Resume: రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా?

అభ్యర్థులకూ ఉద్యోగాలకూ మధ్య వారధి రెజ్యూమె. ఎటువంటి నియామక ప్రక్రియలో అయిన పోటీలో ఉన్న వారంతా తప్పనిసరిగా తమ రెజ్యూమెలతో ఇంటర్వ్యూలకు హాజరవుతారు.

Updated : 15 Nov 2023 08:20 IST

అభ్యర్థులకూ ఉద్యోగాలకూ మధ్య వారధి రెజ్యూమె. ఎటువంటి నియామక ప్రక్రియలో అయిన పోటీలో ఉన్న వారంతా తప్పనిసరిగా తమ రెజ్యూమెలతో ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దాన్ని చూసి కంపెనీలు తొలుత ఒక అభిప్రాయానికి వచ్చి, ఆపైన అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసి తదుపరి నిర్ణయం తీసుకునేవి. అయితే ఇన్నాళ్లూ నియామకాల్లో ఇంతటి ముఖ్యపాత్ర పోషించిన రెజ్యూమెలకు ఇకపై ప్రాధాన్యం తగ్గనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రెజ్యూమెలు(Resume) ఇక పాతమాటగా మారిపోతాయనడానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రధానంగా వివిధ నియామక సంస్థలు వీటిపై ఆధారపడకుండా ఇంకా ఆధునిక పద్ధతుల్లో అభ్యర్థుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ నుంచి సమాచారం సేకరిస్తున్నాయి. దీనివల్ల నియామక ప్రక్రియ మరింత వేగవంతంగా, సమర్థంగా జరుగుతున్నట్లు సంస్థలు భావిస్తున్నాయి.

  • ఇది మాత్రమే కాదు.. కొత్తగా రిక్రూటింగ్‌ ఏజెన్సీలు ‘నో రెజ్యూమె: టాలెంట్‌ సెంట్రిక్‌ రిక్రూట్‌మెంట్‌’ అనే పద్ధతిని అవలంబిస్తున్నాయి. దీని ప్రకారం కంపెనీలు కొత్తకొత్తగా అందుబాటులోకి వస్తున్న వివిధ డిజిటల్‌ వనరులను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. టాప్‌ రిక్రూటర్‌ ఛానెల్స్‌, ఆన్‌లైన్‌ పోర్టల్స్‌, ఎంప్లాయీ రిఫరీలు.. ఇవన్నీ ఇప్పుడు నియామక ప్రక్రియలో భాగమయ్యాయి. 
  • ఈ మార్పునకు ప్రధాన కారణం ఎక్కువమంది అభ్యర్థులు ముందే అందుబాటులో ఉన్న రెజ్యూమె ఫార్మాట్లను వినియోగించడమే అని సంస్థలు చెబుతున్నాయి. ప్రొఫెషనల్‌ రెజ్యూమె రైటర్ల ద్వారా రాయించడం, చాట్‌జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం.. వీటికితోడు 80 శాతం మంది తమ రెజ్యూమెలో ఏదో ఒకచోట అబద్ధం చెబుతున్నారని ఒక సర్వేలో తేలింది. ఇదే పదేళ్ల క్రితం ఇలా చెప్పిన వారి శాతం 65గా ఉండేది.
  • తాజాగా 3 వేల మందికి పైగా రిక్రూటర్లను సర్వే చేస్తే వారు రెజ్యూమేల్లో ఉన్న వివరాలను పూర్తిగా నమ్మబోమని చెప్పారు. నిజానికి ఉద్యోగం ఇచ్చేముందు అభ్యర్థి ప్రవర్తన గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు వారు వివరించారు. కానీ ఆ వివరాలు రెజ్యూమె ద్వారా కేవలం 30 శాతం వరకే తెలిసే అవకాశం ఉండటం వారు మరో ప్రధాన అవరోధంగా భావిస్తున్నారు. అధికశాతం మంది రిక్రూటర్ల సమస్యా పరిష్కారం, నిర్ణయాలు తీసుకునే నేర్పు, నిత్యం నేర్చుకునే ఓర్పు, బృందంతో పనిచేసే మెలకువలు, నాయకత్వ లక్షణాలు ఉన్న అభ్యర్థులను ఎంచుకుంటున్నట్లు వివరించారు. అందువల్ల అభ్యర్థులు కేవలం రెజ్యూమెలపైనే ఆధారపడకుండా ఆన్‌లైన్‌లో తమ పోస్టులు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని