డేటా లిటరసీ.. మీకుందా?

డేటా లిటరసీ.. మరో కొత్త నైపుణ్యం! కెరియర్‌ మొదలుపెట్టే వారు  నేర్చుకోవాల్సిన స్కిల్స్‌లో ఇదీ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సమాచార వ్యవస్థ విపరీతంగా వేళ్లూనుకున్న నేటి రోజుల్లో.. కోటానుకోట్లుగా డేటా ప్రతిరోజూ తయారవుతున్న నేపథ్యంలో.. దానితో పనిచేయడం, డేటాను అర్థం చేసుకోవడం అవసరం. మరిన్ని వివరాలు పరిశీలిస్తే...

Updated : 30 Nov 2023 06:40 IST

డేటా లిటరసీ.. మరో కొత్త నైపుణ్యం! కెరియర్‌ మొదలుపెట్టే వారు  నేర్చుకోవాల్సిన స్కిల్స్‌లో ఇదీ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సమాచార వ్యవస్థ విపరీతంగా వేళ్లూనుకున్న నేటి రోజుల్లో.. కోటానుకోట్లుగా డేటా ప్రతిరోజూ తయారవుతున్న నేపథ్యంలో.. దానితో పనిచేయడం, డేటాను అర్థం చేసుకోవడం అవసరం. మరిన్ని వివరాలు పరిశీలిస్తే...

డేటా వినియోగంతో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే తీరు ఎంతగానో మారిపోయింది. సంస్థలు తమ డేటా నిర్వహించడానికి గతంలో కంటే ఇప్పుడు రెండు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం గత ఐదేళ్లలో డేటా లిటరసీ అవసరం సంస్థల్లో 30 శాతానికిపైగా పెరిగింది!

అంటే ఏమిటి?

సాధారణ లిటరసీ అనే పదానికి ఎటువంటి అర్థం ఉందో.. డేటా లిటరసీ కూడా ఇంచుమించు అంతే, సమాచారాన్ని చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, దాన్ని ఆధారంగా చేసుకుని ఇన్‌సైట్స్‌ తయారుచేయడం..  ఇవన్నీ డేటా లిటరసీలో భాగం. వివిధ ఫార్మాట్లలో అంటే గ్రాఫ్‌లు, చార్టులు, రిపోర్టులుగా ఉన్న డేటాను చదివి అర్థం చేసుకోగలగడం ఇందులో ప్రధానం. ఉదాహరణకు ఒక కంపెనీ వార్షిక ఆర్థిక నివేదికను చదివితే మనకు అర్థం కావాలి. అలాగే డేటాను సమీకరించడం, దాన్ని నిర్వహించడం కూడా వచ్చి ఉండాలి.

ఎందుకు?

పెద్ద పెద్ద వ్యాపారాల్లో నష్టదాయకమైన నిర్ణయాలకు తప్పుడు సమాచారం కూడా కారణం అవుతుంది అనేది ఒక అభిప్రాయం. దీని వల్ల యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కావడంతోపాటు ఉత్పత్తి తగ్గిపోవడం, ఆవిష్కరణలు అంతగా ఆదరణకు నోచకపోవడం, మార్కెట్‌ వ్యూహాలు పనిచేయకపోవడం వంటి రిస్కులు ఎదురవుతాయని సంస్థల విశ్వాసం. అందుకే ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా సమాచారాన్ని ఇచ్చే మార్కెట్‌ డేటాను సరిగ్గా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.  ఇది సంస్థలు, అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది.

  • బలమైన డేటా లిటరసీ స్కిల్స్‌ ఉన్నవారికి అధిక వేతనాలు అందించి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫేక్‌ న్యూస్‌, డీప్‌ఫేక్‌ వంటివి రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో డేటా లిటరసీ అత్యంత అవసరం. ఇది కేవలం సంస్థలు, వ్యాపారాలకే కాదు, వ్యక్తులుగా ఉద్యోగులకు సైతం ఆవశ్యకం. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ప్రపంచంలో భద్రంగా మెలిగేందుకు.. డేటా లిటరసీ దోహదం చేస్తుంది.
  • డేటా లిటరసీ పొందేందుకు వెర్బల్‌, న్యూమరికల్‌, గ్రాఫికల్‌ పద్ధతుల్లో సన్నద్ధం కావాలి. అంటే టెక్ట్స్‌, నంబర్స్‌, గ్రాఫిక్స్‌ను చదివి అర్థం చేసుకోవడం సాధన చేయాలి. అయితే ఇదంత సులభమేం కాదు, కానీ అభ్యర్థులు శ్రద్ధ వహించి సాధన చేస్తే తప్పక పట్టు సంపాదించవచ్చు. అలా అని డేటా లిటరసీ టెక్నికల్‌ నాలెడ్జ్‌కు సంబంధించింది అనుకుంటే పొరపాటే. ఇది డేటాను వినియోగించేందుకు కావాల్సిన నైపుణ్యాలపై ఆధారపడుతుంది.

ఎలా?

  • రోజువారీ ఉద్యోగాలు, పనుల్లో డేటా లిటరసీ మనకు ఈ కింది విధాలుగా ఉపయోగపడవచ్చు.
  • గూగుల్‌ అనలిటిక్స్‌ వంటి వెబ్‌ అనలిటిక్స్‌ టూల్స్‌ ఉపయోగించి తయారైన నివేదికలను చదివి అర్థం చేసుకోవడం.
  • టాబ్లూ, లుకర్‌ వంటి బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ ఇచ్చే నివేదికలను చదవగలగడం.
  • ఎక్సెల్‌ లేదా ఎయిర్‌టేబుల్‌ వంటివి ఉపయోగించి స్ప్రెడ్‌ షీట్స్‌ తయారుచేయడం.
  • పనిలో మన వద్దనున్న డేటాకు తగిన విజువలైజేషన్‌ చార్ట్‌ను ఎంచుకోవడం.
  • తప్పుదోవ పట్టించేలా, వాస్తవాలకు దూరంగా ఉన్న సమాచారాన్ని గుర్తించడం.  
  • నిర్ణయాలు తీసుకునే వారు సరైన దిశలో పయనించేలా సమాచార ఆధారిత నివేదికలు తయారుచేయడం.

2022లో వచ్చిన డేటా హెల్త్‌ బారోమీటర్‌ సర్వే ప్రకారం 99 శాతం కంపెనీలు తమ ఎదుగుదలకు డేటా ముఖ్యమని భావిస్తున్నాయి, అదే సమయంలో 97 శాతం కంపెనీలు డేటాను సక్రమంగా వినియోగించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి  డేటా నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం. 65 శాతం కంపెనీలు ఇప్పటికే డేటా లిటరసీ ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టినట్లు చెబుతున్నాయి.

సంస్థలకు..

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలోనూ కచ్చితమైన నిర్ణయాలను వేగంగా అమలు చేయడంలోనూ డేటా లిటరసీ ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది ఆవిష్కరణలో అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం డేటా కల్చర్‌ సంస్థల్లో ఒక ప్రధానాంశంగా మారింది. ఉద్యోగులందరికీ డేటాను హ్యాండిల్‌ చేయడం రావాలని యాజమాన్యాలు కోరుకుంటున్నాయి. అంటే అందరూ పూర్తిగా టెక్నికల్‌ అంశాలపై పట్టు సాధించాలని కాదు, కానీ డేటాను విశ్లేషించడంలో ప్రతి విభాగం వారికీ అవగాహన ఉండాలనేది దీని సారాంశం.

ముఖ్యవిభాగాలు

ఇందులో డేటా రిసోర్సులు, కన్‌స్ట్రక్ట్స్‌, అనలిటికల్‌ మెథడ్స్‌ - టెక్నిక్స్‌, కేస్‌ అప్లికేషన్లను వినియోగించడం.. వంటి పలు విభాగాలు ఉంటాయి. డేటా సైంటిస్ట్‌, డేటా అనాలిసిస్‌, బిగ్‌ డేటా... వీటికి పెరుగుతున్న డిమాండ్‌ను గమనిస్తూనే ఉన్నాం. డేటాకు పెరుగుతున్న ప్రాధాన్యానికి ఇదో సూచిక. వివిధ టూల్స్‌ను ఉపయోగించడం, డేటాలో వాడే భాషను నేర్చుకోవడం, మొత్తంగా దీన్ని అర్థం చేసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ కేటాయించడం ద్వారా డేటా లిటరసీపై పట్టు సాధించవచ్చు. మరింత తెలుసుకోవాలి అనుకునేవారి కోసం వివిధ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికల్లో  కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని