని పద్ధతి దానికే ఉంటుంది. మరి దేనికెలా ప్రిపేర్‌ అయితే బాగుంటుందో, ప్రధాన వ్యత్యాసాలేమిటో చూద్దామా..

న్‌ క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌.. రెండు పద్ధతుల్లో జరిగే ఇంటర్వ్యూలకు వేటికవే అనుకూలతలూ ప్రతికూలతలూ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని తగిన విధంగా సిద్ధం కావడం ద్వారా అభ్యర్థి అనుకున్న కొలువు దక్కించుకోవచ్చు. చదువు పూర్తవుతూ ఉద్యోగ ముఖాముఖిలు ఎదుర్కోబోయే విద్యార్థులు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెంటికీ మధ్య వ్యత్యాసం, సన్నద్ధం కావాల్సిన విధానాన్ని గమనిస్తే విజయం సాధించడం తేలిక.

  • కాలేజీలే కంపెనీలను ఆహ్వానించే ఆన్‌ క్యాంపస్‌ ఇంటర్య్యూల్లో విద్యార్థులు తమ తోటివారితోనే పోటీ పడతారు. అందువల్ల బయటతో పోలిస్తే పోటీ తక్కువగా ఉంటుంది. అదే విద్యార్థి నేరుగా వెతుక్కుంటూ వెళ్లే ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగాల్లో కంపెనీ స్థాయిని బట్టి, ఉద్యోగాల సంఖ్యను బట్టి, దరఖాస్తు చేసిన అభ్యర్థులను బట్టి పోటీ ఆధారపడి ఉంటుంది. ఏదైనా క్యాంపస్‌లో కంటే బయటే అభ్యర్థి అధిక పోటీని తట్టుకుని నిలబడాల్సి వస్తుంది.
  • అయితే క్యాంపస్‌కి వచ్చే కంపెనీలు సాధారణంగా విద్యార్థులకు తక్కువ ప్రారంభ వేతనాలు ఇస్తూ   ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అత్యున్నత ప్రతిభాపాఠవాలు కలిగిన విద్యార్థులకు లక్షలాది రూపాయల జీతాలు ఆఫర్‌ చేసినా.. వీరి సంఖ్య చాలా తక్కువ. అధిక శాతం తక్కువ స్థాయి వేతనాలతోనే ఉద్యోగాలు ఇస్తుంటాయి. అదే ఆఫ్‌ క్యాంపస్‌ అయితే కాస్త ఎక్కువ జీతాలతో ఉద్యోగాల్లోకి తీసుకునే వీలుంటుంది.
  • విద్యార్థులే నేరుగా వెతుక్కునే ఇంటర్య్వూలకు హాజరయ్యేటప్పుడు మొత్తం అన్నీ వారే చూసుకోవాల్సి వస్తుంది. అయితే క్యాంపస్‌లో అయితే కళాశాల యాజమాన్యమే అన్నీ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. పూర్తిగా ఇంటర్వ్యూపైనే ఏకాగ్రత పెట్టవచ్చు.
  • కంపెనీలు కాలేజీకి రావడం అంటే విద్యార్థులకు అన్ని సంస్థల గురించి తెలిసే అవకాశం, ఇంకా మంచి చాన్సులు అందుకునే వీలు రెండూ ఉండవు. అదే బయట అయితే అన్ని స్థాయుల కంపెనీలపైనా ఫోకస్‌ ఉండి నచ్చిన చోట మెచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేసే వీలుంటుంది.
  • ఆన్‌ క్యాంపస్‌ ఇంటర్య్వూలకు సాధారణంగా సన్నద్ధం కావడం కొంత వరకూ తేలిక. పక్కనే మెలకువలు చెప్పే అధ్యాపకులు ఉండటం, ఎంపిక ప్రక్రియ అంతా తెలిసిందే కావడం.. ఒక ఇంటర్య్వూలో తప్పు చేసినా మరో దానిలో వాటిని సరిచేసుకునే వీలుండటం వల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అయితే ఆఫ్‌ క్యాంపస్‌ ఇంటర్య్వూలు పూర్తిగా అభ్యర్థి వ్యక్తిగత శ్రద్ధ, ప్రణాళిక, సన్నద్ధతా సరళిపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిలో విజయం సాధించడం కొంత కష్టమే.

సన్నద్ధత

బయట ప్రయత్నించేటప్పుడు..

బలాలపై దృష్టి : ఇటువంటి సమయంలో అభ్యర్థి తన బలాలను,   నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శించాలి. కేవలం అవతలి వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాకుండా.. మొత్తంగా తన మెరుగైన ప్రదర్శనను, కంపెనీకి తన అవసరాన్ని చూపించగలిగేలా బలాలపై దృష్టి సారించాలి. పోటీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఉద్యోగానికి సరిపోయేలా పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి.

ప్రశాంతంగా..: అవకాశాల సముద్రంలోకి మనం ఇప్పుడే అడుగుపెట్టాం. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అందువల్ల ప్రతిదీ ఒక అవకాశంగా భావించి ప్రశాంతంగా ముఖాముఖిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. పాజిటివ్‌గా ఉండటం వల్ల మనల్ని మనం మెరుగ్గా చూపించుకునే వీలుంటుంది.

ప్రశ్నలు.. మన గురించి చెప్పడం : కేవలం ఇంటర్వ్యూయర్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాకుండా.. ఏవైనా సందేహాలుంటే ప్రశ్నలు అడగడం, సందర్భాన్ని బట్టి మన గురించి కూడా చెప్పడం వల్ల మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. అది ఉద్యోగం లభించే అవకాశాలను మెరుగుపరుస్తుంది.

క్యాంపస్‌ ఇంటర్వ్యూలో..

  • సాధారణంగా వీటిలో తక్కువ రౌండ్లు ఉండటమే కాకుండా ఫార్మాట్‌ అంతా ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించిన విధంగానే ఉంటుంది. మొదట ఆప్టిట్యూడ్‌ - లాంగ్వేజ్‌ రౌండ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, తర్వాత టెక్నికల్‌, ఆపైన హెచ్‌ఆర్‌.. సాధారణంగా ఈ విధంగా ఉంటుంది. దీనికి తగినట్లుగా విద్యార్థి సన్నద్ధమైతే సరిపోతుంది.
  • ఆన్‌ క్యాంపస్‌లో విజయంపై మంచి మార్కులు మొదట అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. అదే సమయంలో కేవలం పాఠ్య పుస్తకాల అవగాహనే కాకుండా నైపుణ్యాలు కూడా ఉన్నట్లు చూపించుకోగలగాలి. ఈ సమయంలో థియరిటికల్‌గా కంటే ప్రాక్టికల్‌గా కనిపించేందుకు ప్రయత్నించాలి.
  • ఇంటర్వ్యూలకు వచ్చే కంపెనీల గురించి తెలుసుకోవడం, మన ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టులు, సర్టిఫికేషన్స్‌, ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ గురించి చక్కగా తెలియజెప్పడం.. ఉద్యోగం పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నామో వివరించడం.. ఇవన్నీ సాధన చేయడం ద్వారా ఇతరులకంటే ప్రభావవంతంగా కనిపించవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని